Kids | చిన్నారులు తరచూ జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడటం చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. ఒకసారి అనారోగ్యం నుంచి కోలుకుని పాఠశాలకు వెళ్లిన కొద్ది రోజులకే మళ్లీ అదే సమస్యలు రావడంతో పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందేమోనని చాలామంది భావిస్తారు. అయితే పిల్లల ఎదుగుదలలో భాగంగా ఇలాంటి ఇన్ఫెక్షన్లు తరచూ రావడం సాధారణమే. కొత్త కొత్త క్రిములను ఎదుర్కొంటూ వారి రోగనిరోధక వ్యవస్థ క్రమంగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా ఒకటి నుంచి ఆరు సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు ఏడాదిలో 6 నుంచి 8 సార్లు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం సాధారణంగా కనిపిస్తుంది. ప్లేస్కూల్కు వెళ్లే పిల్లల్లో ఈ సంఖ్య ఏడాదికి 12 వరకు ఉంటుంది. పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ పుట్టుకతోనే పూర్తిగా అభివృద్ధి చెందదు. వివిధ రకాల వైరస్లు, ఇతర క్రిములను ఎదుర్కొంటున్న కొద్దీ అది మరింత సమర్థవంతంగా పనిచేయడం నేర్చుకుంటుంది. ప్రతి జలుబు లేదా వైరల్ జ్వరం శరీరానికి కొత్త క్రిములను గుర్తించి వాటికి వ్యతిరేకంగా రక్షణ కల్పించుకునే ఒక విధమైన అనుభవంగా పనిచేస్తుంది.
అయితే పిల్లలు నివసించే పరిసరాలు కూడా వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో కాలుష్యం వల్ల చిన్నారుల శ్వాసనాళాల్లో నిరంతరం వాపు, చికాకు ఏర్పడతాయి. దీంతో వైరస్లు శరీరంలోకి ప్రవేశించే అవకాశం పెరుగుతుంది. దీనికి తోడు జనసాంద్రత ఎక్కువగా ఉన్న తరగతి గదులు, పోషకాహార లోపాలు, రక్తహీనత లేదా విటమిన్ డి లోపం వంటి సమస్యలు కూడా ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందువల్ల పిల్లలకు తరచూ అనారోగ్యం రావడం ప్రతిసారీ బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు తీవ్రంగా ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలు అనారోగ్యంగా లేని సమయంలో వారి సాధారణ ఆరోగ్యం ఎలా ఉంది, ఇన్ఫెక్షన్లు ఎంత తీవ్రంగా వస్తున్నాయి, ఏ భాగాలను పదేపదే ప్రభావితం చేస్తున్నాయి వంటి అంశాలను గమనించాలి. సాధారణ జలుబు వచ్చినప్పటికీ పిల్లలు సాధారణంగా ఎదుగుతూ, బరువు పెరుగుతూ ఉంటారు. పిల్లల బరువు పెరగకపోవడం, ఎదుగుదలలో వెనుకబడటం లేదా కండరాల బలం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి.
ఏడాదిలో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు న్యుమోనియా రావడం, పదేపదే చెవి ఇన్ఫెక్షన్లు రావడం, డ్రైనేజ్ అవసరమయ్యే స్థాయిలో ఇన్ఫెక్షన్లు రావడం లేదా శరీరంలో తరచూ పుండ్లు, చీము గడ్డలు ఏర్పడటం వంటి సమస్యలు కూడా పరిశీలన అవసరమయ్యే సంకేతాలుగా పరిగణించాలి. సాధారణంగా తగ్గాల్సిన ఇన్ఫెక్షన్లు ఎక్కువ కాలం కొనసాగడం, చికిత్సకు ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం లేదా అసాధారణమైన బ్యాక్టీరియా వల్ల పదేపదే ఇన్ఫెక్షన్లు రావడం కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అంశాలు. చిన్న వయసు దాటిన తర్వాత కూడా నోటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ నిరంతరం ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే అండర్ లైయింగ్ ఇమ్యూన్ ప్రాబ్లం ఉందేమోనని వైద్యులు పరిశీలించే అవకాశం ఉంటుంది. పిల్లలకు తరచూ అనారోగ్యం వస్తోందని తల్లిదండ్రులు స్వయంగా మందులు ఇవ్వడం లేదా వెంటనే యాంటీబయాటిక్స్ కోసం ప్రయత్నించడం మంచిది కాదు. అవసరం లేకుండా విస్తృత శ్రేణి యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పేగుల్లోని మైక్రోబయోమ్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇది శరీర రక్షణ వ్యవస్థపై కూడా ప్రభావం చూపిస్తుంది.
అలర్జిక్ రైనైటిస్ లేదా చిన్నారుల్లో ఆస్తమాను కొన్నిసార్లు పదేపదే వచ్చే జలుబుగా భావించే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అసలు కారణాన్ని గుర్తించకుండా యాంటీ బయాటిక్స్ వాడటం సమస్యను పరిష్కరించదని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు తరచూ అనారోగ్యం వస్తున్నట్లు అనిపిస్తే ఒకసారి పిల్లల వైద్యుడితో సమగ్రంగా పరీక్ష చేయించడం మంచిది. అవసరాన్ని బట్టి రక్తహీనత కోసం రక్త పరీక్షలు, ఇమ్యునోగ్లోబులిన్ స్థాయిల పరిశీలన, అలర్జీలకు సంబంధించిన పరీక్షలు, టీకాల చరిత్రను పరిశీలించడం వంటి అంశాలను వైద్యుడు సూచించే వీలు ఉంటుంది. పిల్లల ఆరోగ్యానికి ప్రాథమిక జాగ్రత్తలు కూడా ఎంతో ముఖ్యం. అన్ని అవసరమైన టీకాలు సకాలంలో వేయించడం, ప్రతి సంవత్సరం ఫ్లూ టీకా అవసరమా అనే విషయాన్ని పిల్లల వైద్యుడితో చర్చించడం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఇంటి ఆహారాన్ని అందించడం, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి అలవాట్లు ఉపయోగకరంగా ఉంటాయి. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకునేంత సమయం ఇవ్వకుండా వెంటనే రద్దీగా ఉండే తరగతులకు పంపకుండా ఉండటం కూడా మంచిది.
చాలా మంది పిల్లల్లో చిన్న వయసులో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు కాలక్రమేణా తగ్గుతాయి. కొత్త క్రిములను ఎదుర్కొంటూ వారి రోగనిరోధక వ్యవస్థ మరింత అభివృద్ధి చెందుతుంది. అయితే ఇన్ఫెక్షన్లు అసాధారణంగా తీవ్రంగా ఉండటం, పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపడం లేదా పదేపదే తీవ్రమైన సమస్యలకు దారితీయడం వంటి సందర్భాల్లో మాత్రం ఆలస్యం చేయకుండా పిల్లల వైద్యుడిని సంప్రదించడం అవసరం.