హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మరువని అమరుడు శ్రీకాంతాచారి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. ‘శ్రీకాంతాచారి అమరత్వం గొప్పది. ఆయన ప్రాణత్యాగాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువరు. తెలంగాణ ఉద్యమకారులపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండ, కేసీఆర్ అరెస్ట్‌ను చూసి తట్టుకోలేకపోయిన శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతై అమరుడయ్యాడు’ అని ఎక్స్ వేదికగా గుర్తుచేసుకున్నారు. శ్రీకాంతాచారి ప్రాణత్యాగం తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేసిందని, శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నానని తెలిపారు. ‘జోహార్ శ్రీకాంతాచారి!.. జై తెలంగాణ’ అని పేర్కొన్నారు.