హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): ప్రచారంలో నీతులు చెప్పి ఇప్పుడు నీతిమాలిన పనులు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం, ఇప్పుడు స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి పార్టీలో చేర్చుకోవడం ఏమిటని ఎక్స్ వేదికగా మంగళవారం కేటీఆర్ ప్రశ్నించారు. ‘నాడు.. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు. ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు.
భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు. చివరికి ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపమన్నారు. రాజీనామా చేయకుం డా ఇతర పార్టీలో చేరితే ఊళ్లనుంచి తరిమికొట్టమన్నారు. మరి ఇవాళ మీరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా? జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి ఇప్పుడు ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారు? ఏ ప్రయోజనాలు ఆశిస్తున్నారు? ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని? రాజకీయంగా ఘోరీ కట్టాల్సింది ఎవరికి? ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే. అందుకే ఇప్పుడు జవాబు చెప్పాల్సింది కూడా మీరే’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
మరో ట్వీట్లో కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని కేటీఆర్ తీవ్రస్థాయిలో తూర్పారబట్టారు. పార్టీ ఫిరాయింపులపై గతంలో రాహుల్‌గాంధీ చెప్పిన విషయాలను గుర్తుచేస్తూ, ఇప్పుడు కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును నిరసించారు. ‘కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని పార్టీ ఫిరాయించిన ప్రజా ప్రతినిధులపై అనర్హత పడేలా రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సవరిస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఇప్పుడు అదే రాహుల్‌గాంధీ రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక నిబంధనలకు విరుద్ధంగా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇది రాజ్యాంగ రక్షణా.. లేక అపహాస్యమా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిం ది. దీనికి విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. దీనిపై మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని కేటీఆర్ స్పష్టంచేశారు.
కాంగ్రెస్ పార్టీ వంచనకు ప్రతిరూపమని మరో ట్వీట్లో కేటీఆర్ విమర్శించారు. ‘సరిగ్గా 49 ఏండ్ల క్రితం ఇదేరోజున కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా పౌరహక్కులు, ప్రజాస్వామ్య హక్కులను, ప్రజల గొంతులను అణచివేసింది. దశాబ్దాలు గడిచినా ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ దాడి కొనసాగుతూనే ఉన్నది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంటులో భారత రాజ్యాంగం కాపీలను పట్టుకోగా, మరో వైపు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్న వారి పార్టీ కార్యాలయంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని చంపారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.