హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని, బీజేపీకి ప్రత్యా మ్నాయంగా ఎజెండా, మాడల్‌ను దేశానికి అందించడంలో ఆ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఅర్ విమర్శించారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ అతిపెద్ద బలంగా మారారని ఎద్దేవాచేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత దేశంలో కాంగ్రెస్ సాధించిందేమీ లేదని, మరోవైపు రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్తుపై దీర్ఘకాల విజన్ లేదని ధ్వజమెత్తారు. చెన్నయ్‌లోని ఐటీసీ గ్రాండ్ చోళాలో శివ్ నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘ఇగ్నిషన్-2025’ సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. ప్రముఖ జర్నలిస్టు శోమాదరి ఆధ్వర్యంలో ‘రీబూటింగ్ ది రిపబ్లిక్’ అంశంపై జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన అభిప్రాయాలను, దేశాభివృద్ధిలో రాజకీయాలు, టెక్నాలజీ పాత్ర, ఇన్నోవేషన్ హబ్‌ల ఆవశ్యకత, సమ్మిళిత ఆర్థికాభివృద్ధిపై తన ఆలోచనలను పంచుకున్నా రు. ఈ వేదిక ద్వారా జాతీయ రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ, ఉపాధి అవకాశా లు, ఇన్నోవేషన్, పారిశ్రామిక ప్రగతిపై రాహు ల్ గాంధీ మాట్లాడటం ఏనాడూ చూడలేదని పేర్కొన్నారు. ఈ అంశాలపై రాహుల్‌కు ఒక విజన్ ఉన్నట్టు అనిపించడం లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు భవిష్యత్తులోనూ కొనసాగితే కాంగ్రెస్ నాయకత్వం బీజేపీని ఎదురోవడం కష్టమేనని, ఆ పని కేవలం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. బీహార్ వంటి రాష్ర్టాల్లో అనేక స్థానాల్లో కాం గ్రెస్ పోటీ చేస్తామని మొండికేయడం వల్లే బీజేపీకి రాజకీయంగా లబ్ధి కలుగుతున్నదని చెప్పా రు. గతంలో కేసీఆర్ ప్రాంతీయ పార్టీల వేదిక ఏర్పాటు చేసి దేశానికి ప్రత్యామ్నాయ నమూనాను అందించాలని ప్రయత్నించారని, అది ముందుకు పోలేదని గుర్తుచేశారు.
రాహుల్‌గాంధీ నాయకత్వం దేశంలో ప్రధా న ప్రతిపక్షం మెడలో కట్టిన పెద్ద మొద్దులా తయారైందని కేటీఆర్ దెప్పిపొడిచారు. అందు కే వరుసగా కాంగ్రెస్ రాష్ర్టాలను కోల్పోతూ వస్తున్నదని చెప్పారు. రాహుల్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు లక్ష కోట్ల వ్యయం లేని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శమని మండిపడ్డారు. దక్షిణాన బీజేపీకి భవిష్యత్తు ఉన్నదని అనుకోవడం లేదని, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరసరించి గుణపాఠం చెప్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్రవేసి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పదేండ్లలో బీజేపీ విభజన రాజకీయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లిందని, వాటిని ఎండగట్టడంలో ప్రతిపక్షాలుగా విఫలమయ్యామని చెప్పారు.
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ప్రశ్నిస్తే దేశ ద్రోహులుగా ముద్రవేసి వేధింపులకు గురిచేస్తున్నది. పదేండ్లలో విభజన రాజకీయాలను ప్రతి ఇంటికీ తీసుకువెళ్లింది. దక్షిణాన బీజేపీకి భవిష్యత్తు ఉన్నదని అనుకోవడం లేదు. వచ్చే పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీని తిరసరించి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తున్నా.
– కేటీఆర్
తెలంగాణలో రెండేండ్లుగా జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పదేండ్లు అనేక రంగాల్లో, ముఖ్యంగా ఆర్థికం గా అద్భుత ప్రగతి సాధించిన తెలంగాణ, రెం డేండ్లలోనే వెనుకబడటం బాధాకరమని వా పోయారు. మంచిగా నడుస్తున్న వ్యవస్థలను ఇబ్బందులు పెడుతున్నందుకే రాష్ట్ర ప్రగతి డీలా పడిందని చెప్పారు. ఒకప్పుడు థామస్ పెయిన్ ప్రభుత్వాల నుంచి ప్రజలను కాపాడుకోవడమే దేశ భక్తుల ప్రథమ కర్తవ్యమని చెప్పిన మాటలు ఇప్పుడు తెలంగాణలో పాలనను చూస్తే గుర్తుకు వస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అరాచకాల నుంచి ప్రజలను కాపాడుకోవాల్సి వస్తున్నదని తెలిపారు.
