KTR | టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిరుద్యోగ యువతకు న్యాయం లభించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
“హైకోర్టు తీర్పు నిజంగా హర్షించదగినది. గతంలో గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు సాక్షాధారాలతో సహా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, టీఎస్పీఎస్సీ మొండిగా వ్యవహరించింది. నిరుద్యోగుల ఆరోపణలను, వారు లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా మూర్ఖంగా ముందుకు పోయింది” అని కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగులు లేవనెత్తిన ఏ అంశాన్ని పట్టించుకోకుండా వారిపై కేసులు పెట్టి, అణచివేతకి, లాఠీఛార్జీలకి గురిచేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. ఈరోజు హైకోర్టు తీర్పుతో నిరుద్యోగులకు న్యాయం జరిగిందని, ఇది ముమ్మాటికీ గ్రూప్-1 బాధితుల అలుపెరగని పోరాటానికి దక్కిన గెలుపు అని ఆయన పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్షా ఫలితాల్లోని అక్రమాల వంటి అనేక ఆరోపణలను, సాక్షాదారులను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందని కేటీఆర్ అన్నారు.”లోపభూయిష్టమైన పద్ధతులతో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి, ఈ కోర్టు తీర్పునకు మీ సమాధానం ఏంటి? హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడిన మీ నిర్లక్ష్య వైఖరికి నేడు విద్యార్థులు నష్టపోతున్నారు” అని ఆయన మండిపడ్డారు.
గ్రూప్-1 పరీక్షల్లోని అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడిన బాధితులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. అత్యంత కీలకమైన గ్రూప్-1 ఉద్యోగాలను అంగట్లో సరుకు మాదిరిగా అమ్ముకోవాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల స్వార్థానికి హైకోర్టు తన తీర్పు ద్వారా అడ్డుకట్ట వేయడం చారిత్రక నిర్ణయమని ఆయన అన్నారు. “ఎన్నికల ముందు, తర్వాత ఉత్త మాటలు చెప్పి నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తీర్పు ద్వారా బుద్ధి కలగాలి” అని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీల సంగతి దేవుడెరుగు, కనీసం ఉద్యోగాలను భర్తీ చేయడం, అక్రమాలు లేకుండా పరీక్షలను ఎలా నిర్వహించాలో కూడా చేతగాని ఈ ప్రభుత్వ అసమర్థతను రాష్ట్ర యువత, విద్యార్థులు గుర్తిస్తున్నారన్నారు.హైకోర్టు ఆదేశాల మేరకు 8 నెలలలోపు రీ-వాల్యుయేషన్ లేదా రీ-మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని కోరుతూ, తక్షణమే చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పులకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
“అనవసర పట్టుదలకు పోకుండా హైకోర్టు లేవనెత్తిన అనేక లోపాలను దృష్టిలో ఉంచుకొని తీర్పును వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఈ అంశంలో విద్యార్థులు కోరుతున్న తీరుగా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మళ్లీ అప్పీళ్లు, కోర్టు కేసులు అంటూ యువతకు అన్యాయం చేయవద్దు” అని కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. విద్యార్థులు డిమాండ్ చేస్తున్న తీరుగా వెంటనే గ్రూప్ వన్ పరీక్షలను తిరిగి నిర్వహించి వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ కోరారు.