KTR | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం అంటే అది తెలంగాణ తల్లికి అవమానమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటదో సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం పెడితే కూడా అట్లుంటుందని ఎద్దేవాచేశారు.
తెలంగాణకు అక్కరకురాని వాళ్ల బొమ్మలను తొలగిస్తామని, తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తామని బుధవారం ఎక్స్‌వేదికగా కేటీఆర్ తేల్చిచెప్పారు. ‘సోనియాగాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్‌గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది’ అని ఆయన రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
దొడ్డి దారిన టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఇవాళ రాజీవ్‌గాంధీ మీద రేవంత్‌రెడ్డి ఒలకబోస్తున్న కపట ప్రేమ అందరికీ తెలుసునని పేర్కొన్నారు. సీఎం ఆలోచనల్లో కుసంసారం.. మాటలు అష్టవికారం అని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి కోసం నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అని మండిపడ్డారు.