రేవంత్‌రెడ్డీ.. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి బరాబర్ శపథం చెయ్.. ఒక్క రైతుకు కూడా యూరియా కష్టం లేకుండా చేస్తానని శపథం చెయ్.. దమ్ముంటే.. మహిళలందరికీ నెలకు రూ.2,500 కొత్త సంవత్సర కానుకగా ఇస్తానని శపథం చెయ్.. సంక్రాంతి నుంచి తులం బంగారం ఇస్తానని శపథం చెయ్.. ముసలోళ్లకు రూ.4వేల పెన్షన్ ఇస్తానని శపథం చెయ్..
-కేటీఆర్ సవాల్

మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరుకు అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సమైక్య పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీయే అటకెక్కించిందని, ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి పథకానికి కేసీఆర్ హయాంలో కేటాయించిన 90 టీఎంసీల నీటి కేటాయింపులు కాదని, 45 టీఎంసీలే చాలం టూ ఇక్కడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నదని నిప్పులు చెరిగారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సర్పంచ్‌లకు ఆత్మీయ సన్మాన సభలో కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో పాలమూరును సస్యశ్యామలం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టు పనులను 90 శాతం పూర్తి చేశారని, కాంగ్రెస్ సర్కారు వచ్చి రెండేండ్లయినా మిగిలిన 10 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు మొత్తానికే తొక్కిపెట్టే కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్టు మీద పగపట్టిండు.. కాళేశ్వరం మీద కక్ష కట్టిండు.. కృష్ణా, గోదావరి జలాల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా రేవంత్‌రెడ్డి ఆడుతున్నడు’ అంటూ విమర్శించారు. పాలమూరును పూర్తి చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే కక్షతోనే ప్రాజెక్టును పక్కనపెట్టారని విమర్శించారు. ‘పాలమూరు గోస ఈనాటిది కాదు.. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనప్పటి నుంచీ మొదలైంది. పాలమూరు బిడ్డ బూర్గుల రామకృష్ణారావు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలకు నీళ్లిచ్చేందుకు కృష్ణా నదిపై ప్రాజెక్టులకు ప్రణాళికలు వేసిండ్రు.
ఆలోపే హైదరాబాద్ రాష్ట్రం పోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యం, ఈ ప్రాంత నేతలు నోరుమెదపకపోవడంతో పాలమూరులో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని వలసలకు మారుపేరుగా మారింది’ అని గుర్తుచేశారు. 1956 నుంచి 2001 దాకా పాలమూరులో ఏ ఒక్క ప్రాజెక్టునూ కాంగ్రెస్ పట్టించుకోలేదని, పాలమూరుకు నంబర్‌వన్ విలన్ కాంగ్రెస్సేనని స్పష్టంచేశారు. పాలమూరు గోస తీర్చేందుకు కేసీఆర్ హయాంలో 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక తొక్కిపెట్టాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్‌కు కనీసం కాలువలు తవ్వడం కూడా చేతకాలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి.. రాబందుల పాలన వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో రైతుల పరిస్థితి చూస్తే బాధకలుగుతున్నదని, యూరియా కోసం అన్నదాతలు అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితికి ఈ ప్రభుత్వం దిగజార్చిందని మండిపడ్డారు. చలిలో గంటల తరబడి లైన్లో నిలబడే పరిస్థితి మళ్లీ వచ్చిందని వాపోయారు. ‘ఆనాటి రోజులు తెస్తామంటే ఏదో అనుకున్నం.. నిజంగానే పాత రోజులు వచ్చినయ్. ఎరువుల కోసం లైన్లో చెప్పులు కనబడుతున్నయ్. యూరి యా దుకాణాల వద్ద రైతుల బారులు కనబడుతున్నయ్’ అని దుయ్యబట్టారు.
నేటి పాలకుల గుండెల్లో రైతులపై ప్రేమ లేదని, అందుకే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. మార్పు అంటూ ఊదరగొట్టి గద్దెనెక్కి తెలంగాణను ఆగమాగం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రేవంత్‌రెడ్డికి పాలమూరు మీద ప్రేమ లేదు.. హామీల అమలుపై చిత్తశుద్ధి లేదు.. ఆయనకు భూముల మీద.. భూ దందాల మీద.. భూ కబ్జాల మీద.. వాటి నుంచి వచ్చే రియల్ ఎస్టేట్ పైసల మీద తప్ప.. ప్రజల మీద ప్రేమ లేదు’ అని ధ్వజమెత్తారు. ‘రెండేండ్లయినా గ్యారెంటీలు అమలు చేయడం లేదని అడిగితే ‘గుడ్లు పీకి గోటీలాడతా.. పేగులు తీసి మెడలో వేసుకుంటా.. లాగుల తొండలు ఇడుస్తా’ అంటూ బూతులు మాట్లాడుడు తప్ప చేసిందేం లేదు’ అని దెప్పిపొడిచారు.
