పెద్దపల్లి, మే 7(నమస్తే తెలంగాణ): ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాష్ట్ర పోలీసు హౌసింగ్‌బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సహకారంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన మాడ్రన్ పోలీసు కమిషనరేట్‌ను మంత్రి ప్రారంభించనున్నారు. గోదావరిఖని-రామగుండం మధ్య పోలీసు హెడ్ క్వార్టర్స్ ప్రాంగణంలో 29 ఎకరాల స్థలంలో 59 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కమిషనరేట్‌ను సువిశాలంగా నిర్మించారు.
తొలుత మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించనున్న మంత్రి.. ఆ తర్వాత 2.45 గంటలకు హెలికాప్టర్లో గోదావరిఖనికి చేరుకుంటారు. 3 గంటలకు రామగుండం కమిషనరేట్‌ను ప్రారంభించి.. అనంరతం పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. 4 గంటలకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేలా నిర్మించిన పైలాన్‌ను మంత్రి ఆవిష్కరిస్తారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. 5.30 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్‌కు బయలుదేరుతారు.