రేవంత్‌రెడ్డీ.. నువ్వు చక్రవర్తివో, రాజువో కాదు. నీలాంటి వారు చాలామంది వచ్చారు.. భవిష్యత్తులో వస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, సన్నకారు రైతుల భూములు గుంజుకుని ఏమైనా చేస్తానంటే తెలంగాణ సమాజం మొత్తం తిరుగుబాటు చేస్తుంది. ఫార్మా విలేజ్ కోసం రైతులను ఒప్పించడంలో విఫలమైన రేవంత్ సర్కార్ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నది.
జైలులో నేను కలిసిన వారిలో రాఘవేంద్రయాదవ్ అనే ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడు. కులగణన చేసి ఇంటికి వచ్చిన ఆయనను కూడా అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలులో వేసిండ్రు. వనపర్తిలో ఐటీఐ చదువుతూ ఇంటికొచ్చిన విద్యార్థిని కూడా పోలీసులు వదల్లేదు. కేసు పెట్టి అరెస్ట్ చేశారు. -కేటీఆర్
KTR | సంగారెడ్డి, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే తమతో తలపడాలని, తమ మీద కోపంతో పేదలను కష్టపెట్టవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. లగచర్ల రైతులు, పేదల ఉసురు తగిలి వారి కన్నీళ్ల సుడిగుండలో రేవంత్ సర్కార్ కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. రేవంత్ సర్కారు ఉండేది ఐదేండ్లు మాత్రమేనని, ఢిల్లీకి కోపం వస్తే రేపో, ఎల్లుండో అది కూడా పోతుందని ఎద్దేవా చేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న రేవంత్‌రెడ్డిని ఏమి చేయాలో తమకు తెలుసని, తాము వచ్చాక వదిలిపెట్టబోమని హెచ్చరించారు. లగచర్ల ఘటనలో అరెస్టయి జైలులో ఉన్న రైతుల వెంట కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. 21 మంది తరఫున న్యాయపోరాటం చేస్తామని, బెయిల్ వచ్చే వరకు వారి వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. రేవంత్‌రెడ్డి సొంత జిల్లా, సొంత నియోజకవర్గ రైతులు, ప్రజలు కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా మర్లబడ్డారని, రేపు తెలంగాణ మొత్తం రేవంత్ సర్కార్‌పై మర్లబడతదని హెచ్చరించారు. కొడంగల్, న్యాల్కల్ ఎక్కడైనా ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తే అక్కడి రైతులకు అండగా బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న లగచర్ల గ్రామానికి చెందిన 16 మందిని మాజీ మంత్రులు సత్యవతిరాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, అనిల్‌జాదవ్, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాన్సన్‌నాయక్‌తో కలిసి కేటీఆర్ పరామర్శించారు. జైలులో ఉన్న 16 మంది రైతులతో నాలుగు విడతలుగా నలుగురు చొప్పున రైతులతో ఆయన ములాఖత్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ వారిపైనే కేసులు
కేసీఆర్ సేకరించిన 14వేల ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుండా రియల్ ఎస్టేట్ దందా చేస్తానని, అన్నలు, తమ్ముళ్లకు భూముల సంతర్పణ చేస్తానని, ఫార్మా విలేజ్ల పేరిట సంగారెడ్డి జిల్లా న్యాలకల్, కొడంగల్‌తోపాటు 20 ఫార్మావిలేజ్లు పెడతామంటూ రేవంత్ వికృత పోకడలకు పోతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్ల ఘటనలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ వాళ్లను తప్పించి బీఆర్ఎస్ వారిపైనే అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. రూ. 60 నుంచి రూ. 70 లక్షలు పలికే లగచర్ల భూములను అడ్డికిపావుశేరుకు లాక్కుంటామని చెప్తుండడంతోనే రైతులు, ఆడబిడ్డలు 9 నెలలుగా ఆందోళన చేస్తున్నారని వివరించారు. లగచర్లలో 70 మందిని అరెస్ట్ చేశారని, కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేశ్, నర్సింహులు, రాములు నాయక్ తదితరులు కూడా నిరసనలో పాల్గొన్నారని తెలిపారు. రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి రాజకీయ ఒత్తిడితో కాంగ్రెస్ వారిపై కేసులు లేకుండా చేశారని, దుద్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ ఇందుకు సహకరించారని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారిలో బీఆర్ఎస్కు చెందిన 21 మందిని మాత్రమే రిమాండ్ చేసి, కాంగ్రెస్ వారిని వదిలేశారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. వారి కాళ్లు, చేతులు కమిలిపోయి ఉండడాన్ని ములాఖత్‌లో తాను గమనించానని తెలిపారు. బిన్‌లాడెన్ వంటి వారిని పట్టుకునేందుకు వెళ్లినట్టుగా లగచర్ల గ్రామంలోని రైతుల ఇండ్లపైకి పోలీసులు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రైతుల ఇండ్ల తలుపులు పగలగొట్టారని, కాంగ్రెస్ నాయకులు కొందరు రైతుల ఇండ్లలోని ఆడవారిని బూతులు తిడుతూ దాడులు చేశారని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగిని కూడా జైలులో వేశారు
