హైదరాబాద్ : కేటీఆర్ దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన మంత్రి అని, కేటీఆర్ అంటే యూత్ ఐకాన్ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా విజయవంతంగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఉస్మానియా యూనివర్సిటీ రిసెర్చ్ స్కాలర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర సెక్రటరీ జి.రాజేష్ నాయక్ రచించిన పుస్తకాన్ని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కేటీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. నేటి యువతకు ఆయన నడవడిక ఆదర్శమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించడంలో కేటీఆర్ ది ముఖ్య పాత్ర అని తెలిపారు. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు కొత్త ఇండస్ట్రీలు, ఐ.టి కంపెనీలు రాష్ట్రానికి రప్పించి ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఆయన అకుంఠిత దీక్ష కండ్ల ముందు సాక్షాత్కారిస్తుందన్నారు.
ఐటీ రంగంలో కేటీఆర్ అనేక సంస్కరణలకు ఆజ్యంపోశారని, టి-హబ్ లాంటి వేదికలతో యువతలోని నైపుణ్యాన్ని వెలికితీసే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో అభిమానం చురగొన్న యువ నాయకుడు కేటీఆర్ అని మంత్రి వేముల ప్రశంసించారు.
హైదరాబాద్ మహానగరంలో ఎన్నో రోడ్లు, ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లను నిర్మించి హైదరాబాద్ నగర ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు కేటీఆర్ తీర్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రిసెర్చ్ స్కాలర్ అయిన రాజేష్ నాయక్ తన అనుభవాల ద్వారా రాసిన ‘నిత్య కృషీ వలుడు కె.టి.ఆర్’ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, పలువురు టీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.