హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దీక్షా దివస్ సందర్భంగా 2009లో నాటి ఉద్యమనేతగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్యసేవలు అందించిన నిమ్స్ వైద్య బృందానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో కేసీఆర్‌కు నాడు సేవలందించిన వైద్య బృందానికి మంత్రి జ్ఞాపికలు బహూకరించి, సతరించారు.
కేసీఆర్‌కు వైద్యసేవలు అందించిన డాక్టర్లు శేషగిరిరావు, ప్రసాదరావు, శ్రీనివాస్ మంతా, దక్షిణామూర్తి, అజిత్‌కు తెలంగాణ ప్రజల పక్షాన కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ వైద్య బృందం అందించిన సేవలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్తూ కేటీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. నాడు కేసీఆర్ దీక్ష ఫలితంగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిందని వైద్యుల బృందం దీక్షాదివస్ నాటి సంఘటనల సమాహారాన్ని, భావోద్వేగాలను ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు.