హైదరాబాద్: లగచర్లలో దళిత, గిరిజన రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిన తీరును నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ధర్నా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ రోడ్డుమార్గాన మానుకోటకు బయల్దేరారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొత్తగూడెం ఎక్స్ రోడ్స్ వద్ద మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కేటీఆర్‌కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం చౌటుప్పల్, చిట్యాల, నార్కట్ పల్లి, అర్వపల్లి, మరిపెడ బంగ్లా మీదుగా మహబూబాబాద్‌కు చేరుకుంటారు. ఉదయం 10:30 గంటలకు మహబూబాబాద్ తహశీల్దార్ కార్యాలయం వద్ద జరగనున్న బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ పాల్గొంటారు.
ముందుగా ఈ నెల 21న మహాధర్నా నిర్వహించాలని పార్టీ తలపెట్టినా, కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి అనుమతి నిరాకరించేలా చేసింది. దీంతో జిల్లా నేతలు హైకోర్టును ఆశ్రయించి ఈనెల 25న మహా ధర్నా నిర్వహించేందుకు అనుమతి పొందారు. ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానుండటంతో బీఆర్ఎస్ నాయకులు మానుకోటలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట భారీ ఏర్పాట్లు చేశారు.
మహబూబాబాద్ మహా ధర్నాకు బయల్దేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/j6aYXdmy1d
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2024