సంగారెడ్డి (నమస్తే తెలంగాణ)/ జహీరాబాద్, మే 14 : కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తిచేసిన పనులను ప్రారంభించి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం క్రెడిట్ కొట్టేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన పనులకు తిరిగి శంకుస్థాపనలు చేసి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగంలోని నిమ్జ్‌పై గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి భూసేకరణ ప్రక్రియ చేపట్టడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసింది.
నిమ్జ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని పెట్టుబడులు తరలివచ్చేలా కృషిచేశారు. జూన్ 22, 2022లో నిమ్జ్‌లో తొలి పరిశ్రమకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. డిఫెన్స్ రంగంలోని వెమ్ టెక్నాలజీ కంపెనీ నిమ్జ్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టి 2వేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకురాగా.. 511 ఎకరాల భూమి కేటాయించడంతోపాటు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు మంజూరు చేసింది. కాగా మంత్రి శ్రీధర్‌బాబు శుక్రవారం నిమ్జ్‌లో వెమ్ టెక్నాలజీ పరిశ్రమ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇది వరకే శంకుస్థాపన జరిగిన కంపెనీకి తిరిగి మంత్రి శంకుస్థాపన చేయనుండడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జూన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి, సీఎం కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ ప్రభుత్వంలో రూ.100 కోట్లతో నిమ్జ్‌కు ప్రత్యేకంగా రహదారి నిర్మాణం చేపట్టారు. జహీరాబాద్‌లో రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించింది.
ఝరాసంగంలో కేంద్రీయ విద్యాలయం భవనం నిర్మాణం చేపట్టింది. హుగ్గెళ్లిలో రూ.45 లక్షలతో బసవేశ్వరుని విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేసీఆర్ హయాంలో పూర్తయిన ఈ పనులను రేవంత్‌రెడ్డి ప్రారంభించి క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా కేటీఆర్ శంకుస్థాపన చేసిన వెమ్ టెక్నాలజీ పరిశ్రమకు తిరిగి మంత్రి దుద్దిళ్ల శంకుస్థాపన చేస్తూ క్రెడిట్‌ను తమ ప్రభుత్వం ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నిమ్జ్ కోసం 2012లో 17 గ్రామాల్లో 12,635 ఎకరాలు సేకరించాలని ప్రతిపాదించగా, ఇప్పటి వరకు 7,588 ఎకరాల భూసేకరణ పూర్తయింది. నిమ్జ్ కోసం మొదటి విడతలో సేకరించిన 2,345 ఎకరాల్లో పారిశ్రామిక స్మార్ట్‌సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూముల్లో అధికారులు కడీలు పాతి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమ భూములకు మెరుగైన పరిహారాన్ని చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
కూలీలకు పునరావాసంతో పాటు భూములు కోల్పోయిన వారికి 125 గజాల ఇంటి స్థలం, ఇండ్లు, ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలను కల్పించాలని రైతులు, కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం సీఎం రేవంత్‌రెడ్డి జహీరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు నిమ్జ్ ప్రాజెక్టులోభూములు కోల్పోయిన 5,612 మంది రైతులకు ఇంటి స్థలాలు, ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. కానీ, నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రులను బాధిత రైతులు కోరుతున్నారు.