హైదరాబాద్, అక్టోబరు 12 (నమస్తే తెలంగాణ): ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనాలకు కాంట్రాక్టు ఇవ్వడం కాకుండా జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలని ప్రధాని మోదీని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. ఒక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదని, ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనం ముఖ్యం కారాదని.. జిల్లా అభివృద్ధి ముఖ్యమని బుధవారం ట్వీట్చేశారు.
నీతి ఆయోగ్ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం మిషన్ భగీరథకి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని సిఫార్సుచేస్తే పెడచెవిన పెట్టారని, కానీ రాజకీయ ప్రయోజనం కోసం ఒక వ్యక్తికీ రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రధాని మోదీ నల్లగొండ జిల్లాకు రూ.18 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటిస్తే మునుగోడు ఉపఎన్నిక పోటీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తప్పుకొంటారని కేటీఆర్ మరోసారి ప్రకటించారు. దీనికి బీజేపీ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదని, మరొక వ్యక్తికి కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదని అన్నారు. గుజరాత్ కు గత ఐదు నెలల్లో రూ.80వేల కోట్ల ప్యాకేజీలు ప్రకటించిన ప్రధాని మోదీ, తెలంగాణకు కనీసం రూ.18వేల కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు.