KTR | మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) భూములపై రేవంత్ సర్కార్ కుట్రల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో మైనార్టీల సంరక్షకుడిని అని చెప్పుకునే రాహుల్ గాంధీ.. ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమే కాపాడటమా అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో కేటీఆర్‌తో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ( మనూ ) విద్యార్థులు సమావేశమయ్యారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడమే మీ సంరక్షణనా అని ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. మీరు చెబుతున్న మొహబ్బత్ కి దుకాణం ఇదేనా అని ప్రశ్నించారు. విద్యార్థులను వారి భూములను తీసుకొని రోడ్డుమీద వేయడమేనా? అని నిలదీశారు.
సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న సమస్యలపై రాహుల్ గాంధీ మాట్లాడాలి కానీ వారి భూములు గుంజుకుంటున్న తమ ప్రభుత్వంపై స్పందించకపోవడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. యూనివర్సిటీలో ఉన్న భూములు ఖాళీగా ఉన్నవి కావు భవిష్యత్తు విస్తరణ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్టను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. గతంలో ఇదే యూనివర్సిటీ ప్రజా అవసరాల కోసం హైదరాబాద్ నగరం కోసం 32 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇచ్చారని, ఖాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ కు లింక్ రోడ్డు కోసం ఏడెకరాల స్థలాన్ని యునివర్సిటీ భూమి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏనాడు కూడా హైదరాబాద్ నగర ప్రయోజనాల కోసం ప్రజాప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు భూసేకరణను ఏనాడు వ్యతిరేకించలేదని చెప్పారు.
గతంలో తెలంగాణలో జరిగిన ఉద్యమం వల్లనే హైదరాబాద్‌లో సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమాలు త్యాగాల ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ కోసం వాడటం దారుణమని మండిపడ్డారు. గతంలో మేము నిజాం కాలేజీలో హాస్టల్ లేదు అంటే ప్రభుత్వ నిధులతో హాస్టల్ కట్టించామని గుర్తుచేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కావలసిన విస్తరణ సౌకర్యాలకు నిధులు కూడా కేటాయించి అండగా నిలబడతామని భరోసానిచ్చారు.