KTR | హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): ‘రుణమాఫీ పేరుతో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం టోపీ పెట్టింది. సర్కారు చీటింగ్‌పై మా ఫైటింగ్ ఆగదు. రైతులను మోసం చేసిన సర్కారుపై చీటింగ్ కేసు పెట్టాలి. రేవంత్.. రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించాలని లేని పక్షంలో జైల్‌భరోకు పిలుపునిస్తామని హెచ్చరించారు.
ఎలాంటి షరతులు లేకుండా రైతులకు ఇచ్చిన హామీమేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసేంత రైతుద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని తేల్చిచెప్పారు. రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని మండలకేంద్రాల్లో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు, ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఎమ్మెల్యేలు, లేనిచోట్ల బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వెల్లడించారు.
బుధవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అధికారంలోకి వచ్చిన రోజే రూ.2 లక్షల రుణమాఫీ అంటూ రేవంత్‌రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారు. ఇప్పటికైనా మేం రుణమాఫీ చేయలేకపోయాం. మా వల్ల కాలేదని చెప్తారని అనుకున్నాం. కానీ, రవ్వంత రుణమాఫీ చేసి కొండంత డబ్బా కొట్టుకున్న సీఎం బండారం 70 లక్షల మంది రైతుల సాక్షిగా బట్ట బయలైంది. వ్యవసాయ మంత్రి రూ.2 లక్షలు మాఫీ చేశాం అన్నారు.
కానీ, కొన్ని పత్రికలు రుణమాఫీ పూర్తిగా కాలేదని వార్తలు రాశాయి. జరిగింది రుణమాఫీ కాదు.. పెట్టింది రైతులకు టోపీ. ఎకడికకడ తెలంగాణవ్యాప్తంగా మాఫీ కాని రైతులు ఆందోళన చేస్తున్నరు. బ్యాంకులను ముట్టడిస్తున్నరు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నరు. రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెప్పుకున్నది. కానీ జరిగింది మోసం. రుణమాఫీ జరగలేదు. మాకెందుకు రుణమాఫీ జరగలేదని రైతులు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నరు. రాష్ట్రం రణరంగంగా మారిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలంలో బజార్హత్నూర్లో రైతులపై కేసులు పెట్టి వేధిస్తున్నరు.
ఏ పార్టీ ప్రేరేపించకుండా రైతులు ఆందోళన చేస్తున్నరు. రుణమాఫీ జరగలేదని ఆందోళన చేస్తే ఏడేండ్ల జైలుశిక్ష పడేలా సెక్షన్ 189, సెక్షన్ 126, సెక్షన్ 223 కింద కేసులు పెట్టి రైతులను వేధిస్తున్నదీ ఈ ప్రభుత్వం. రైతుల మీద నాన్‌బెయిలబుల్ కేసులు పెడుతున్నది. తక్షణమే రైతులపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
రుణమాఫీ విషయంలో సీఎంకు, మంత్రులకు అసలు సయోధ్యే లేదని, మనిషికో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘రూ.2లక్షల రుణమాఫీ చేశామని సీఎం చెప్తున్నరు. కానీ, వ్యవసాయశాఖ మంత్రి మాత్రం ఇంకా రుణమాఫీ కావాల్సి ఉందంటారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.12,000 కోట్లు ఇంకా ఇవ్వాల్సి ఉందంటున్నారు. రూ.7.5 వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాలకు చేరిందని ఉపముఖ్యమంత్రి భట్టి చెప్తున్నారు. రుణమాఫీ ఒట్టిదే అని మంత్రుల మాటలతో తేలిపోయింది. అసలు ఈ ప్రభుత్వానికి రుణమాఫీపై స్పష్టత ఉన్నదా? లేదా? రైతులకు ఇచ్చింది ఎంతో కనీసం ప్రభుత్వానికి, మంత్రులకు తెలుసా? లేదా?’ అని నిలదీశారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు రకరకాలుగా మాట్లాడిన వీడియోలను మీడియాకు చూపించారు. ‘సాంకేతిక అంశాల ఆధారంగా రుణమాఫీ జరగలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్తున్నరు. సాంకేతిక కారణాలు ఏమీ లేవు. రుణమాఫీ ఎగ్గొట్టేందుకే ఇలా సాకులు చెప్తున్నరు. రుణమాఫీ చేసింది పావు శాతం. కానీ రైతులను వంద శాతం మోసం చేశారు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనూ రూ.2 లక్షల రుణమాఫీ పూర్తిగా కాలేదని కేటీఆర్ చెప్పారు. రుణమాఫీపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపామని, సీఎం నియోజకవర్గం కొడంగల్ నుంచి సమాచారం తెప్పించామని వెల్లడించారు. ‘కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం ఐదు బ్యాంకులు ఉన్నాయి. రెండు ఎస్బీఐ, రెండు తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకులు, ఒక మహబూబ్‌నగర్ డీసీసీబీ బ్యాంకు ఉన్నాయి. ఈ ఐదు బ్యాంకుల పరిధిలో మొత్తం 20,239 మంది రైతులకు ఖాతాలు ఉన్నాయి. వీరిలో 8,527 మందికి మాత్రమే మూడు విడతల్లో పాక్షికంగా రుణమాఫీ అయింది.
