హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఎప్పటికైనా సక్సెస్ మాత్రమే నిలుస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు ఆయన కొన్ని గణాంకాలను జోడించారు. తెలంగాణ రాష్ట్రం గత ఎనిమిది సంవత్సరాల్లో తలసరి ఆదాయంలో 155 శాతం వృద్ధి సాధించిందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉంటే 2022-23 నాటికి రూ.3.17లక్షలకు చేరుకున్నదని తెలిపారు.
జీఎస్డీపీలో 162 శాతం వృద్ధి సాధించామని, 2014లో రూ.5.05 లక్షల కోట్లు ఉంటే 2022-23 నాటికి రూ.13.27లక్షల కోట్లకు చేరిందని వివరించారు. ఢిల్లీలో పరమానందయ్య ఫేకుడు, ఆయన శిష్యులు ఇక్కడ జోకుడు అంటూ బండి సంజయ్‌ను ఉద్దేశించి కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుంచి అంటూ ఎద్దేవా చేశారు. ‘అచ్చేదిన్, వికాస్ అన్నీ అయిపోయాయి.. ఇప్పుడు వస్తున్నది అమృతకాలం’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అద్వానీని వేడిగా ఉన్న ఆలుగడ్డను విసిరేసినట్టు విసిరేశారు.. కానీ అదానీని ఇప్పుడు అలా విసిరికొట్టే దమ్ముందా అంటూ సవాల్ చేశారు.