KTR | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బదులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టాల్సిందేమోనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వివిధ స్పందనలు, విశ్లేషణలపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనేక విధాల స్పందనలు, విశ్లేషణలు వస్తున్నాయి. ఇందులో కొన్ని ఎంతో ఆసక్తిగా ఉంటున్నాయి. కేసీఆర్ 32 మెడికల్ కాలేజీలకు బదులు తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు 32 యూట్యూబ్ చానళ్లు పెట్టి ఉండాల్సింది అని ఓ నెటిజన్ పేర్కొన్నారని. ఈ పరిశీలనతో నేను ఏకీభవిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.