KTR | హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ) : యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు రెండో దశ మెట్రో రైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకే సీఎం రేవంత్‌రెడ్డి ఇన్ని కుప్పిగంతులు వేస్తున్నారని ధ్వజమెత్తారు.
71సార్లు ఢిల్లీకి చకర్లు కొట్టినా, బడేభాయ్ మోదీని మెప్పించి ప్రా జెక్టును ఒప్పించలేకపోవడం సీఎం చేతకానితనాని కి నిదర్శనమని మండిపడ్డారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రంపై, ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా, ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదని విమర్శించారు. తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి రేవంత్‌కు ఏర్పడిందని దుయ్యబట్టారు.
అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్‌రెడ్డి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు ఎలా వచ్చాయో, మీ దికుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతున్నదని పేర్కొన్నారు.
‘ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్ని చూస్తున్నట్టుగా చూస్తున్నారు’.. అని మీరు చెప్పుకొన్నప్పుడే మీ నిజస్వరూపం బయటపడింది. బీఆర్ఎస్పైన, కేసీఆర్‌పైన పడి ఏడ్వటం తప్ప మీకు ఏ పనీ చేతకాదని తెలంగాణ సమాజానికి అర్థమైంది’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకున్నదని చెప్పడం అంటే, మోదీ కన్నా కేసీఆర్ పవర్ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకొన్నట్టేకదా? అని ప్రశ్నించారు.
మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్‌ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే ముకు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే మినీ ఇండియాలాంటి హైదరాబాద్‌లో మీకు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. నాడు కాంగ్రెస్ పాలనలో 28శాతం పనులు కూడా పూర్తి చేయకుండా మెట్రో ప్రాజెక్టును చికుల్లో వదిలేశారని, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72శాతం పనులను పూర్తిచేశారని గుర్తుచేశారు. కేంద్రం సహకరించకపోయినా, రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత ముమ్మాటికీ కేసీఆర్‌కే దకుతుందని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ పై అనేక ప్రణాళికలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిందని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి తరహాలో స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఉనికిలో లేని ఊహాజనిత నగరానికి మెట్రో తీసుకువెళ్లాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదని తెలిపారు. కేవలం ప్రజల ప్రయోజనాలు, వారి ప్రయాణ సౌకర్యాని దృష్టిలో ఉంచుకొని మెట్రో ఫేజ్-2ను ఆరు కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర డిజైన్ చేసింది కేసీఆరేనని, నలుదిశలా ఆరు రద్దీ రూట్లలో ప్రణాళికలు రచిస్తే, వాటిని పనికిరాని రూట్లు అంటూ ప్రజలను అవమానిస్తారా? అని సీఎం రేవంత్‌ను కేటీఆర్ నిలదీశారు.
అధికారంలోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన ద్రోహి రేవంత్‌రెడ్డేనని మండిపడ్డారు. మెట్రో ఫేజ్-2కు ఎల్అండ్టీ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని ప్రశ్నించారు. ఏకంగా ఎల్అండ్టీ సీఎఫ్వోనే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్టుగా భయభ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది మీరే కదా? అని ప్రశ్నించారు. 30వేల కోట్ల మెట్రో ఆస్తులను, నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే ఆ సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం హైదరాబాద్ మెట్రోరైల్ భవిష్యత్తును రేవంత్‌రెడ్డి పణంగా పెడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.