KTR | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): మార్పు అంటూ కాంగ్రెసోళ్లు తెలంగాణ ప్రజల కొంప ముంచారని, గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ వచ్చాకనే ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు చూస్తున్నామని, ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మా ర్పు అంటే పస్తులుంచుడేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునేదాకా ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటామని తేల్చిచెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా.. జైల్లో వేసినా జనం కోసం గొంతెత్తుతూనే ఉంటామని స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆటోడ్రైవర్స్ యూనియన్ జేఏసీ అధ్యర్యంలో ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో మంగళవారం జరిగిన మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు. ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని, గిరాకీలేక ఆటోడ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని విచారం వ్యక్తంచేశారు.
ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం దారణమని మండిపడ్డారు. వారికి ప్రతినెల రూ.5వేల చొప్పున చెల్లించాలని, థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే చేయించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఉండేదని గుర్తుచేశారు. ఇప్పుడు అది కొనసాగడం లేదని డ్రైవర్లు చెప్తున్నారని, దాన్ని కొనసాగించడమే కాకుండా రూ.10 లక్షలకు పెంచి డ్రైవరన్నల మనసుకు కాంగ్రెస్ సర్కార్ చూరగొనాలని సూచించారు. అసంఘటిత రంగ కార్మకుల హక్కుల కోసం మనందరం కలిసికట్టుగా పోరాడాలని, జెండాలన్నీ ఒక్కటి కావాలని, ఎజెండా ఒక్కటై ఉండాలని పిలుపునిచ్చారు. మహాలక్ష్మి పథకానికి తాము వ్యతిరేకం కాదని, వీలైతే బస్సుల సంఖ్య పెంచాలని కోరారు. మహాలక్ష్మి అని నెలకు రూ.2,500 ఇస్తానని, వృద్ధులకు నెలకు రూ.4 వేలు ఇస్తానని ప్రగల్భాలు పలికారని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ సంక్షేమం అంటూ ఊదరగొట్టారని విమర్శించారు.
ప్రతి ఇంటికీ ఏడాదికి రూ.2.50 లక్షల విలువజేసే వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు. ‘కాంగ్రెస్ వచ్చి 11 నెలలైనా ఇంకా హామీలు ఎందుకు నెరవేరలేదు? తెలంగాణలో వచ్చిన మార్పు ఏందీ? మన జీవితాల్లో వచ్చిన వెలుగులు ఏవీ?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో కొత్తగా 20 వేల ఆటోలకు పర్మిట్లు ఇస్తామని చెప్పారని అది అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2019లో తెచ్చిన చట్టం వల్ల ఇబ్బంది అవుతున్నట్టు డ్రైవర్లు చెప్తున్నారని, దానిని మినహాయించాలని కోరారు. ఆటో డ్రైవర్లకు ఎలాంటి నష్టం జరిగినా వారి తరఫున కొట్లాడుతామని హామీ ఇచ్చారు. ఈ ధర్నాకు కూడా పోలీసులు ఇబ్బందులు పెట్టినట్టు చెప్తున్నారని తెలిపారు. పోలీసోళ్లే వాళ్ల కుటుంబ సభ్యులను కొడుతున్నారని, డిచ్పల్లి బెటాలియన్ వద్ద ఇది జరిగిందని గుర్తుచేశారు.
సీఎం బయట తిరుగొద్దని కాంగ్రెసోళ్లే అంటుండ్రు
సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్తే జనం ఎక్కడ తంతారోనని రేవంత్‌రెడ్డికి భయం పట్టుకున్నదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. అందుకే పోలీసులు లేకుండా ఆయన ఎక్కడికీ వెళ్లే పరిస్థితి లేదన్నారు. ‘నల్లగొండలో కాంగ్రెసోళ్లు మీటింగ్ పెట్టుకున్నరు. అందులో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నాడంట. కాంగ్రెస్ మీటింగ్‌ల కాంగ్రెస్ వ్యక్తియే చెప్తున్నడు. అన్న మనం ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు. పింఛన్లు పెంచలేదు. జనంలోకిపోతే తంతరు. ముఖ్యమంత్రి జరభద్రం అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికే చెప్పే పరిస్థితి ఉన్నది’ అని దెప్పిపొడిచారు. ఏక్ పోలీస్ నినాదం తాము ఇవ్వలేదని, కాంగ్రెస్సే ఇచ్చిందని గుర్తుచేశారు. సీఎం సెక్యూరిటీ నుంచి బెటాలియం సిబ్బందిని తీసేశారని ఇప్పుడు పోలీసులను ముఖ్యమంత్రే నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. ఆటో అన్నలు తలుచుకుంటే బాషా సినిమాలో రజనీకాంత్‌లా 50 వేల మందినైనా తెచ్చి ధర్నా చేయగలరని, వాళ్ల సత్తా తమకు తెలుసునని చెప్పారు. ‘మార్పు మార్పు అనుకుంటూ చాలా మంది తమకు తామే తమ కొంపలు ముంచుకున్నరు’ అని చెప్పారు. మహాధర్నాలో ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, బండారు లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజ్, తక్కెళ్లపల్లి రవీందర్, నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాస్యం వినయ్ భాస్కర్, ఏఐటీయూసీ వెంకటేశం, బీఆర్టీయూ వేముల మారయ్య, సీఐటీయూ శ్రీకాంత్, టీయూసీఐ ప్రవీణ్, ఆటోయూనియన్ నాయకులు సలీంభాయ్, సత్తిరెడ్డి, గడ్డం శ్రీనివాస్ పాల్గొన్నారు.