‘2014 ఎన్నికల్లో మేము 119 స్థానాలకు 63 స్థానాలు సాధించాం. 2018లో 88 స్థానా లు, 2023లో 39 స్థానాలు సాధించాం. కాం గ్రెస్‌కు, మాకు కేవలం 1.8 ఓట్ల శాతం మాత్ర మే తేడా. మోదీ 2014లో 278 స్థానాలు, 2019లో 303 స్థానాలు గెలిచారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలిచ్చింది. ఆ హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు పట్టంకట్టారు. అయినా మేము ఎక్కడ తప్పులు జరిగాయో సమీక్షించుకొని వాటిని సవరించుకునే ప్రయత్నం చేస్తున్నం. మేము మంచి పాలన అందించినా మా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు జనంతో యాక్సెస్ లేకుండా పోయిందనే భావన బలంగా ఉన్న ది. యాంటీ ఇన్‌కంబెన్సీ అనేది కూడా నిజం. 15-20 మంది అభ్యర్థులను మార్చి ఉంటే ఫ లితం వేరేలా ఉండేది. ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు’ అని కేటీఆర్ వివరించారు.
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక రాష్ర్టాన్ని అద్భుత ప్రగతివైపు తీసుకెళ్లేందుకు మాకు అనేక అవకాశాలు దొరికాయి. నిబద్ధతతో రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లినం. అందుకే స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి మొద లు తలసరి ఆదాయం వరకు అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపినం. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ లాంటి రాష్ట్రాలను తలదన్ని అగ్రస్థానాన్ని సాధించాం. బెంగళూరు వంటి ఐటీ దిగ్గజ నగరాలకు పోటీగా అనేక రంగాల్లో ఆయా నగరాలను దాటుకుని ముందుకు పోయాం. విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తీర్చిదిద్దినం. 2014 లో మేం అధికారం చేపట్టినప్పుడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1.14 లక్షలు ఉంటే, 2023లో దిగిపోయేనాటికి రూ. 3.87 లక్షలకు చేర్చి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినం. 2014లో జీఎస్డీపీ రూ.4.5 లక్షల కోట్లు కాగా, 2023లో రూ.15 లక్షల కోట్లకు చేరింది.
దేశంలో అత్యధిక వృద్ధిరేటును నమోదుచేసిన రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు సాధించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినం. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తూ గ్రామీ ణ భారతంలో గేమ్ చేంజర్‌గా మారింది. ప్రపంచంలోనే అతిపెద్దవైన గూగుల్ ఇన్నోవేషన్, అమెజాన్ క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఏర్పాటయ్యాయి. గ్రామీణాభివృద్ధిలో 30% జాతీయ అవార్డులు తెలంగాణకు వచ్చినయ్. 3% జనాభా ఉన్న రాష్ట్రం 30% అవార్డులు గెలుచుకున్నది. తొమ్మిదిన్నరేండ్లలో కొవిడ్, డీమానిటైజేషన్ ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర వృద్ధిని ఆగకుండా కొనసాగించినం. కాంగ్రెస్ ఇచ్చిన అడ్డగోలు, ఆచరణ సాధ్యం కాని హామీ లు ప్రభావం చూపాయి. ఓటమి కారణాలను విశ్లేషించుకొని ప్రజలకు అండగా నిలబడుతూ ముందుకు పోతున్నం. మరింత అందుబాటులో ఉండటం లేదన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది’ అని కేటీఆర్ చెప్పారు.
