హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి మరిన్ని భారీ పెట్టుబడులను సాధించే లక్ష్యంతో పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం శనివారం ఉదయం అమెరికాకు బయలుదేరింది. ఈ బృందం లాస్ఏంజిల్స్, శాన్‌డియాగో, శాన్‌జోస్, బోస్టన్, న్యూయార్క్ తదితర నగరాల్లో వారం రోజులకు పైగా పర్యటిస్తుంది. మంత్రి కేటీఆర్ అక్కడి కంపెనీల అధిపతులు, సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమవుతారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పలు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్‌సైన్సెస్, ఫార్మా తదితర రంగాల కంపెనీల ప్రతినిధులకు రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆయన వివరించనున్నారు.
గతంలో అమెరికాలో పర్యటించి రాష్ర్టానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టిన కేటీఆర్.. ఈ పర్యటన ద్వారా మరిన్ని పెట్టుబడులు తేవాలని సంకల్పించారు. అమెరికా వెళ్లిన బృందంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఐటీ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపురి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, ఫుడ్ ప్రాసెసింగ్ విభాగం డైరెక్టర్ అఖిల్ గవార్, ప్రమోషన్స్ విభాగం డైరెక్టర్ రంగినేని విజయ్, డిజిటల్ మీడియా ముఖ్య సంబంధాల అధికారి అమర్నాథ్రెడ్డి తదితరులు ఉన్నారు.
హైదరాబాద్‌లో అమెరికన్ సంస్థల పెట్టుబడులు
భారత్ బయోటెక్‌తోపాటు పలు ఫార్మా కంపెనీల్లో అమెరికన్ సంస్థల పెట్టుబడులు ఇప్పటికే ఉండగా, మైక్రోసాఫ్ట్, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, గోల్డ్మాన్సాక్స్, మాస్‌మ్యూచువల్ తదితర కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
భారత్ బయోటెక్ సంస్థ యూఎస్‌కు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్‌కు వ్యాక్సిన్లను తయారుచేస్తున్నది.
ఏరోస్పేస్ రంగంలో టాటా ఏరోస్పేస్, యూఎస్‌కు చెందిన బోయింగ్ జాయింట్ వెంచర్ హైదరాబాద్‌లో అపాచీ హెలీకాప్టర్ల విడిభాగాలను ఉత్పత్తి చేస్తున్నది.
లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ టాటా ఏరోస్పేస్తో కలిసి ఎఫ్-16 విమానాల వింగ్స్‌తో పాటు సీ-130 కార్గో విడిభాగాలను తయారుచేస్తున్నది.
అమెరికాకు చెందిన సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో ఐదు బిలియన్ డాలర్ల (సుమారు రూ.38వేల కోట్లు) మేర ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టగా, మరికొన్ని అనుబంధ సంస్థలు కూడా రాష్ట్రంలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాయి.