KTR | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఫుట్‌బాల్ ఆడాలని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణ అనంతరం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇలాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తానని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నడు. రేవంత్‌రెడ్డికి చెప్పేది ఒక్కటే. నాపై ఇప్పటి వరకు 14 కేసులు పెట్టారు. ఇంకో 1400 కేసులు పెట్టుకో.. అవసరమైతే జైలులో పెట్టుకో. ఏమన్న చేసుకో. భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినం. అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తే భయపడేటోడు ఎవడూ లేడు. నీ ఉడుత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే.. ఇది డైలీ సీరియల్లా అయిపోయింది. ఒక రోజు పిలుచుడు. ఎట్లాంటే ఒక రోజు పిలుచుడు.. తొమ్మిది గంటలు కూర్చుండబెట్టి.. చాయి తాగిపించి.. ఏం చేస్తాం సర్.. మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నయ్.. ఏం చేయాలంటూ అడిగిందే అడుగుతున్నరు’ అన్నారు.
‘మనమందరం పార్టీగా దృష్టి సారించాల్సింది రెండు పనులపై. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బరి గీసి, లైన్ గీసి.. ఒక్కో కాంగ్రెస్ నాయకుడిని ఫుట్‌బాల్ ఆడుడెట్లా? ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టాలనే దానిపై దృష్టి పెడుతాం. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఆరు సంవత్సరాలు కాబోతున్నది. 2019 జూన్ 21న కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు. ఆ రోజును సార్‌ని అడిగి పార్టీగా కాళేశ్వరం గొప్పదనం ప్రజలకు చెబుదాం అనే ఆలోచన చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కొంత కార్యక్రమాలు చేయాల్సి ఉంది. మనకు నోటీసులు వచ్చుడు పోవుడు రోటీన్. పాత చింతకాయపచ్చడి. దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం.. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పెడితే 15 రోజులు జైలులో పెడుతడు. చేసేది ఏమీ లేదు. లొట్టపీస్ ముచ్చట. రేవంత్‌రెడ్డి భయపడేటోడు ఎవడూ లేడు రేవంత్‌రెడ్డి గుర్తుపెట్టుకో.. నీలాగా లుచ్చా పనులు చేసి.. రూ.50లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరూ మా పార్టీలో ఎవరూ లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి.. అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినోడు ఎవడూ లేదు’ అంటూ తీవ్రంగా స్పందించారు.
‘తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి ఉండి.. జై తెలంగాణ అనకపోతే నిన్ను ఏం పేరుతో పిలవాలి. ముఖ్యమంత్రిగా ఉండి.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజూ కించపరిస్తే నిన్న ఏమని పిలవాలే. తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీసిన రాష్ట్రం ఏం అనాలి అనాలి. తెలంగాణ సీఎంగా ఉండి.. ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు.. దొంగను చూసినట్లు చూస్తున్నరని అంటే ఏమని అనాలి. తెలంగాణ సీఎం అయ్యుండి చెప్పులు ఎత్తుకుపోతరని భయపడుతున్నరంటే ఏమని నిన్ను..? నాకు అర్థం కాదు. ఆ వాళ్లు కూర్చుండబెట్టి మర్యాద చేసి పంపిస్తే.. తొమ్మిది నిమిషాల్లోనే మీరు (బీఆర్ఎస్ కార్యకర్తలు) రక్తం వచ్చేటట్టు చేశారు’ అన్నారు. ఏసీబీ విచారణ సందర్భంగా పొద్దున నుంచి చాలా ఓపికగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.