రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. ఉద్యమకారిణి, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని తెలంగాణ సత్తెవ్వ(88)కు అన్నీ తానయ్యారు. నాడు డబుల్ బెడ్రూమ్తో పాటు మధ్యమానేరు పరిహా రం, బెనిఫిట్స్ అందించి అండగా నిలిచిన రామన్న, ఆమె చనిపోయిన తర్వాత కూడా అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల 19న సత్తెమ్మ మృతిచెందగా, విషయం తెలుసుకొని కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి వేములవాడ మండలం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీకి చేరుకొని నివాళులర్పించారు.
సొంత ఖర్చులతో అంత్యక్రియలను జరిపించడంతో పాటు స్వయంగా పాడె మోసి కన్నీటి వీడ్కోలు పలికారు. తాజాగా బుధవారం సత్తెవ్వ కర్మకాండ(పెద్దకర్మ)ను సైతం సిరిసిల్ల తెలంగాణ భవన్లోని సొంత ఖర్చులతో వారి కుటుంబసభ్యులు, గ్రామస్తుల సమక్షంలో జరిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్కు సత్తెమ్మ కోడలు రేణుకతో పాటు కుటుంబసభ్యులు రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సత్తెమ్మ ఉద్యమస్ఫూర్తి, సేవలను బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్వీ రాష్ట్ర నేత జక్కుల నాగరాజు యాదవ్ స్మరించుకున్నారు. సత్తెమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కేసీఆర్కు వీరాభిమాని సత్తెవ్వ
తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న చిందం సత్తెవ్వ, తెలంగాణ సత్తెవ్వగా పేరొందింది. 2001లోనే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టడంతో ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ అంటూ ఉ ద్యమ సమావేశాలకు వెళ్తుండేది. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఫొటో ఎక్కడ చూసినా ఉద్వేగానికి లోనయ్యేది. 2009లో సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో తెలంగాణ సత్తెవ్వకు మరింత గుర్తింపు లభించింది. కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తూ ఉద్యమ చైతన్యాన్ని రగిల్చేది.