కాల్వశ్రీరాంపూర్, ఆగస్టు 24: బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న బీఆర్ఎస్ కార్యకర్త కూతురికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఆరెపల్లెకి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కాంటాల వీరన్న కూతురు సంకీర్తన ఈ నెల 15న కళాశాలలో అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోగా కుటుంబసభ్యులు స్థానిక దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ స్ట్రోక్ అని చెప్పడంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా చికిత్సకు రూ.20 లక్షల ఖర్చు అవుతుందని వైద్యు లు తెలిపారు.
సంకీర్తనను ఆదివా రం టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేశ్, వంగళ తిరుపతిరెడ్డి పరామర్శించారు. వారి పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి సహకారంతో కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కేటీఆర్ నిమ్స్ యాజమాన్యంతో మా ట్లాడి, సంకీర్తనను అక్కడ చేర్పించారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.