KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ నాయకులను పార్టీ మారాలని చెబుతున్నారట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాజ్యాంగ దినోత్సవమని.. బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణ సాధ్యమైందన్నారు. అందుకే తెలంగాణ ప్రజలంతా ఆయనకు రుణపడి ఉంటారన్నారు. ఆయన చూపిన బాటలోనే బోధించు, పోరాడు, సమీకరించు అన్న విధానంలోనే కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ సాధించారని గుర్తు చేశారు.
పదవి త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి.. ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రం సాధించిన నేత కేసీఆర్ అని మాజీ స్పీకర్ మధుసుధానాచారి అన్నారని.. ఇది వందశాతం నిజమన్నారు. తెలంగాణ ఇప్పుడు రాష్ట్రంగా ఉండి.. కాంగ్రెస్‌వారు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు అనుభవిస్తున్నారంటే దాని కేసీఆర్ అనే నాయకుడే కారణమన్నారు. కేసీఆర్ పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చూపే ప్రయత్నం చేసినప్పటికీ.. తెలంగాణ ప్రజలు ఆయనను ఎన్నటికీ మరవరన్నారు. రాజకీయంగా కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తారన్నారు. మనకు కొన్ని కష్టాలు రావచ్చని.. రాజకీయంగా, జీవితంలో కానీ ఎత్తు పల్లాలు సహజం.. తప్పవన్నారు. గతేడాది ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నెన్ని హామీలు ఇచ్చారో మీకు గుర్తుండే ఉంటుందని.. కాంగ్రెస్ అరచేతిలో స్వర్గం చూపడంతో కొన్ని చోట్ల ప్రజలు నమ్మి వాళ్లను గెలిపించారన్నారు. ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా సరే ఎవరినీ కదిలించిన సరే ఒక్కటే మాట కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని వస్తోందన్నారు. సంపన్న వర్గాల నుంచి రైతులు, నేతన్నలు, ఆటోడ్రైవర్లు అట్టడుగు వర్గాల వరకు అందరి నోట ఇదే మాట. నేతన్నల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యల సాక్షిగా చెబున్నానన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్ అనే అర గ్యారంటీ మాత్రమే అమలైందన్నారు. నేను ఏదీ మాట్లాడినా సరే.. నన్ను ఎందులోనైనా పట్టుకొని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడన్నారు. మా అక్క చెల్లెలు, అన్నదమ్ముల అండ ఉన్నంత వరకు ఎవ్వని అయ్యకు కూడా భయపడకుండా ప్రజల కోసం పోరాటం చేస్తానన్నారు. ఇక్కడి కలెక్టర్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేస్తున్నాడని.. మా పార్టీ నాయకులను పార్టీ మారాలని అడుగుతున్నాడట.. ఇలాంటి సన్నాసిని కలెక్టర్‌గా తీసుకువచ్చారంటూ మండిపడ్డారు. కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దని.. వీళ్లు టీఆర్ఎస్ వెంట్రుక కూడా పీకలేరన్నారు. రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని.. అతి చేస్తున్న కలెక్టర్లు, అధికారులు రాసిపెట్టుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే మళ్లీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తామని.. ఆ బాధ్యత తానే తీసుకుంటానన్నారు. ఖచ్చితంగా ఆ పని చేసి చూపిస్తామన్నారు.