హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు ఢిల్లీలో ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరే సజీవ సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తమకు అవసరమైనప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా వ్యవహరించటం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవాచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ అధినేత కేజ్రీవాల్‌పై అనుసరిస్తున్న వైఖరిని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇండియా కూటమిలో ఉన్న అదే కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ అనుసరించిన వైఖరిని పరిశీలిస్తే స్పష్టమవుతున్నదని విమర్శించారు. ‘నిన్నటిదాకా సత్యసంధుడు, వివేకవంతుడు, నీతిమంతుడిలా కనిపించిన కేజ్రీవాల్.. ఉన్నపళంగా నేడు అవినీతిపరుడు, చెత్తనాయకుడిగా కనిపిస్తున్నాడా?’ అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలు అమలు కోసం ఏడాదిగా తెలంగాణ రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని గుర్తుచేశారు. అవే తరహా హామీలను కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ప్రజలకు ఇస్తున్నదని, ఈ క్రమంలో రాహుల్‌గాంధీ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి, వారి అనుభవాలను తెలుసుకొని ఢిల్లీ ప్రజలకు మాలివ్వాలని సూచించారు.