యూనివర్సిటీలో గుంటనక్కలు ఉన్నాయని, పేమెంట్బ్యాచ్ అంటూ విద్యార్థులను అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడటం బాధాకరం. ముఖ్యమంత్రిననే ఇంగితజ్ఞానం కోల్పోయి మానసిక రోగిలా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను గుంటనక్కలని అంటున్న రేవంత్‌ను, వారు పందికొక్కు అంటున్నారు.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ‘కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఎవరూ కొనవద్దు. అనవసరంగా ఇబ్బందుల పాలుకావద్దు. ఇది నా విజ్ఞప్తి. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఆ భూములను స్వాధీనం చేసుకొని మాన్‌హట్టన్ సెంట్రల్‌పార్క్ తరహాలో విశాలమైన ఎకో పార్క్‌గా అభివృద్ధి చేస్తాం. ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం. మూడేండ్ల తరువాత జరిగేది ఇదే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. మూడేండ్ల తరువాత అధికారంలోకి వస్తామని, ఆ భూములను హెచ్‌సీయూ ఇచ్చేస్తామని, ఆ భూమిని కొన్నవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. ప్రభుత్వం భూముల అమ్మకాన్ని ఆపాల్సిందేనని డిమాండ్ చేశారు. సర్కార్ మొండిగా ముందుకెళ్తే, హైదరాబాద్ ప్రజలతో కలిసి హెచ్సీయూకు మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు.
పది రోజులుగా విద్యార్థులు నిద్రాహారాలుమాని ఆందోళన చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం, భూముల కోసం మాత్రం అర్ధరాత్రి వేళ బుల్డోజర్లను పంపి అరాచకం సృష్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గచ్చిబౌలి భూములను కాపాడేందుకు వీరోచిత పోరాటం చేస్తున్న విద్యార్థులకు సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు. వారి పోరాట పంథా గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఓయూ, కేయూ, టీయూ, మహాత్మాగాంధీ యూనివర్సిటీల విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని గుర్తుకు తెస్తున్నదని పేర్కొన్నారు. హెచ్‌సీయూ విద్యార్థి ఉద్యమానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని ప్రకటించారు. ఆ భూములు యూనివర్సిటీవా? ప్రభుత్వానివా? అనే విషయం అప్రస్తుతమని, వాటిని కాపాడుకోవడమే ముఖ్యమని స్పష్టంచేశారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీ జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కార్తీక్‌రెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి తాను ప్రజల ఆస్తులకు ధర్మకర్త మాత్రమేనని, ఓనర్ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజలే ఓనర్లు. సీఎం భూమిని వస్తువుగా మాత్రమే చూస్తూ తెగనమ్మేందుకు ఆరాటపడుతున్నారు.
– కేటీఆర్
యూనివర్సిటీలోని వివిధ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు భూములను రక్షించేందుకు పోరాడుతూ హైదరాబాద్‌పై ప్రేమను చాటుకుంటున్నారని, కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా అమ్మేందుకు కంకణం కట్టుకున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరవేసి పచ్చని భూముల్లోకి బుల్డోజర్లు, జేసీబీలను దింపుతూ అరాచకపర్వానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ది ప్రజా ప్రభుత్వమైతే ఆందోళన చేస్తున్న విద్యార్థులతో చర్చించాలని, ముఖ్యమంత్రికి సమయం లేకుంటే మంత్రులనైనా పంపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి ఉంటే ఫోర్త్సిటీగా చెప్పుకుంటున్న ప్రాంతంలో ఏర్పాటుచేయాలని, ప్రైమ్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయవద్దని హితవు చెప్పారు. యూనివర్సిటీ భూముల జోలికొస్తే, ఎట్టిపరిస్థితుల్లోనూ ఊరుకోబోమని హెచ్చరించారు.
హెచ్‌సీయూ క్యాంపస్‌లో వన్యప్రాణులు లేవని, కొందరు సోషల్‌మీడియాలో ఏఐ ద్వారా జంతువుల చిత్రాలు సృష్టిస్తున్నారంటూ అక్కడే చదువుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడటం సిగ్గుచేటని కేటీఆర్ దుయ్యబట్టారు. అక్కడ జంతువులు లేవంటూ భట్టి తన కృత్రిమ మేధస్సును బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు ముఖ్యమంత్రి మెప్పు, కమీషన్ల కోసమే వాస్తవాలను పక్కదోవపట్టిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా నియంతృత్వ ధోరణిని వీడి ప్రజాహితానికి చొరవ చూపాలని సూచించారు.
