Hyderabad | నేను ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే చాలా ప్రగతిశీలమైన అభివృద్ధిని చూశాను. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి అనుభూతిని పొందలేదు. టీ-హబ్ చాలా అద్భుతంగా ఉన్నది. ప్రస్తుతం కల్పిస్తున్న మౌలిక వసతుల కారణంగా భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుంది.
–యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్షాలీ
హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్నదని, తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తున్నదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాయబారి అబ్దుల్ నసీర్ అల్షాలీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం కల్పిస్తున్న మౌలిక వసతుల కారణంగా భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టం, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని ప్రత్యేకంగా కొనియాడారు. సోమవారం ఆయన ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామికరంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను యూఏఈ రాయబారికి మంత్రి కేటీఆర్ వివరించారు.
ఇప్పటికే హైదరాబాద్‌లోని స్టార్టప్ ఎకో సిస్టంతో ఫ్రాన్స్ అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఇకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈ లోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్‌కు పరిచయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనిపై యూఏఈ రాయబారి సానుకూలంగా స్పందిస్తూ.. తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను హైదరాబాద్ ఇకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అల్షాలీ హైదరాబాద్‌లోని టీహబ్‌ను సైతం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణలో పెంపొందిస్తున్న ఇన్నోవేషన్ ఇకో సిస్టం గురించి టీ-హబ్ సీఈవో ఎం శ్రీనివాసరావు, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సీఐవో) డాక్టర్ శాంతా తౌటం వివరించారు. తాను ఇక్కడ అడుగు పెట్టిన వెంటనే చాలా ప్రగతిశీలమైన అభివృద్ధిని చూశానని అల్షాలీ కొనియాడారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి అనుభూతిని పొందలేదని, టీ-హబ్ చాలా అద్భుతంగా ఉన్నదని మెచ్చుకున్నారు. ఇక్కడి పచ్చదనం, ప్రకృతి దృశ్యం, మౌలిక వసతులు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.
దుబాయ్‌లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయుల విడుదలకు సహకరించాలని యూఏఈ రాయబారి అల్షాలీని మంత్రి కేటీఆర్ కోరారు. 2005లో నేపాల్‌కు చెందిన దిల్‌ప్రసాద్‌రాయ్ మృతి కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేశ్, శివరాత్రి రవి, శివరాత్రి హనుమంతు, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్ ప్రస్తుతం దుబాయ్ జైలులో ఉన్నారని వివరించారు. యూఏఈ చట్టాల ప్రకారం (షరియా చట్టం) రూ.15 లక్షల పరిహారం స్వీకరించేందుకు బాధిత కుటుంబం అంగీకరించిందని, వారిని 2013లోనే తాను నేపాల్‌లో స్వయంగా కలిశానని కేటీఆర్ తెలిపారు. షరియా చట్టంలోని దియ్యా ప్రకారం బాధితుల కుటుంబం క్షమాపణ పత్రం ఇస్తే.. వీరిని విడుదల చేసే అవకాశం ఉన్నదని, ఈ నేపథ్యంలో బాధితుని కుటుంబం 2013లోనే అవసరమైన అన్ని డాక్యుమెంట్లను దుబాయ్ ప్రభుత్వానికి సమర్పించిందని గుర్తుచేశారు. ఈ విషయంపై ఇప్పటికే భారత దౌత్య కార్యాలయంతోపాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి సైతం అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేశానని కేటీఆర్ తెలిపారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరసరించిందని, ఇక దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాభిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని వివరించారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని కేటీఆర్ కోరారు.