KTR | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): గుండెపోటు వచ్చిన అన్నదాతకు బేడీలు వేయడం అమానవీయమని, రేవంత్‌రెడ్డి కూృర మనస్తత్వానికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గిరిజన రైతు హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే అంబులెన్స్‌లో స్ట్రెచ్చర్‌పై తీసుకురావాల్సింది పోయి పోలీస్ జీపులో నడిపిస్తూ దవాఖానకు తరలించారని మండిపడ్డారు. ఈ దారుణ ఘటన కొత్త క్రిమినల్ చట్టం భారత న్యాయ సంహితతోపాటు పోలీస్ మాన్యువల్స్, జైల్ మాన్యువల్స్ ప్రకారం కూడా అండర్ ట్రయల్ ఖైదీల హకులను హరించడమేనని తేల్చిచెప్పారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని, గవర్నర్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తిచేశారు.
హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసంలో గురువారం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ లగచర్ల ఘటనలో సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు బుధవారం గుండెనొప్పి వస్తే వైద్య సాయం అందించడంలో ప్రభుత్వం అలసత్వం చూపిందని మండిపడ్డారు. హీర్యాకు గుండెపోటు వచ్చిన విషయాన్ని కుటుంబసభ్యులకు, బయటకు చెప్పకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దవాఖానకు తరలించకుండా, చికిత్స అందించకుండా అమానవీయంగా వ్యవహరించిందని విమర్శించారు. గురువారం ఉదయం హీర్యానాయక్‌కు మళ్లీ గుండెపోటు రావడంతో సంగారెడ్డి జిల్లా దవాఖానకు పోలీస్ జీపులో బేడీలు వేసి తీసుకొచ్చారని మండిపడ్డారు. ‘రైతుకు సంకెళ్లు వేసిన ఫొటోలను మీడియాకు చూపించారు. ఇప్పుడు మేము ఒత్తిడి తేవడంతో హైదరాబాద్ తరలిస్తామని చెప్తున్నారు. రైతులు రాఘవేంద్ర, బసవప్ప ఆరోగ్యం కూడా తీవ్రంగా క్షీణించింది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
గిరిజన రైతులు జైళ్లలో ప్రాణాపాయ స్థితిలో మగ్గుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జైపూర్‌లో విందులు, వినోదాల్లో జల్సాలు చేసుకుంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. గుండెపోటు వచ్చిన అండర్ ట్రయల్ ఖైదీలకు బేడీలు వేసి పోలీస్ జీపులో దవాఖానకు తరలించడం వారి హకులను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మా సామ్రాజ్యంలో మేము చెప్పిందే నడవాలి.
నేను రారాజును అనే అహంకారంతోనే రేవంత్‌రెడ్డి ఆయన సోదరులు గిరిజన రైతుల ప్రాణాలు తీస్తున్నారు’ అని కేటీఆర్ నిప్పులుచెరిగారు. కేవలం తన మాట వినలేదన్న ఏకైక కారణంతోనే గిరిజన రైతులపై రేవంత్‌రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. తప్పు చేయకపోతే ఫార్మా విలేజ్‌ను రద్దుచేసి పారిశ్రామిక కారిడార్ అనే కొత్త విధానం ఎందుకు ఎత్తుకున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. బేషజాలకు పోకుండా రైతుల జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీకి నిజంగా హృదయం ఉంటే.. గిరిజనుల మీద ప్రేమ ఉంటే.. వెంటనే లగచర్ల రైతులపై కేసులు రద్దు చేయాలని ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలి. ప్రభుత్వానికి చేతకాకుంటే అరస్టైన రైతులకు కావాల్సిన వైద్య సాయాన్ని, సహకారాన్ని మా పార్టీ తరఫున అందిస్తం.
-కేటీఆర్
తమ భూములు గుంజుకుంటున్న ప్రభుత్వంపై సరిగ్గా నెల రోజుల క్రితం లగచర్ల రైతులు తిరగబడ్డారని కేటీఆర్ గుర్తుచేశారు. ‘తనపై ఎలాంటి దాడి జరగలేదని కలెక్టర్ ప్రతీక్‌జైన్ చెప్పారు. కానీ, ప్రభుత్వం తన కిరీటం కిందపడినట్టు, అహంకారం దెబ్బతిన్నట్టు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిష్టకు నష్టం కలిగినట్టు భావించి అదే రోజు 17 మంది రైతులను అరెస్టు చేయించారు. కేబీఆర్ పార్కులో వాకింగ్ చేస్తున్న మా పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని తెల్లవారజామునే అరెస్టు చేయించారు. అదుపులోకి తీసుకున్న రైతన్నలందరిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి టార్చర్ పెట్టారు.
పోలీసులు చేసిన థర్డ్ డిగ్రీ గురించి న్యాయమూర్తి ఎదుట ఎందుకు చెప్పలేదని అడిగితే.. తమ కుటుంబసభ్యులను కూడా కేసుల్లో ఇరికిస్తామని, భౌతికదాడులు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించిందని బాధపడ్డారు. అదానీ కోసం, అల్లుడి కోసం భూములు గుంజుకుంటామంటే ఇవ్వకపోవడమే రైతులు చేసిన తప్పా? రేవంత్‌రెడ్డి అహంకారం వల్లే రైతులు జైళ్లలో మగ్గుతున్నారు’ అని కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే అనిల్ జాదవ్, పట్నం శృతి, శాన్వీ, అవినాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.