రేవంత్‌రెడ్డి 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పుకుంటున్నారు. కానీ, మనిషిలాగా ఓ పది, పదిహేను నిమిషాలు ఆలోచించు. తాతలాగా, తండ్రిలాగా భవిష్యత్తు తరాల కోసం పనిచెయ్. అంతేగానీ, రియల్ఎస్టేట్ బ్రోకర్లా భూములను అమ్మకానికి పెట్టవద్దు. సీఎంకు, మంత్రులకు ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడింది. ప్రజలను బానిసల్లా చూస్తూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. వారికి ఆస్తులు పెంచుకోవడంపై ఉన్న ధ్యాస ప్రజల బాగోగులపై లేదు.
– కేటీఆర్
కోర్టు సెలవులను చూసుకొని శని, ఆదివారాలు, ఉగాది, రంజాన్ పండుగల రోజున ప్రభుత్వం హెచ్‌సీయూలో విధ్వంసానికి దిగిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి అరాచకపర్వానికి తెరలేపిందని మండిపడ్డారు. గతంలో హైడ్రా, మూసీ బాధితుల విషయంలో హైకోర్టు చేసిన హెచ్చరికలను పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఇప్పుడు దొంగచాటున గచ్చిబౌలి భూముల్లోకి బుల్డోజర్లను పంపి చెట్లను కూల్చివేస్తూ నోరులేని జీవరాసులను వధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో లగచర్ల రైతులు, మూసీ, హైడ్రా బాధితుల విషయంలోనూ ఇదే తీరున దుర్మార్గాలకు పాల్పడిందని మండిపడ్డారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో పర్యావరణ పరిరక్షణ, హరితహారంలో మొక్కల పెంపకానికి విరివిగా ప్రాధాన్యం ఇచ్చామని కేటీఆర్ గుర్తుచేశారు. ఎఫ్ఎస్ఐ అంచనాల ప్రకారం హరితహారంలో భాగంగా 270 కోట్ల మొక్కలు నాటి 7.7% పచ్చదనం పెంచామని తెలిపారు. హరిత విస్తరణలో తెలంగాణ నాడు దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని, హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దామని చెప్పారు. అదే స్ఫూర్తితో గచ్చిబౌలి భూములను కాపాడుకుంటామని స్పష్టంచేశారు. ఇందుకోసం కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నామని, హెచ్‌సీయూ భూములను కాపాడాలని పార్లమెంట్లో తమ సభ్యులు సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారని వివరించారు. కాంగ్రెస్ మాత్రం పర్యావరణ పరిరక్షణను గాలికొదిలి పనులు చక్కబెట్టుకొనేందుకే అధికారాన్ని వినియోగించుకుంటున్నదని ఆరోపించారు. పశ్చిమ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటుచేసిన వందలాది ఎకో, లంగ్‌స్పేస్ పార్కులను విధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల గోడు, వన్యప్రాణుల వేదన పట్టడంలేదని ఆక్షేపించారు.
హెచ్‌సీయూ భూముల వేలం విషయంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ బీఆర్ఎస్పై చేసిన ఆరోపణలకు కేటీఆర్ ఘాటుగా బదులిచ్చారు. ఆయన అవగాహన పెంచుకొని మాట్లాడాలని, పార్లమెంట్లో ప్రజల తరఫున కొట్లాడాలని చురకలంటించారు. పాన్గుట్కా తినుకుంటూ టైంపాస్ చేయవద్దని హితవు పలికారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి భూముల అమ్మకాన్ని నిలిపి వేయించాలని డిమాండ్ చేశారు. అడ్డదిడ్డంగా మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. హెచ్‌సీయూ విద్యార్థుల ఉద్యమానికి అండగా ఉంటామని పునరుద్ఘాటించారు.
రాహుల్‌గాంధీకి విద్యార్థులపై, హైదరాబాద్ ప్రజలపై ప్రేమ ఉంటే హెచ్‌సీయూకి రావాలి. రాహుల్ దేశవ్యాప్తంగా తిరుగుతూ మొహబ్బత్ కీ దుకాణ్ అని మాట్లాడుతున్నారు. కానీ, ఇక్కడ రేవంత్ మాత్రం విద్వేష దుకాణం తెరిచారు.
– కేటీఆర్
హెచ్‌సీయూలో రేవంత్ సర్కార్ అరాచకాలకు పాల్పడుతుంటే, రాహుల్‌గాంధీ ఎందుకు మౌనం వహిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో వేముల రోహిత్ మరణించిన సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్‌గాంధీకి బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రత కల్పించి విద్యార్థులతో మాట్లాడించిందని గుర్తుచేశారు. కానీ, నేడు రేవంత్ ప్రభుత్వం విద్యార్థినుల బట్టలు లాగేసి, ఇష్టమొచ్చినట్టుగా దాడులు చేస్తుంటే తప్పిపోయిన రాజకీయ నేత, పొలిటికల్ టూరిస్ట్ రాహుల్ చేష్టలుడిగి చూస్తుండటం విడ్డూరమని ఎద్దేవా చేశారు.