‘హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమ నం దిశగా సాగుతున్నదని, క్యాలెండర్లు మారుతున్నా ప్రజల జీవితాల్లో మాత్రం ఎలాంటి సానుకూల మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ డైరీ, క్యాలెండర్‌ను తెలంగాణభవన్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు మళ్లీ ప్రస్తుత సర్కారు హయాంలో తిరిగి వస్తున్నాయని మండిపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా నేడు అందరూ వేడుకల్లో ఉంటే, రైతులు మాత్రం యూరియా కోసం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఉద్యమస్ఫూర్తితో ముందుకెళ్తున్నారని చెప్పారు. 2028లో తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏండ్లపాటు కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిందని, ఆ ప్రగతి సంతకాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని స్పష్టం చేశారు. రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. లగచర్ల లడాయి, హెచ్‌సీయూ భూములు ఇలా అనేక అంశాల్లో ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై జంగ్ సైరన్ మోగించారని గుర్తుచేశారు. జెండాను చేతబట్టి నడిపించే నాయకులకంటే, ఆ జెండాను భూమిలో నిటారుగా పాతి ‘ఇది నా జెండా’ అని గర్వంగా చెప్పే కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రతి పోరాటం వరకు, లగచర్లలో గిరిజనులపై జరిగిన దాడులకు వ్యతిరేకంగా, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసిన తీ రుకు వ్యతిరేకంగా, రైతుబంధును రెండుసార్లు ఎగ్గొట్టిన అన్యాయంపై, ‘ఆరు గ్యారెంటీలు, 420 హామీలు’పై ప్రజా తిరుగుబాటుకు నాయకత్వం వహించిన కార్యకర్తలను కేటీఆర్ అభినందించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో జరుగుతున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూముల ఆక్రమణను అడ్డుకొని తెగువ చూపిన విద్యార్థులులను ఆయన మెచ్చుకున్నారు.
‘రాష్ట్రమంతా కొత్త సంవత్సర వేడుకల్లో ఉంటే.. రైతులు మాత్రం యూరియా కోసం వేదన పడుతున్నారు. చలికాలంలో కూడా ఒక్క యూరియా బస్తా కోసం గంటలు, దినాల తరబడి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ పాలనలో దాపురించింది.
-కేటీఆర్
ప్రభుత్వ తీరుపై పోరాడటంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్ స్పష్టంచేశారు. రెండు జాతీయ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్పై దాడి చేస్తున్నాయని, పార్టీని తుదముట్టించేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ప్రజలు, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణభవన్‌లో నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మండలి పార్టీ విప్ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, తాటికొండ రాజయ్య, మహమూద్‌అలీ, వీ శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, పార్టీ నాయకురాలు తుల ఉమతో కలిసి బీఆర్ఎస్ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. తదనంతరం పెద్దసంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్యులు కేటీఆర్‌ను కలిశారు. పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, మాధవవరం కృష్ణారావు, మాణిక్‌రావు, అనిల్‌జాదవ్, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, తక్కళ్లపల్లి రవీందర్రావు, వెంకట్రాంరెడ్డి, నవీన్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, మహారెడ్డి భూపాల్‌రెడ్డి, కొప్పుల మహేశ్వర్‌రెడ్డి, గంగాధర్‌గౌడ్, దుర్గం చిన్నయ్య, అంజయ్య యాదవ్, గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవీస్రసాద్, బాలరాజుయాదవ్, వాసుదేవారెడ్డి, పార్టీ నాయకులు క్యామ మల్లేశ్, రాగిడి లక్ష్మారెడ్డి, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, జయసింహ, చిరుమల్ల రాకేశ్ తదితరులున్నారు.
‘గెలుపోటములు శాశ్వతం కాదు. అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతాయి. కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్, గులాబీ జెండా స్థానం మాత్రం శాశ్వతం.. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీ ప్రయాణం నిరంతరం కొనసాగాలి. ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు ఒక ఆట కావొచ్చు.. బీఆర్ఎస్కు మాత్రం రాజకీయాలు ప్రజల సంక్షేమానికి సంబంధించిన ధర్మం..ఒక విధి.
-కేటీఆర్
హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో మళ్లీ మన నీళ్లు, వనరుల దోపిడీకి తెరలేచిందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజమెత్తారు. ఏనాడూ జై తెలంగాణ అని నినదించని సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రాప్రాంత ప్రయోజనాల కోసం నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను బలిపెడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన 2026డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. అలవికాని హామీలిచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండేండ్లుగా దుర్మార్గపు పాలనతో తీరని ద్రోహం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అంటే ఒక రాజకీయ పార్టీయే కాదని, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ అభివర్ణించారు. రాష్ట్ర హక్కుల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆరాటపడుతుందని తెలిపారు. కాల ప్రవాహం ఆగదని, గులాబీ జెండా పోరాటమూ ఆపబోదని ఉద్ఘాటించారు.