సీఎం నియోజకవర్గం కాబట్టి కొంత ఎక్కువ మందికి రుణమాఫీ జరిగిందేమో! రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలో ఇంతకంటే తక్కువ మందికే రుణమాఫీ అయ్యి ఉంటుంది. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి 100 శాతం రుణమాఫీ అయ్యిందని ఉదరగొడుతున్నరు. భక్తిమల్లలో 988 మంది, బుజ్జారంలో 579 మంది, మిర్జాపూర్‌లో 641 మంది, ఆమ్లికుంటలో 528 మంది.. ఇలా 26 గ్రామాల్లో 20,239 మంది రైతులకుగాను 8,527 మందికే రుణమాఫీ అయ్యింది.
‘70 లక్షల మంది రైతులను రేవంత్ మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోస్తున్నారు. వందశాతం రుణమాఫీ చేసి ఉంటే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఈ రైతుద్రోహి ప్రభుత్వాన్ని వెంటాడుతాం, వేటాడుతాం. మొదటి అడుగుగా రైతు ధర్నాతో ప్రారంభిస్తాం. రైతు రుణమాఫీ చేయలేని సన్నాసులమని ఈ ప్రభుత్వం ఒప్పుకోవాలి. రుణమాఫీ జరిగేదాకా కాంగ్రెస్‌ను వెంటాడుతాం. రైతులు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దు. సీఎస్ శాంతికుమారిని కలిసి విన్నవిద్దాం’ అని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ డ్రామాలు ఇక నడవవు. రుణమాఫీ పూర్తిగా ఎప్పుడు చేస్తారో చెప్పాలి. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలన్నందుకు సీఎం మాట్లాడిన బజారు భాషకు వ్యతిరేకంగా తెలంగాణ తల్లి విగ్రహానికి లేదా పోస్టర్‌కు పాలాభిషేకం చేసి ధర్నాలు ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మూర్ఖుడిని క్షమించాలని తెలంగాణ తల్లిని వేడుకోండి. ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎప్పటిలోగా రుణమాఫీ చేస్తారో ఈ ప్రభుత్వం చెప్పాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘ఇదే కథ ప్రతి ఊరిలో ఉన్నది. రుణమాఫీలో పాస్‌బుక్‌లో పేర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను దాఖలు చేయటం, రేషన్‌కార్డు వంటి కారణాలు చెప్పి అనేక కుంటిసాకులతో ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడుతున్నది. రుణమాఫీకే ఇన్ని సాకులు చెప్తున్న ప్రభుత్వం రైతుభరోసాకు ఇంకా ఎన్ని ఆంక్షలు పెడుతుందో! ఇది మోసకారుల ప్రభుత్వం. దగా ప్రభుత్వం. తొలుత రూ.49,500 కోట్లతో మొదలైన రుణమాఫీ ప్రక్రియ ఈ రోజు 7,500 కోట్లకు చేరింది. ఈ ప్రభుత్వం దీంతోనే రుణమాఫీని ముగించే కుట్ర చేస్తున్నది. డిసెంబర్లో రుణమాఫీకి రూ.49 వేల కోట్లు అయితది అన్నరు. జనవరిలో రూ.40,000 కోట్లు.. జూలై వచ్చేసరికి రూ.31 వేల కోట్లకు చేరింది. బడ్జెట్‌కి వచ్చే సరికి రూ.26 వేల కోట్లు.. చివరికి 17 వేల కోట్లు అని చెప్పి.. ఇప్పుడు 7,500 కోట్లు మాత్రమే రైతులకు అందించారు’ అని కేటీఆర్ ఫైరయ్యారు.
కేటీఆర్ మీడియా సమావేశంలో రైతు యాదగిరి ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘బొమ్మరాస్పేట మండలం ఎరుపుమల్లకు చెందిన కోట యాదగిరి కుటుంబానికి రుణమాఫీ కాలేదు. రేషన్‌కార్డులో పేరు ఉన్న కుటుంబంలో ఒక్కరికే కాకుండా అందరికీ రుణామాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. బొమ్మరాస్పేట ఎస్బీఐలో యాదగిరికి 1.60 లక్షల రుణం, భార్య శారదకు 1.60 లక్షలు, పెద్ద కొడుకు అశోక్‌కు 1.84 లక్షలు, చిన్న కొడుకు అభిలాష్‌కు 1.50 లక్షలు రుణం ఉన్నది. కుటుంబంలో ఒకరికి తొలుత చేసి తర్వాత అందరికీ రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పారు. కానీ, నేటికీ వారికి మాఫీ కాలేదు’ అంటూ ఖాతాల వివరాలను మీడియాకు అందజేశారు. సీఎం మాటలన్నీ మోసాలేనని ఇకడే అర్థమవుతున్నదని, సీఎం సొంత నియోజకవర్గంలో రైతులకు జరిగిన మోసమిదని మండిపడ్డారు.