లగచర్ల ఘటనలో అరెస్టు చేసి సంగారెడ్డి జైలులో ఉన్న వారిని చూస్తుంటే కన్నీరు వచ్చిందని, ఒక్కొక్కరు కనీసం 40 కేజీల బరువు కూడా లేరని, బట్టలు కూడా సరిగ్గా లేవని, అలాంటి పేద రైతులపై అక్రమ కేసులు పెట్టేందుకు రేవంత్‌రెడ్డికి మనసెలా ఒప్పిందని కేటీఆర్ ప్రశ్నించారు. కలెక్టర్‌ను కొట్టారని, హత్యకు ప్రయత్నించారని వారిపై కేసులు పెట్టడం దారుణమని పేర్కొన్నారు. తమను అన్యాయంగా జైలులో వేశారని 16 మంది తన ఎదుట కన్నీరు పెట్టుకున్నారని పేర్కొన్నారు. వారిని ఇంతకుమించి ఇంకేమీ చేయలేరని, వారి తరఫున బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. రాఘవేంద్రయాదవ్ ఉద్యోగం పోకుండా చూస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. లగచర్ల బాధితులకు కేసీఆర్, బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎవరి బెదరింపులకు భయపడవద్దని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
రైతుల పక్షాన నిలబడి పోరాడుతం
ఫార్మావిలేజీ పేరుతో రేవంత్ సర్కార్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే.. తా ము బాధిత రైతులు పక్షాన నిలబడి పోరాడతామని కేటీఆర్ తెలిపారు. ఫార్మా విలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా కొడంగల్, సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్ రైతులు ఆందోళనలు చేస్తున్నట్టు చెప్పారు. మరో 18 చోట్ల ఫార్మా విలేజీలు పెట్టేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. న్యాల్కల్, కొడంగల్ రైతులు ధైర్యంగా ఉండాలని, వారివెంట కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు. కొడంగల్ రైతులకు న్యాయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సింది ఇప్పించే వరకు వెంట ఉంటామని హామీ ఇచ్చారు. లగచర్ల దాటి ఘటనలో జ్యోతి అనే గర్భిణి కూడా ఉందని, సత్యవతి రాథోడ్ ఆమెను పరామర్శించి దవాఖానకు తీసుకెళ్తారని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో సంక్షేమం మాయం
కాంగ్రెస్ పాలనలో సంక్షేమం మాయమై పేదల బతుకులు ఛిద్రమయ్యాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పనిమంతుడు పందిరేస్తే..కుక తోక తగిలి కూలిందన్నట్టుగా రేవంత్ పాలన సాగుతున్నదని ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం సమున్నతంగా వెలిగితే, రేవంత్‌పాలనలో మృగ్యమైందని ఆవేదన వ్యక్తంచేశారు. సంక్షేమ గురుకుల పాఠాశాలల ఆహార బిల్లులు, అద్దెలు చెల్లించకపోవడంతో వాటికి తాళాలు వేస్తే 9 నెలలకు 3 నెలల బిల్లులు చెల్లించిన ఉదంతాలను గుర్తుచేశారు. 11 నెలల పాలనలో సంక్షేమ గురుకుల పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేశారని మండిపడ్డారు. గురుకులాల్లో చదివే 36 మంది విద్యార్థులు వివిధ కారణాలతో చనిపోయారని, వందలాది గురుకుల పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు రోడ్డెకుతున్నారని పేర్కొన్నారు. పత్తి, వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టక ఆందోళన చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రైతన్నలు అడ్డికి పావుశేరు చొప్పున తమ కష్టార్జితాన్ని అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో హైదరాబాద్ పేదల బతుకుల్లో నిప్పులుపోసి కంటికి మీద కునుకు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మాసిటీకి సేకరించిన భూమిని పకన పెట్టి ఫార్మా క్లస్టర్ల పేరుతో గిరిజనుల జీవితాల్లో భయాన్ని నింపారని పేర్కొన్నారు. ‘మా భూములు మాకేనని’ ఎదిరించిన వారిని అక్రమ కేసులతో జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. ‘11 నెలల పాలనలో సంక్షేమం మాయమయింది. అభివృద్ధి ఆగిపోయింది. కాంగ్రెస్ తెచ్చిన మార్పు చూసి తెలంగాణ నివ్వెరపోతున్నది. కాలంబు రాగానే కాటేసి తీరాలని ఎదురుచూస్తున్నది’ అని హెచ్చరించారు.