‘వారసత్వం కేవలం రాజకీయాల్లోకి రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. వ్యా పారాలు, కంపెనీల్లో వారసత్వం ద్వారా విజ యం సాధించవచ్చు. కానీ రాజకీయాల్లో అది సాధ్యం కాదు. ప్రజల ఆమోదం, ఆశీర్వాదం ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతారు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. వారసత్వ రాజకీయాల గురించి పదేపదే మాట్లాడే బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం కుటుంబ పార్టీలైన శివసేన నుంచి మొదలు టీడీపీ, జేడీయూ వరకు అన్ని రకాల పార్టీలతో రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్నదని గుర్తుచేశారు. నేను ఐదుసార్లు ప్రజల ఆశీర్వాదంతోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ తదితర గొప్ప నేతలను కూడా ప్రజలు ఓడించారు. కుటుంబాలు, వారసత్వాలు, పోరాటాలు అంతటా ఉంటాయి’ అని చెప్పారు.
ఏఐ వంటి అధునాతన ‘టెక్నాలజీలని అం దుకునేందుకు తెలంగాణలో మేం అధికారం లో ఉన్నప్పుడు ఇన్నోవేషన్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినం. అందుకే టీ-వర్స్ వంటి అనే క కొత్త సంస్థలు ఏర్పాటు చేసినం. ఏఐ ప్రభావం ఉద్యోగాలపై స్వల్పకాలమే ఉంటుం ది. రానున్న కాలంలో ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తయి. ఏఐతో పాటు ఫిన్ టెక్, హెల్త్ టెక్, ఫార్మా వంటి రంగాలను సమ్మిళితం చేసి ముందుకెళ్తే అనేక కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఏర్పడుతయి. పరిశ్రమలకు ఉపయోగపడేలా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను కాలేజీల్లో తయారు చేసుకోవడం, ఆ దిశగా కరిక్యులమ్, శిక్షణ వంటి అంశాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడమే అతిపెద్ద సవాల్. చైనా, భారత్ 40 ఏండ్ల కింద ఒకే ఆర్థిక సా మాజిక స్థితిగతుల్లో ఉండేవి. కానీ, చైనా ఆర్థిక అంశాలను తన ప్రాధాన్యతగా తీసుకుం టే భారతదేశం మాత్రం ఎకనామిక్స్‌ను పకనపెట్టి పాలిటిక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఈరోజు బాగా వెనుకబడింది. కేవలం ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డబుల్ ఇంజిన్’ వంటి నినాదాలతో ఏదీ సాధ్యం కాదు. ఆచరణలో కూడా నిబద్ధత చూపించాలి’ అని సూచించారు.
వారసత్వమనేది కేవలం రాజకీయాల్లోకి రావడానికే ఉపయోగపడుతది. కానీ, ప్రజల ఆమోదం, ఆశీర్వాదం ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతరు. వారసత్వ రాజకీయాల గురించి పదేపదే మాట్లాడే బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం కుటుంబ పార్టీలైన శివసేన నుంచి మొదలుకొని తెలుగుదేశం, జేడీ యూ వరకు అన్ని రకాల పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నది.
-కేటీఆర్
‘మనది ఎంతో గొప్పదేశం. వృత్తి నిపుణులకు కొదువలేదు. కానీ, మనం ఎంతవరకు వారిని ఉపయోగించుకుంటున్నం? తెలంగాణ విషయానికొస్తే 2014లో ఐటీ రంగంలో 3.23 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. మేము అధికారంలోకి వచ్చాక టీ-హబ్, టీ-వర్స్ వంటి సరికొత్త విధానాలను ప్రవేశపెట్టి దాదాపు మిలియన్ మందికి ఉద్యోగావకాశాలు కల్పించినం. లైఫ్ సైన్సెస్, ఫార్మా, ఏరోస్పేస్ తదితర రంగాల్లో మంచి అవకాశాలున్నయి. చదువు పూర్తిచేసుకొని వచ్చేవారిలో కేవలం 30% మందికే ఉద్యోగాలు లభిస్తున్నయి. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగావకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటం’ అని వివరించారు.
పదేండ్లుగా అనేక రంగాల్లో ప్రగతి సాధించిన తెలంగాణ, రెండేండ్లలోనే వెనుకబడింది. ఒకప్పుడు థామస్ పెయిన్ ప్రభుత్వాల నుంచి ప్రజలను కాపాడుకోవడమే దేశభక్తుల ప్రథమ కర్తవ్యమని చెప్పిన మాటలు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పాలనను చూస్తే గుర్తుకు వస్తున్నయి. కాంగ్రెస్ సర్కారు అవినీతి, అరాచకాల నుంచి ప్రజలను కాపాడుకోవాల్సి వస్తున్నది.
-కేటీఆర్