హైదరాబాద్‌లో పరిశ్రమలకు ఇచ్చిన భూములను అమ్మేందుకు హిల్ట్ స్కీం తెచ్చి రూ.5 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించాడని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ధ్యాస అంతా భూముల అమ్మకంపైనే ఉన్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఎంత దోపిడీ చేసినా.. ఎన్ని కుంభకోణాలకు పాల్పడినా బీజేపీ మాత్రం మాట్లాడదని, కాంగ్రెస్, బీజేపీ నడుమ అలయ్ బలయ్ నడుస్తున్నదని విమర్శించారు.

రెండేండ్లలోనే కాంగ్రెస్ సర్కారు తీరు ప్రజలకు అర్థమైందని, అడ్డగోలు హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయని ప్రభుత్వంపై మండి పడుతున్నారని, ఏదో మార్పు అని ఓటేసినందుకు మోస పోయి గోస పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఉన్పప్పుడు ఎట్లుండె? ఇప్పుడెట్లున్నది? అని ఆలోచిస్తున్నారని, పాలిచ్చే బర్రెను కాదనుకొని తన్నే దున్నపోతును తెచ్చుకున్నామని బాధపడుతున్నారని తెలిపారు. ‘కేసీఆర్ ఉన్నప్పుడు ఉత్తమ పంచాయతీల అవార్డుల్లో తెలంగాణకు 30 శాతం వచ్చినయ్ .. కాంగ్రెస్ వచ్చినంక ఏమైంది? ట్రాక్టర్లతో డీజిల్ పోసే దిక్కు లేదు. డంపు యార్డులను, వైకుంఠధామాలను పట్టించుకునేటోడు లేడు. మొత్తం కంప చెట్లు పెరిగి ఊర్లన్నీ ఆగమాగమైనయ్’ అని వాపోయారు.
‘మొన్న కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి మీటింగ్ పెట్టి సర్పంచ్‌లకు నాలుగు మంచి మాటలు ఏమైనా చెప్తాడేమో అనుకున్నా.. ఏం మాటలవి? బూతులే బూతులు.. నేను ఆంధ్రాలో చదువుడు ఆయనకు నచ్చలేదట.. అవును మరి.. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు.. 1991లో తెలంగాణలో ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ గవర్నమెంట్.. బడులను సక్కగ పెట్టక.. కాలేజీలు సక్కగా పెట్టక నాలాంటోళ్లు లక్షల
మంది ఆంధ్రాకు పోయి చదువుకున్నరు’ అని ధ్వజమెత్తారు.
‘కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రి కానియ్యా అని శపథం చేస్తున్నవ్.. రేవంత్‌రెడ్డీ.. దమ్ముంటే రైతులకు యూరియా కష్టాలు లేకుండా చేస్తానని శపథం చెయ్.. మహిళలందరికీ నెలకు రూ.2,500 జనవరి 1 కానుకగా ఇస్తానని శపథం చెయ్.. సంక్రాంతి నుంచి తులం బంగారం ఇస్తానని శపథం చెయ్.. ముసలోళ్లకు రూ.4వేలు పెన్షన్ ఇస్తానని శపథం చెయ్’ అని సవాల్ విసిరారు. బంగారం లాంటి రాష్ర్టాన్ని అప్పగిస్తే కాంగ్రెస్ నాయకులు తెలంగాణను ఆగం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
‘ఉమ్మడి పాలమూరు జిల్లాలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నరు.. ఎంపీ ఉన్నడు.. ముఖ్యమంత్రిది కూడా ఈ జిల్లానే.. అధికారం, హంగు, ఆర్భాటం అన్నీ ఉన్నయి. వాళ్ల కండ్లు నెత్తికెక్కినయ్. ఎవరైనా బీఆర్ఎస్ సర్పంచులు వస్తే గేట్ కాడి నుంచే మెడబట్టి నూకుతా అని బెదిరిస్తున్నరు. నేనొక్కటే మాట చెప్తున్నా.. సర్పంచులు ఎవరికీ భయపడొద్దు. భారత రాజ్యాంగం మీకు రక్షణగా ఉన్నది. పంచాయతీలకు వచ్చే నిధులను ఆపే హక్కు ఏ ఎమ్మెల్యేకు లేదు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. ‘కాంగ్రెస్ వాళ్ల కథ రెండేండ్లే.. ఆ తర్వాత నెక్ట్స్ అధికారం మనదే.. బీఆర్ఎస్ వచ్చాక మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే బాధ్యత మాదే’ అని భరోసా ఇచ్చారు. సర్పంచ్‌గా గెలిచిన, గెలిపించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
‘మొన్నటి సర్పంచ్ ఎన్నికలు క్వార్టర్ ఫైనల్ మాత్రమే..ఇప్పుడు ముందట సెమీ ఫైనల్ ఉన్నది.. మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికలు వస్తయి.. అటెన్క కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేసుకునేందుకు 2028లో ఫైనల్ ఉంటది. పోయిన ఎన్నికల్లో చేసిన తప్పు మళ్లీ చేయొద్దు.. కారు గుర్తు మీద ఎవరు నిలబడ్డా.. కేసీఆరే నిలబడినట్టు భావించి గెలిపించాలె’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వెంకటేశ్వర్‌రెడ్డి, ఇంతియాజ్ ఇసాక్, నాయకులు కురువ విజయ్ కుమార్, బైకని శ్రీనివాస్ యాదవ్, కురువ పల్లయ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. పేదలు, బడుగులు, రైతుల బాగుకోసం ముందుచూపుతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును నిర్మాణం చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేసినా మిగిలిన