ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీని 24 గంటలు గడవక ముందే అమలు చేసి మరోమారు రైతు పక్షపాతిగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్, గొల్లపల్లి, ఎల్లారెడ్డిపేట రైతుల వరప్రదాయిని సింగసముద్రం చెరువుకు వచ్చే కాలువలో పూడికతీత పనులను రైతులే శ్రమదానంతో చేస్తున్నట్టు సమాచారం అందుకున్న కేటీఆర్.. సత్వరం స్పందించి పెద్దమొత్తంలో ఉన్న చెట్లు, గడ్డి, ముళ్లపొదలు తీసేందుకు ఎక్స్కవేటర్ ఏర్పాటు చేయించాలని శనివారం బీఆర్ఎస్ నాయకులను ఆదేశించారు.
24 గంటలు గడవక ముందే ఆదివారం పనులు ప్రారంభయ్యాయి. గత కొన్ని రోజులుగా సింగసముద్రానికి వచ్చే కాలువలో గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న గొల్లకేతమ్మ చెరువు నుంచి లక్ష్మీపూర్ వరకు కాలువలో విపరీతంగా ముళ్లపొదలు, తుంగ, గడ్డి పెరిగి ఉండటం.. దీనివల్ల కాలువలోకి నీరు రాక వృథాగా పడిపోవడాన్ని బొప్పాపూర్ రైతులు గమనించారు. కాలువలో పూడిక తీయించాలని, నీరు వృథాగా పోకుండా చూడాలని అధికారులను కోరారు. ఫలితం లేకపోవడంతో రైతులే శ్రమదానం చేసేందుకు సిద్ధమయ్యారు. సుమారు 50 మంది రైతులు కలిసి వృథా నీటిని కాలువలోకి మళ్లించేందుకు 500 మట్టి బస్తాలను ట్రాక్టర్లో తీసుకెళ్లి పలు చోట్ల అడ్డుగా వేశారు. కాలువలో ఉన్న గడ్డిని, తుంగను తొలగించే ప్రయత్నం చేశారు.
ఎక్స్కవేటర్ లేనిదే సాధ్యం కాదని భావించారు. ఈ విషయాన్ని స్థానిక బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో సత్వరం స్పందించి వెంటనే ఎక్స్కవేటర్ను ఏర్పాటు చేయించి పూడికతీత పనులు మొదలు పెట్టాలని, అందుకు అయ్యే ఖర్చులు భరిస్తానని శనివారం హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్లోని కాలువ వద్ద పూడికతీత, ముళ్లపొదలు, గడ్డి తొలగింపు పనులను ప్రారంభించారు. 24 గంటలు గడవక ముందే స్పందించి రైతుల పక్షాన నిలబడిన కేటీఆర్కు రైతులు, బీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎగువ మానేరు మత్తడి దుంకుతుంటే ఆ నీళ్లు కాలువల పడి సిం గసముద్రానికి రావాలె. కానీ గొల్లకేతమ్మ చెరువు కాడ నుంచి సము ద్రం కాలువ దాక చూస్తె మొత్తం గడ్డి, ముళ్లపొదలు, పూడిక ఉంది. దాంట్లో నుంచి నీళ్లు రాక వృథాగా పడిపోతున్నయి. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా స్పందించలే. మేమే శ్రమదానం చేసి నీళ్లు వృథాగా పోకుండా అడ్డుకట్ట వేసినం. విషయాన్ని కేటీఆర్ సార్ దృష్టికి మావోళ్లు తీస్కపోతే జేసీబీ పెడ్తమని చెప్పిన్రు. మాటిచ్చిన 24 గంటల్ల జేసీబీ పెట్టి కాలువ సాపు చేయిస్తున్నరు. కేటీఆర్కు మా ఊరి రైతుల పక్షాన కృతజ్ఞతలు.
– చల్ల కిష్టారెడ్డి, రైతు, బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట మండలం
కాలువల పూడిక తీయడానికి రైతులు పడుతున్న కష్టం చూసి కేటీఆర్ సార్ స్పందించారు. కాలువ లో పూడిక పేరుకుపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోయినం. వెంటనే స్పందించి కాలువ పూడికతీత పనులు చేయిస్తున్నారు. కేటీఆర్ సార్కు మా రైతుల పక్షాన కృతజ్ఞతలు.
– వర్స కృష్ణహరి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, బొప్పాపూర్, ఎల్లారెడ్డిపేట.