హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టడమే ఆశయంగా పెట్టుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. బీజేపీకి ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వంట గ్యాస్ సబ్సిడీల ద్వారా నష్టపోయిన ఆయిల్ కంపెనీలకు కేంద్రం రూ.22 వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను మంజూరు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఇటు ట్విట్టర్ వేదికగా, అటు పత్రికా ప్రకటన ద్వారా ఆయన బీజేపీ సర్కార్‌పై తీవ్రస్థాయి లో ధ్వజమెత్తారు. ఆయిల్ కంపెనీలకు ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం ఆడబిడ్డలను కనికరించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మోదీ కావాలో, సబ్సిడీ కావాలో దేశ ప్రజలు తేల్చుకోవాల్సిన తరుణం ఇదేనని పిలుపునిచ్చారు. గత రెండేండ్లలో గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుతో దేశంలోని ఆడబిడ్డలపై రూ.42వేల కోట్ల భారం మోపారని, దానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందంటూ రూ. 22 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రధాని మోదీ, సబ్సిడీ ఎత్తేసి, గ్యాస్ సిలిండర్ ధరను అడ్డగోలుగా పెంచి ఆడబిడ్డలపై మోపిన ఆర్థిక భారానికి ప్రత్యేక ప్యాకేజీ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అడ్డగోలుగా పెంచిన సిలిండర్ ధరలు, అడ్డూ అదుపు లేని పెట్రో ధరలతోపాటు ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలతో దేశ ప్రజలకు మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నరకం చూపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
వంటింటి నుంచే బీజేపీ పతనం…
గ్యాస్ బండపై సబ్సిడీ అడిగితే ఏడాదికి మూడు సిలిండర్లు సరిపోవా? అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెకిరించినట్టు మాట్లాడటం మహిళా లోకంపై బీజేపీకి ఉన్న చులకన భావానికి నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. దేశ జనాభాలో సగం ఉన్న మహిళలు తలచుకుంటే బీజేపీ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని అన్నారు. గ్యాస్ భారాన్ని, ధరల భారాన్ని ఇంకా భరించలేమని, బీజేపీ ఘోరాలను ఇక సహించబోమని మహిళలు తీర్మానం చేయాలని పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ కావాలని ఆయన కోరారు. బీజేపీ అంటే ‘భారం అంతా జనంపై మోపే పార్టీ’ అని అభివర్ణించారు.
రెండేండ్లలో 42వేల కోట్ల భారం
మోదీ హయాంలో అడ్డగోలుగా పెరిగిన సిలిండర్ ధరతో దేశంలో 2.11 కోట్ల మంది కనీసం ఒక సిలిండర్ కూడా కొనలేకపోతున్నారని కేటీఆర్ తెలిపారు. దేశంలోని 39 కోట్ల గ్యాస్ కనెక్షన్‌దారులపై రెండేండ్లలో రూ.42 వేల కోట్ల సబ్సిడీ భారాన్ని కేంద్రం మోపిందన్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌తో మధ్యతరగతి ప్రజల ఆదాయాలు భారీగా తగ్గినా పట్టించుకోని బీజేపీ ప్రభుత్వం, ధరలను పెంచి ఆయా వర్గాలను దోచుకోవడం మాత్రం ఆపలేదన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్యపు బీజేపీ పాలనలో ధరలు దండయాత్ర చేస్తూ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు.
అప్పుడు 400.. ఇప్పుడు 1100
నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు సుమారు రూ.400 ఉన్న సిలిండర్ ధర ఈ రోజు రూ. 1100 దాటి పరుగులు తీస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. 2014లో కేంద్రం ఒక సిలిండర్‌పై రూ.827 సబ్సిడీ ఉండేదని, నేడు మోదీ పరిపాలనలో సబ్సిడీ గుండుసున్నాగా మారిందని వెల్లడించారు. మోదీ పాలనలో నాటి నుంచి ఇప్పటిదాకా సిలిండర్ ధరను 170 శాతం పెంచి సబ్సిడీని సంపూర్ణంగా రద్దు చేశారని తెలిపారు. 2014కు ముందు రూ.400 సిలిండర్ ధర ఉంటేనే అప్పటి ప్రధానిపై విమర్శలు చేసిన మోదీ, ఇప్పుడు దేశ ప్రజలకు ఏమని సమాధానం చెప్తారని నిలదీశారు. ప్రపంచంలోనే అత్యధిక ధరకు సిలిండర్‌ను అమ్ముతున్న ప్రధాని మోదీ అని, ఈ విషయంలో ఆయన విశ్వగురువుగా నిలిచారని ఎద్దేవా చేశారు.
ఆయిల్ కంపెనీలకు ఆర్థికసాయం!
ఆడబిడ్డలపై ఆర్థిక భారమా?
మోదీ పాలనలో ధరలు ఆకాశంలో..
ఆదాయాలు పాతాళంలో..
ఆయిల్ కంపెనీలకు కాసుల పంట
కామన్‌మ్యాన్ గుండెల్లో గ్యాస్ మంట
ఆయిల్ కంపెనీల నష్టాలు తప్ప ఆడబిడ్డల కష్టాలు కనిపించవా?
గరీబోళ్ల గుండెలపై మోయలేని గుదిబండలు.. ఈ గ్యాస్ బండలు
గ్యాస్ వెయ్యి అయ్యింది పేదోళ్లకు మళ్లీ కట్టెల పొయ్యి దిక్కయ్యింది
పేదోడి పొట్టగొట్టడం.. మళ్లీ చేతిలో పొగగొట్టం పెట్టడమే
సిలిండర్ భారాన్ని మూడింతలు చేసి.. ఇప్పుడు మూడు సిలిండర్ల జపం చేస్తరా?
మూడు సిలిండర్లతో మూడుపూటలా వంట సాధ్యమా?
మహిళా లోకానికి అర్థమైంది.. మోయలేని భారం మోపేవాడే మోడీ అని
పేద, మధ్యతరగతి మహిళల వంటింట్లో నుంచే బీజేపీ పతనం షురూ
గ్యాస్ సబ్సిడీని ఎత్తివేస్తరుకంపెనీలకు ప్యాకేజీలు ఎత్తిపోస్తరా?
ఆయిల్ కంపెనీలకు కాదు.. ఆర్థికంగా నష్టపోయిన ఆడబిడ్డలకు ఇయ్యాలె స్పెషల్ ప్యాకేజ్
– ట్విట్టర్లో మంత్రి కేటీఆర్