హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని శాంతియుత ర్యాలీ చేస్తున్న ప్రజలు, పార్టీ నాయకులపై నిర్బంధం దారుణమని, దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో శనివారం పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని పట్టుకొని, రాజ్యాంగ పరిరక్షకులం తామేనని చెప్పుకొనే రాహుల్‌గాంధీ.. తెలంగాణలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న రేవంత్ ప్రభుత్వ తీరును గుర్తించాలని సూచించారు. ఇంత దారుణంగా అక్రమంగా, అన్యాయంగా వ్యవహరించడమే రాజ్యాంగ స్ఫూర్తా? అనే విషయాన్ని రాహుల్ చెప్పాలని నిలదీశారు.
సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. సికింద్రాబాద్ ప్రజల పోరాటానికి అండగా ఉంటామని స్పష్టంచేశారు. అన్ని వర్గాల ప్రజలు ఒకటై ర్యాలీకి పిలుపునిస్తే వేలాది మందిని ఎకడికకడ అరెస్టులు చేశారని తెలిపారు. తమను కూడా తెలంగాణ భవన్లో నిర్బంధించి సీఎం రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. కోర్టు పర్మిషన్తో మళ్లీ బ్రహ్మాండంగా ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ బిడ్డల మనోభావాలను బీఆర్ఎస్ పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆశీర్వాదంతో తమ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత సికింద్రాబాద్‌ను జిల్లాగా మారుస్తామని స్పష్టంచేశారు. ఇప్పటికైనా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని రేవంత్ సర్కారు మానుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ఆమలును పకనపెట్టి కేవలం పేర్లు మార్చడంపైన ఫోకస్ పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను తొలగించి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చారని మండిపడ్డారు.
తెలంగాణ రాజముద్ర నుంచి చార్మినార్‌ను తీసేస్తానని అంటున్నారని తెలిపారు. ఇప్పటికే కాకతీయ కళాతోరణాన్ని తీసేశారని మండిపడ్డారు. టీఎస్‌ను టీజీగా మార్చారని, దీని వల్ల ఎవరికి లాభం జరిగిందని ప్రశ్నించారు. రెండేండ్ల పాలనలో హైదరాబాద్‌లో ఒక కొత్త రోడ్డు వేశావా? ఒక ఫె్లై ఓవర్ కట్టావా? అని రేవంత్‌రెడ్డిని ఆయన నిలదీశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని విమర్శించారు.

ముఖ్యమంత్రికే ఫ్యూచర్ లేదు
ఫ్యూచర్ లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతామంటే ఎవరు నమ్ముతారని కేటీఆర్ ప్రశ్నించారు. చిన్న జిల్లాలతో ప్రజల దగ్గరకు అధికారులు వస్తే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. శాంతియుత ర్యాలీకి వస్తున్న వేలాది మందిని ఎకడికకడ అరెస్టు చేశారని, వారందరినీ వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ హక్కులపై శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజలను అరెస్టు చేయడమే ప్రజాపాలనా? అని ప్రశ్నించారు.
అస్తిత్వంపై దాడి సరికాదు: దేశపతి
సికింద్రాబాద్ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడికి దిగడం సరికాదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మల్కాజిగిరిలో ఓ ముక్కగా సికింద్రాబాద్‌ను మార్చే కుట్రను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో శాంతియుత ర్యాలీని తలపెడితే అణగదొక్కాలని చూస్తున్నారని విమర్శించారు. లష్కర్ అంటే కవాతు అని, ఈ రోజు రేవంత్ ఆపితే ఆగేది కాదని స్పష్టంచేశారు. కా ర్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణీదేవి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, కేపీ వివేకానంద, విజయుడు, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, నాయకులు మన్నె గోవర్ధ న్, సుమిత్రా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
అనుమతి కోరినా అరెస్టులా..?: తలసాని
సికింద్రాబాద్ అస్తిత్వం కోసం ర్యాలీ చేయడానికి ఐదు రోజుల ముందు అనుమతి కోరినా పోలీసులు స్పందించలేదని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు శుక్రవారం రాత్రి అనుమతి లేదని చెప్పారని, ముందే చెబితే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకునే వాళ్లమని స్పష్టం చేశారు. కర్ఫ్యూను తలపించేలా వేలాది మంది పోలీసులతో శాంతియుత ర్యాలీని అడ్డుకున్నారని మండిపడ్డారు. సెక్రటేరియట్ ముందు అనుమతి లేకుండా రేవంత్‌రెడ్డి ర్యాలీ చేస్తే ఒప్పు.. తాము ర్యాలీకి పిలుపునిస్తే తప్పా? అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ప్రజల కోసం మరోసారి కోర్టు నుంచి అనుమతి తీసుకొని ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.