హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. పత్రికల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’ అని వార్తలు రావడంపై ఆయన స్పందించారు. పరిపాలనా అనుభవంలేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెల వరకూ కనిపిస్తున్నదని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
విశ్వనగరంగా ఎదుగుతున్న వేళ.. హైదరాబాద్ బ్రాండ్ మసకబారుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం రేవంత్రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వస్తున్నా పోలీసింగ్పై కమాండ్ ఏదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నగరంలో క్రైం రేటు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశరాజధాని చుట్టూ చక్కర్లు కొట్టకుండా చిక్కుల్లో ఉన్న రాష్ట్ర రాజధానిని కాపాడాలని కోరారు. కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే…హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటే రాష్ర్టానికే కాకుండా యావత్ దేశానికి నష్టమని స్పష్టంచేశారు. హైదరాబాద్ తెలంగాణ ఎకానమిక్ ఇంజిన్ అని అభివర్ణించారు.