ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరును ఎడారిగా మార్చే కర్ణాటక కాంగ్రెస్ కుట్రలను అడ్డుకోకుండా నల్లమల్ల పులిబిడ్డనని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి, పిల్లిలా ఇంట్లో కూర్చున్నడు. రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్మూధైర్యముంటే.. నల్లమల పులిబిడ్డవే అయితే.. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడు.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కాంగ్రెస్-బీజేపీ కలిపి నడుపుతున్న జాయింట్ వెంచర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. 11-12 ఏడ్లుగా ఈ రెండు పార్టీలు రాష్ర్టాన్ని సతాయిస్తూ, తీవ్ర నష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేక అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్రపూరితంగా చేతులు కలిపాయని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నుంచే ఆ రెండు పార్టీలను బొందపెట్టాలని పిలుపునిచ్చారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్మూ ధైర్యముంటే, నల్లమల పులిబిడ్డవే అయితే ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడు’ అని సవాల్ విసిరారు. అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని మరిచిన కాంగ్రెస్‌కు స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు పంచుతారని, వారిచ్చే డబ్బులు తీసుకొని కారు గుర్తుకు ఓటేయాలని, కాంగ్రెస్ చేసిన మోసాన్ని మోసంతోనే జయించాలని సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఆదివారం నిర్వహించిన ‘బీఆర్ఎస్ జనగర్జన’ భారీ బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, మోసపూరిత విధానాలను ఎండగట్టారు.
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెరిగితే కొడంగల్ లిఫ్ట్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, శ్రీశైలం డ్యాం నిరుపయోగంగా మారతాయని కేటీఆర్ హెచ్చరించారు. రూ. 70 వేల కోట్లతో ఆల్మట్టి డ్యాం ఎత్తును మరో ఐదు మీటర్లు పెంచే కర్ణాటక కాంగ్రెస్ కుట్ర ఫలిస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చుక నీరు కూడా రాదని ఆందోళన వ్యక్తంచేశారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం 519 మీటర్లు ఉన్న ఆల్మట్టి ఎత్తును 524 మీటర్లకు పెంచి కృష్ణా నుంచి తెలంగాణకు చుక్కనీరు రాకుండా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. అక్కడి ప్రభుత్వ నిర్ణయంతో పాలమూరు ఎడారిగా మారే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ముప్పు ముంచుకొస్తుంటే పులినని చెప్పుకొనే సీఎం రేవంత్ పిల్లిమాదిరిగా ఇంట్లో దాక్కున్నారని ఎద్దేవా చేశారు. అక్కడి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.70 వేల కోట్లు కేటాయించినా మన సీఎం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిప్పు లు చెరిగారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదోనని ఇటీవల ఆదిలాబాద్‌లో కొల్లాపూర్ ఎమ్మెల్యే, ఈ జిల్లా మంత్రి జూపల్లి చెప్పిన మాటలు విని నవ్వుకునే పరిస్థితి ఉన్నదని అన్నారు. జూపల్లికి కాంగ్రెస్ సర్కారు వస్తదో, రాదోననే అనుమానం ఉండవచ్చని, కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం కాంగ్రెస్ రాదని, మళ్లా వచ్చేది కేసీఆర్ అనే విషయం స్పష్టంగా తెలుసని చెప్పారు. మంత్రులకు సోయి, తెలివిలేకపోవచ్చుగానీ అచ్చంపేట గడ్డ బిడ్డలకు తెగువ, తెలివి, పౌరుషం ఉన్నది కాబట్టే దుర్మార్గపు కాంగ్రెస్‌ను మళ్లీ రానీయబోమని ఘంటాపథంగా చెప్తున్నారని అన్నారు.
అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో పుట్టిన రేవంత్‌రెడ్డి సీఎం అయి రాష్ట్రం పరువుతీస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆయనలో అపరిచితుడు ఉన్నారని, ఎప్పుడు ఏం మాట్లాడతడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. ‘పొద్దున రాములా, రాత్రయితే రెమోలా వ్యవహరిస్తరు.. ఓ రోజేమో పేద రైతు కుటుంబం నుం చి వచ్చి సీఎం అయితే కేసీఆర్, కేటీఆర్ ఓరుస్తలేరంటరు. ఇంకోరోజేమో నాకు వ్యవసాయమే తెలియదు, మా తాత, తండ్రి పోలీస్ పటేల్ అంటడు. అసెంబ్లీలో అపరిచితుడులా మాట్లాడుతూ రాష్ట్ర ప్రతిష్ఠను గంగలో కలుపుతున్నరు’ అని విమర్శించారు. ‘గుడ్లు పీకి గోటీలాడుతా’, ‘పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అనే భాషచూస్తే అసహ్యం వేస్తున్నదని విమర్శించారు. రాష్ట్రం దివాలా తీసిందని చెప్తూ తెలంగాణ పరువును బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. హామీలపై నిలదీస్తే ‘నన్ను కోసుకు తింటరా?’ అని మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమని తెలిపారు. హామీలను వదిలి, అడ్డగోలు మాటలతో తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ సరార్కు స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గు ణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆయన పుట్టిన గడ్డ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలుపెట్టాలనే సంకల్పంతోనే ఇక్కడ జన గర్జన సభ పెట్టామని స్పష్టం చేశారు. మీ ఉత్సాహం, ఊపు చూస్తుంటే స్థానిక ఎన్నికల్లో ఓట్లడిగేందుకు వచ్చే కాంగ్రెస్సోళ్లకు తగిన బుద్ధి చెప్తారనే విశ్వాసం కలుగుతున్నదని అన్నారు. అచ్చంపేటలో ఎవరో పార్టీ వీడారని బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజల అభిమానం ఉన్న నాయకుడిని కేసీఆర్ త్వరలోనే పంపిస్తారని భరోసా ఇచ్చారు. తిరిగి కేసీఆర్ సీఎం కావాలంటే అచ్చంపేటలో గులాబీ జెండా ఎగరాలని ఆకాంక్షించారు.
ఆల్మట్టి నిర్మాణాన్నే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వా లు వ్యతిరేకించిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రాజోలిబండ కోసం 2001లో కేసీఆర్ పాదయాత్ర చేసినప్పుడు సుంకేశుల తూములను బాంబులతో పేలుస్తామన్న రాయలసీమ ఎమ్మెల్యేకు, వెయ్యి బాంబులతో మొత్తం బరాజ్‌ను తునాతునకలు చేస్తామని కేసీఆర్ ధీటుగా బదులిచ్చారని గుర్తుచేశారు. ‘కేసీఆర్ నడిగడ్డకు నీరందించేందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, ఆయన ఒత్తిడికి దిగొచ్చి తూములను దించితే బాంబులతో బద్దలుకొడతామని ఓ రాయలసీమ ఎమ్మెల్యే బెదిరించారు. కానీ అచ్చమైన పులి, తెగువ కలిగిన కేసీఆర్.. నువ్వు ఆర్డీఎస్ తూములను ముట్టుకుంటే సుంకేశులను వెయ్యి బాంబులతో పేల్చివేస్తామని, తునాతునకలు చేస్తామని హెచ్చరించారు. మరి నల్లమల పులిబిడ్డ అని చెప్పుకొనే రేవంత్‌రెడ్డికి ఆ దమ్ము ధైర్యం లేదా? ఆల్మట్టితో పాలమూరు, నల్లగొండకు కృష్ణా నీరు బంద్ అయితే కర్ణాటకను ఆపే శక్తిలేదా?’ అని నిలదీశారు. పక్కనున్న కాంగ్రెస్ ప్రభుత్వం కృష్టానీళ్లను ఆపివేస్తుంటే పైనున్న రాహుల్‌గాంధీ, ఇక్కడున్న రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. వారు మాట్లాడరని, తెలంగాణ ప్రయోజనాలను కాపాడేది, ఇక్కడి ప్రజల గురించి మాట్లాడేది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. ‘ఇప్పుడు అచ్చంపేట గడ్డపై రేవంత్‌రెడ్డిని అడుగుతున్న. ఆల్మట్టిని ఆపే దమ్ముందా? లేకుంటే కేసీఆర్ అండగా గులాబీ దండు కదిలి అడ్డుకోవాలా? అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కర్ణాటక కాంగ్రెస్ పెద్దలను రాహుల్‌గాంధీ వద్దకు పిలిపించి ఆల్మట్టి ఎత్తును ఒప్పుకోం అని తేల్చిచెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన నల్లమల పులికాదని అచ్చంపేట నుంచి కొడంగల్‌కు పారిపోయి వచ్చిన నక్క అని, ఈ విషయాన్ని తాను చెప్పడంలేదని, ఆయన నియోజకవర్గ ప్రజలే చెప్తున్నారని అన్నారు. ఈసారి రేవంత్‌ను తరిమికొట్టడం పక్కా అని అంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ లేకుంటే పాలమూరు ప్రాజెక్ట్, కేఎల్ఐ లిఫ్ట్ ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేసిందేవరో, నట్టేట ముంచుతున్నదెవరో ప్రజలు గుర్తుచేసుకోవాలని కోరారు.
కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అకసుతో బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్‌రెడ్డి పకన పెట్టారు. మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడం లేదుగానీ, ఆ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని తన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టడం విడ్డూరం.