కొద్దిపాటి పనులు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు సాగునీటిని అందించేది మరిచి, ఆంధ్రాకు నీటిని తరలించేందుకు పూనుకొంటున్నారని ధ్వజమెత్తారు. వేల ఎకరాలకు సాగునీటిని అందించే ప్రాజెక్టును పక్కనపెట్టి దొడ్డిదారిన ఆంధ్రాకు నీటిని మళ్లించే కుట్ర జరుగుతున్నదని, ఈ జిల్లా వాడినని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి ఏమాత్రం పాలమూరు గురించి పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలన గాడి తప్పిందని, బీఆర్ఎస్ హయాంలోనే పారదర్శకత పాలన కొనసాగిందని బీఆర్ఎస్ రాష్ట నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. కేసీఆర్ కలలు, ఆలోచనా విధానాన్ని నిజం చేసే నిజమైన సైనికులు బీఆర్ఎస్ నాయకులు అని స్పష్టంచేశారు. ప్రతిపక్షంలో ఉన్నా నాగర్‌కర్నూల్ జిల్లా అంతటా సగానికి సగం సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. గెలిచిన సర్పంచ్‌లు కాంగ్రెస్, బీజేపీల సర్పంచ్ల కన్నా గొప్ప పాలన అందించి ప్రజల మన్నలను అందుకోవాలని ఆకాక్షించారు.
ప్రతిపక్షంలో ఉన్నా నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో వీరోచితంగా పోరాడి 50 శాతం సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నామని చెప్పారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే సొంతూరు తూడుకుర్తిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినా గెలిచినంత సంతృప్తినిచ్చిందన్నారు. అక్కడ మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి విరోచితంగా పోరాటం చేశారని అభినందిస్తూ కేటీఆర్‌తో ప్రత్యేకంగా సన్మానం చేయించారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక్కతాటిపై ఉండి అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకునేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సీఎం సొంత జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన విజయవంతమైంది. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ల ఆత్మీయ సన్మాన సభకు భారీ ఎత్తున పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు. కేటీఆర్‌ను చూసేందుకు దాదాపు మధ్యాహ్నం 12 గంటల నుంచే స్థానికులు వేచి ఉన్నారు. 12:30కు నాగర్‌కర్నూల్‌కు చేరుకున్న కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఉయ్యాలవాడ నుంచి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీ సభా స్థలానికి చేరుకునే సరికి దాదాపు రెండు గంటలు పట్టింది. హౌసింగ్ బోర్డ్ కాలనీ, బస్టాండ్ కూడలిలో కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ గులాబీ పూలతో ముంచెత్తారు.
హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ) : రతన్ టాటా దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం రతన్ టాటా జయంతి సందర్భంగా కేటీఆర్ ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన వారసత్వం బోర్డు రూమ్‌లకు మించి విస్తరించిందని, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేందుకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయనను ఎంతో మిస్ అవుతున్నామంటూ కేటీఆర్ ఎక్స్ ద్వారా నివాళులర్పించారు.

‘పంచాయతీ ఎన్నికలంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటయి.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటది. కానీ నేడు రెండేండ్లు తిరక్కుండానే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు.
‘ఇయ్యాల అచ్చంపేటలో ఏం జరిగిందో చూసినం ? రేవంత్‌రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లికి పక్కన ఉన్న పొల్కంపల్లిలో ఆయన సొంత మండలం వంగూరులో గెలిచినం.. చింతపల్లి మనమే గెలిచినం.. వంగూరు మండలంలో మనకే మెజారిటీ వచ్చిందన్నా అంటూ చిట్టీ రాశి పంపిండ్రు.. అచ్చంపేటలో మనకు ఓ నాయకుడు ఉండె.. మాజీ ఎమ్మెల్యే.. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయి ఏం చేసిండు? ఏం సాధించిండు? ఎన్ని ఊర్లలో గెలిచిండు? రెండంటే రెండే.. అవి కూడా అడ్డిమార్ గుడ్డి దెబ్బల వచ్చి ఉంటయ్’ అని కేటీఆర్ చురకలంటించారు. ‘నేను పార్టీ కంటే గొప్పోడిని.. నావల్లనే పార్టీ అని ఎవరైనా అనుకుంటే ఇట్లే అయితది.. అడ్రస్ లేని బతుకైతది’ అంటూ గువ్వల బాలరాజును ఉద్దేశించి దుయ్యబట్టారు.