KTR | యుద్ధం ప్రారంభమయ్యాక ఎల్పీజీ సిలిండర్ల కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద చాంతాడంత లైన్లు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు నమ్మబలుకుతోందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ సభ్యులు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం ఆధీనంలో పెట్రోలియం శాఖ ఉందని.. తామేమీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోందని కేటీఆర్ అన్నారు. ఫ్యూచర్లో గ్యాస్ సిలిండర్ల సైజ్ తగ్గిస్తారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయిని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైనట్లుగా సామాన్యుల పరిస్థితి ఉందని అన్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత చర్చనీయాంశంగా మారిందని తెలిపారు. కొరత లేదని కేంద్రం, సప్లయి లేదని రాష్ట్రం ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.