రేవంత్‌రెడ్డి గిరిజనులను పావులా వాడుకున్నారు: సత్యవతిరాథోడ్
లగచర్ల ఘటన బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. కొడంగల్‌లో రైతులను మెప్పించి ఫార్మాసిటీ ఏర్పాటు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైనట్టు చెప్పారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కుట్రపూరితంగా రైతులు, గిరిజనులపై కేసులు పెట్టి జైలుకు పంపారని మండిపడ్డారు. కంది జైలులో ఉన్న 16 మందిని పోలీసులు తీవ్రంగా హింసించారని, వారు నడవలేకపోతున్నారని పేర్కొన్నారు. వారిని అలా చూస్తుంటే తనకు ఏడుపు ఆగడం లేదన్నారు. పేదలు, గిరిజనులను పావులా వాడుకుని అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు గిరిజనులను ఇబ్బందులకు గురిచేయటం సిగ్గుచేటన్నారు. గిరిజనులు, ఎస్సీలు, పేదలకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తామని ఇప్పుడు ఫార్మా కంపెనీల ముసుగులో భూములు లాక్కోవడం అన్యాయం పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు: శ్రీనివాస్‌గౌడ్
కొడంగల్ రైతుల ఉసురు పోసుకుంటున్న రేవంత్‌రెడ్డి త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 14 లక్షల మంది వలసలు వెళ్లేవారని, అందులో ఎస్సీ,ఎస్టీ,బీసీ,ఓసీ అన్నివర్గాల ప్రజలు ఉండేవారని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు ప్రస్తుత కొడంగల్ నియోజకవర్గంలో వలసలు తగ్గాయని పేర్కొన్నారు. ముంబై, పూణెలో ఉన్నవాళ్లు తిరిగి స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నట్టు చెప్పారు. అలా కొడంగల్ వచ్చిన గిరిజనుల నుంచి ఫార్మాసిటీ పేరుతో రేవంత్ సర్కార్ భూములు లాక్కోవాలని ప్రయత్నించడం దారుణమని మండిపడ్డారు. తమకంటే బాగా పాలిస్తారని నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, అదే కాంగ్రెస్ ఇప్పుడు అక్రమ కేసులు బనాయిస్తే ప్రజలు, రైతులు ఊరుకోరని, తిరగబడతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, వివేకానంద, మాజీ ఎమ్మెల్యేలు కాంత్రికిరణ్, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, శుభప్రద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు: అనిల్ జాదవ్
లగచర్ల రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట గిరిజన సంఘాల తరఫున ధర్నాలు చేస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. లగచర్ల ఘటనలో గిరిజనులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు బలవంతంగా భూములు లాక్కుని లాఠీచార్జీలు చేసి అక్రమ కేసులు బనాయించడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.60 లక్షల విలువ చేసే భూమి రూ.10 లక్షలకు లాక్కోవడం అన్యాయమని అన్నారు. రేవంత్ సర్కార్‌కు ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
బధిరాంధక రేవంత్ ప్రభుత్వం
కండ్లు ఉండీ చూడలేని, చెవులు ఉండీ వినలేని బధిరాంధక ప్రభుత్వంగా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి సర్కార్ మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు మండిపడ్డారు. పేద గిరిజనుల భూములపై కన్నేసిన కాంగ్రెస్ సర్కార్.. దౌర్జన్యంగా, దాష్టీకంగా గుంజుకుంటున్నదని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రజా ప్రభుత్వం పేరున గద్దెనెకి ప్రజా కంఠకుడిగా మారిన రేవంత్ నిర్వాకమిది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అభాగ్య అంధురాలు తన బాధను వెల్లడించే వీడియోను దీనికి జతచేశారు.
లగచర్లలో 70 మందిని అరెస్ట్ చేశారు. వారిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రమేశ్, నర్సింహులు, రాములునాయక్ తదితరులు కూడా ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిలో బీఆర్ఎస్కు చెందిన 21 మందిని మాత్రమే రిమాండ్ చేసి, కాంగ్రెస్ వారిని వదిలేశారు. రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి రాజకీయ ఒత్తిడితో కాంగ్రెస్ వారిపై కేసులు లేకుండా చేశారు.
– కేటీఆర్
సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి కొడంగల్‌లో రాజ్యాంగేతర శక్తిగా మారారు. ఏ పదవి, హోదా లేకున్నా కలెక్టర్లు, పోలీసు అధికారులు ఆయన ముందు మోకరిల్లుతున్నారు. తిరుపతిరెడ్డి కొడంగల్‌కు చక్రవర్తి , రారాజుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ రేవంత్‌రెడ్డిది ఏమీ నడవదట, చెల్లదట.. అంతా తిరుపతిరెడ్డే చూసుకుంటరట.
-కేటీఆర్