కష్టాలు తెలుసుకుంటూ.. ఆటోలో కేటీఆర్!
తెలుగు తల్లి ఫ్లై ఓవర్ నుంచి ధర్నాచౌక్ వరకు కేటీఆర్ ఆటోలోనే ప్రయాణించారు. డ్రైవర్ యూనిఫాం ధరించి డ్రైవర్లందరికీ తోడుగా నిలిచారు. డ్రైవర్ వెంకట్‌తో మాట్లాడుతూ ఆటోడైవర్ల కష్టాలపై అడిగి తెలుసుకున్నారు. తనది ఇబ్రహీంపట్నం అని ఇక్కడే ఆటో నడుపుకొంటున్నానని, గతంలో రోజుకు రెండు వేల దాకా గిరాకీ ఉండేదని వెంకట్ చెప్పాడు. ఇప్పుడు కనీసం 800 కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయాడు. ఖర్చులన్నీ పోనూ 300 కూడా మిగలడం లేదని తన గోడు వెల్లబోసుకున్నాడు. తెలంగాణ ఏర్పడ్డాక సంక్షేమ ఫలాలు పొందామని, కాంగ్రెస్ వచ్చాక ఆటోడ్రైవర్ల బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశాడు. డ్రైవర్ వెంకట్‌కు భరోసానిస్తూ కేటీఆర్ ధర్నాచౌక్‌కు చేరుకున్నారు. ఆటో డ్రైవర్లంతా కేటీఆర్ వస్తున్నాడని తెలిసి ఆటోకు ఎదురెళ్లి స్వాగతం పలికారు. ‘జై తెలంగాణ’ అంటూ పెద్దపెట్టున నినదించారు.
గిరాకీ లేక ఆటోడ్రైవర్ల బతుకులు రోడ్డునపడ్డయి. ఈఎంఐలు, ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు కట్టలేక అరిగోస పడుతున్నరు. వారికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని మాట ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది. హామీని అమలు చేయడమే కాదు.. ప్రతినెలా ఆటోడ్రైవర్లకు రూ.5 వేల చొప్పున చెల్లించాలి.
-కేటీఆర్
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి.. ఆటోలో ఎక్కి డ్రైవర్ల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తనని తియ్యటి పుల్లటి మాటలు చెప్పిండు. ఆటో డ్రైవర్లకు అందమైన రంగుల కలను
చూపెట్టిండు. ప్రతి ఆటోడ్రైవర్‌కు నెలకు వెయ్యి రూపాయలు ప్రత్యేకంగా ఇస్తమని నమ్మించిండు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడున్నడు?
– కేటీఆర్
కుటుంబం గడుస్తలేదుఫ్రీ బస్సుతో మా పరిస్థితి ఘోరంగా తయారైంది. గిరాకీ లేక ఆటోడ్రైవర్లమంతా రోడ్డునపడ్డం. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నం. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నం. ఆటో ఫైనాన్స్‌లు కట్టలేక అరిగోస పడుతున్నం. ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు.
-జే అశోక్, ఆటో డ్రైవర్, సంగారెడ్డి జిల్లా
చాలామంది ఆత్మహత్య చేసుకున్నరు
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నరు. మాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడిగినప్పుడల్లా దాటవేస్తున్నది. గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు ఒక్కటి కూడా అమలు కాలేదు. ఆటోడ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
-ఎం కృష్ణయ్య, ఆటో డ్రైవర్
రేవంత్‌రెడ్డి ఒక్క హామీ నెరవేర్చలే
అనేక మాటలు చెప్పిన రేవంత్‌రెడ్డి గత 11 నెలల నుంచి ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలని చెప్పి అందర్నీ ఆగం చేసింది. మా బతుకులను రోడ్డు పాలుచేసింది. మాకు నెలకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి 11 నెలలవుతున్నా ఇస్తలేరు.
-రామ్ కిషన్, ఆటోడ్రైవర్
కాంగ్రెస్‌ను నమ్మి అప్పుల పాలైనం
కాంగ్రెస్‌ను నమ్మి ఇప్పుడు అప్పులపాలైనం. ఉచిత బస్సుల పుణ్యమా అని ఆటోలకు గిరాకీ లేక మా బతుకులు రోడ్డునపడ్డయ్. రోజు మొత్తంలో రూ.400 కూడా వస్తలేవు. మా కుటుంబాలను ఎట్ల పోషించుకోవాలె? ఇంటి కిరాయిలు, స్కూల్ ఫీజులు, లోను డబ్బులు ఎట్ల కట్టాలె? ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలిచ్చి ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.
-కే వీరయ్య, ఆటో డ్రైవర్