-కేటీఆర్
మోసపోతే గోసపడుతమని కేసీఆర్ హె చ్చరించినట్టే కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయిన తెలంగాణ ప్రజలు నేడు గోస పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. అన్నివర్గాలూ కాంగ్రెస్ చేతిలో మోసపోయారని అన్నారు. యూరియా కోసం యుద్ధాలు చేసే పరిస్థితి ఇప్పుడు తలెత్తిందని అన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్కనాడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కనుమరుగైన యూరియా కోసం క్యూలైన్లు మళ్లీ వచ్చాయని, లైన్లలో నిలబడి రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మిర్యాలగూడలో గిరిజన రైతు యూరియా కోసం వెళ్లి చనిపోయారని గుర్తుచేశారు. యూరియా ఇవ్వకుండా, రైతుబంధు వేయకుండా, వడ్లకు బోనస్ ప్రకటించకుండా రేవంత్‌రెడ్డి రైతులను అరిగోస పెడుతున్నారని విమర్శించారు. గత సెప్టెంబర్ 27న మంతి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై ఈడీ దాడులు చేసిందని, కట్టలకొద్దీ డబ్బులు దొరికినట్టు మీడియాలో వార్తలు వచ్చాయని గుర్తుచేశారు. ఈడీ దాడులు జరిగి ఏడాదైనా ఆ వివరాలను ఈడీ చెప్పడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని, వారి మధ్య అవగాహనకు ఇదే నిదర్శనమని విమర్శించారు.
రియల్ ఎస్టేట్ దందాలతో వందల కోట్లు సంపాదిస్తున్న కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.5,000 ఇచ్చినా తీసుకోవాలి. కాంగ్రెస్ నేతలు డబ్బులిచ్చి ప్రమాణాలు చేయిస్తారు. తుపేల్.. తుపేల్.. అని మనసులో అనుకొని ప్రమాణాలు చేసి కారు గుర్తుకే ఓటు వేసి మోసాన్ని మోసంతోనే జయించండి.
ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా రేవంత్‌రెడ్డి తెలంగాణలోని ప్రతి వర్గాన్ని దారుణంగా మోసం చేశారని కేటీఆర్ విమర్శించారు. అత్తకు 4,000, కోడలికి 2,500 ఇస్తానని చెప్పి కుటుంబాల్లో చిచ్చుపెట్టారని, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇవ్వకుండా రెండు నెలలు ఎగ్గొట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించినట్టు, ఇది ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని చెప్పారు. ఈ బాకీ కార్టులను ఇంటింటికీ పంచి, కాంగ్రెస్ మోసాలను వివరించి స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. కల్యాణలక్ష్మి కింద 8 లక్షల మంది ఆడబిడ్డలకు రేవంత్‌రెడ్డి 8 లక్షల తులాల బంగారం బాకీ పడ్డారని విమర్శించారు. దివ్యాంగులకు ఒకొకరికీ రూ.44 వేలు బాకీ ఉన్నారని తెలిపారు. రియల్ ఎస్టేట్ దందాల తో వందల కోట్లు సంపాదిస్తున్న కాంగ్రె స్ నేతలు ఓటుకు 5,000 ఇచ్చినా తీసుకోవాలని, మిగితా బాకీ ఎప్పుడు ఇస్తారని నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిచ్చి ప్రమాణా లు చేయిస్తారని, తుపేల్.. తుపేల్.. అని మనసులో అనుకొని ప్రమాణాలు చేసి కారు గుర్తుకే ఓటేసి మోసాన్ని మోసంతోనే జయించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ జనగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని, ఈ సభ నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం మొదలైందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అచ్చంపేట ఇన్చార్జి మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. జన గర్జన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో మోసం చేసిన గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బాకీ చెల్లించాలని కాంగ్రెసోళ్లను ప్రజలు నిలదీయాలని కోరారు. నల్లమల బిడ్డనని చెప్పుకునే రేవంత్‌రెడ్డి సొంత ప్రాంతంలోనే ఎంత వ్యతిరేకత ఉందో సభకు వచ్చిన జనాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు. ఒక్క పిలుపుతో భారీ సంఖ్యలో తరలివచ్చిన అచ్చంపేట ప్రజానీకానికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నానని అన్నారు. సభను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీ భవిష్యత్తు వినాశకాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణ భవిష్యత్తును నాశనం చేసేందుకు రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాలపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే గులాబీ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. రౌడీషీట్ నమోదు చేసి స్టేషన్లలో ఫొటోలు పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలను నిలువునా దోచుకుంటున్న కాంగ్రెస్ నేతల ఫొటోలే పోలీస్ స్టేషన్లలో ఉండాలని అన్నారు. బీజేపీ దేశంలో చేయని ఘోరం లేదని, దళితులు, గిరిజనులు, ఆదివాసీలను దారుణంగా అవమానించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాంటి పార్టీలోకి నువ్వు వెళ్లావా అంటూ బాలరాజును ఉద్దేశించి ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉంటే 10శాతం నిధులు ఇవ్వలేని సీఎం పాలమూరు బిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించారు.