నాడు హామీలు నేడు హాలిడేలు
ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్.. ఎన్నో హామీలిచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఒక మంచి పనైనా చేశారా? 420 హామీలకు హాలిడే, ఆరు గ్యారెంటీలకు హాలిడే, క్రాప్‌హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నిటికీ హాలిడే ప్రకటించిన ఈ 420 సర్కార్కే మనం శాశ్వతంగా హాలిడే ఇస్తే దరిద్రం పోతది.
- రైతు డిక్లరేషన్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్‌కు కాంగ్రెస్ పాలన
- ‘మూసీ’ని ఆపండి.. కరువు రైతును ఆదుకోండి: కేటీఆర్
- అన్నిటికీ హాలిడేలు ప్రకటించిన ప్రభుత్వానికే హాలిడే ఇవ్వాలి
- రాష్ట్రం ఆగమవుతుంటే నీరో చక్రవర్తి తరహాలో రేవంత్ తీరు
- పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఎందుకు?
- డీపీఆర్ లేకుండానే లక్షన్నర కోట్ల ప్రజాధనం దోపిడీకి సెచ్
- కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఎందుకు?
- గ్లోబల్ సమ్మిట్లు పెట్టకుండానే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం
- మూడేండ్లలో కాంగ్రెస్ సర్కార్ రాష్ర్టానికి తెచ్చిన పెట్టుబడులు, ఇచ్చిన ఉద్యోగాల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు డిమాండ్
ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్.. ఎన్నో హామీలిచ్చారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఒక మంచి పనైనా చేశారా? 420 హామీలకు హాలిడే, ఆరు గ్యారెంటీలకు హాలిడే, క్రాప్‌హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నిటికీ హాలిడే ప్రకటించిన ఈ 420 సర్కార్కే మనం శాశ్వతంగా హాలిడే ఇస్తే దరిద్రం పోతది.
– కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే మూసీ సుందరీకరణకు లక్షల కోట్లు వెచ్చించడం ఎందుకని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సాగునీరు లేదని రైతులు, తాగునీరు లేదని ప్రజలు ఆవేదన చెందుతుంటే ప్రభుత్వం లక్షన్నర కోట్ల మూసీ సుందరీకరణకు ప్రాధాన్యమివ్వడం ఏమిటని ప్రశ్నించారు. డీపీఆర్ బయటపెట్టకుండా, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా పనులు చేపట్టడంపై నిప్పులు చెరిగారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.
420 హామీలకు హాలిడే.. ఆరు గ్యా రెంటీలకు హాలిడే.. క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, పీఆర్సీకి హాలిడే, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు హాలిడే.. ఇలా అన్నిటికీ హాలిడే ప్రక టించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికే మనం శాశ్వతంగా హాలిడేలు ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో గురువారం శాసన మండలి లో విపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్యయాదవ్, జీవన్‌రెడ్డి, నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్, చిరుమళ్ల రాకేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడేమో రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ పంటలు తామే కాపాడుకుంటామని రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన దుస్థితి నేడు ఏర్పడిందని మండిపడ్డారు.
నీరో చక్రవర్తి తరహా నిర్లక్ష్యం
రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయిస్తూ కూర్చున్న తీరుగా సీఎం రేవంత్బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరి నుంచి సుమారు 750 టీఎంసీలు, కృష్ణా నది నుంచి 250 టీఎంసీల నీటిని ప్రభుత్వం నిర్లక్ష్యంతో దిగువకు వదిలేసిందని విమర్శించారు. నీటిని ఎత్తిపోసుకోవాలని నాలుగు నెలల క్రితం తాము హెచ్చరించినా పట్టించుకోకపోవడం వల్లే రాష్ట్రం ఇవాళ కరువును ఎదుర్కొంటున్నదని మండిపడ్డారు. ‘ఒకవైపు రాష్ట్రం కరువుతో అల్లాడుతున్నదని చెప్తున్నరు. కరువు మండలాలను ప్రకటిస్తున్నరు. అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తున్నరు. మరోవైపు మూసీ సుందరీకరణ పేరుతో భారీ ప్రాజెక్టుకు తెరతీస్తున్నారు. ఇదేం పాలన? ఇదేం విచిత్రం?’ అని నిలదీశారు.
రెండేండ్లుగా బీఆర్ఎస్ పోరాటం
మూసీ సుందరీకరణ పేరుతో లక్షన్నర కోట్ల రూపాయల ప్రాజెక్టుకు ప్రభుత్వం తెరతీసినప్పటి నుంచి ప్రజల తరఫున గట్టిగా పోరాడుతున్న పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ నాయకులు సబిత, కార్తిక్‌రెడ్డి, రాజేంద్రనగర్ నాయకులు, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, స్వామిగౌడ్ తదితరులు రెండేండ్లుగా మూసీ సుందరీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని గుర్తుచేశారు.
అమలువుతున్నది అనుముల రాజ్యాంగమా?
రాష్ట్రంలో అంబేదర్ రాజ్యాంగం అమలవుతున్నదా? లేక అనుముల రేవంత్‌రెడ్డి రాజ్యాంగం అమలవుతున్నదా? అని కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్లకుండా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారని విమర్శించారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్తుంటే అరెస్టు చేశారని మండిపడ్డారు. మూసీ వ్యవహారంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే, గతంలో మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన సుధీర్‌రెడ్డిని అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఏడాదిన్నరగా పాదయాత్రలు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్న కార్తిక్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో అంబేదర్ రాజ్యాంగం అమలవుతున్నదా? లేక అనుముల రేవంత్‌రెడ్డి రాజ్యాంగమా? మళ్లీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ పరిస్థితులే వచ్చాయా? ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించాలి’ అని విజ్ఞప్తిచేశారు.

Ktr3
ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఏమిటి?
మూసీ పరిసరాల ప్రజలు లేకుండా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ప్రజల గొంతు నొకి నిర్వహించేది ప్రజాభిప్రాయ సేకరణ? ఇదేం నాటకం? ఇదేం ప్రహసనం? రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో ప్రజల గొంతు నొకుతుంటే మీకు కనిపించడం లేదా? అని నిలదీశారు. కరువుతో ప్రజలు అల్లాడుతుంటే, దాని నుంచి దృష్టి మళ్లించడానికి గ్రామాల్లో నాటకాలు వేయాలని, పాటలు పాడాలని, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మీసాలకు సంపెంగ నూనా?
రియల్ ఎస్టేట్ అంటే రేవంత్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అన్నట్టుగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఉన్నదని కేటీఆర్ ఆక్షేపించారు. మూసీ ప్రాజెక్టు ముసుగులో వేల ఎకరాలకు సంబంధించిన భూవ్యవహారాలు, భారీ స్థాయిలో అక్రమాలకు అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు భయపడుతున్నదని చెప్పారు. ‘ఓవైపు కరువుతో రైతులు అల్లాడుతున్నరు. పశువులకు మేత కూడా దొరుకడం లేదు. హైదరాబాద్ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మల్లన్నసాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చి మూసీలో పోసి సుందరీకరణ చేస్తారట. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె.. అన్నట్టు ఉన్నది సీఎం తీరు’ అని మండిపడ్డారు.
మిగతా అంశాలపై శ్రద్ధ ఎందుకు లేదు?
మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు దెబ్బతిని మూడేండ్లు కావస్తున్నదని, 2023 అక్టోబర్ 21న అకడ పేలుడు శబ్దం వచ్చిందని, అప్పటి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారని కేటీఆర్ తెలిపారు. కానీ దెబ్బతిన్న పిల్లర్ల మరమ్మతులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ‘మేడిగడ్డలో మళ్లీ నీటిని నిల్వ చేయడం, ఎత్తిపోసుకోవడం వంటి అంశాలపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలపైనా ఆసక్తి చూపడం లేదు. ఏ సమస్య గురించి అడిగినా.. ఖజానాలో డబ్బులు లేవు. రాష్ట్రం అప్పుల పాలైందని చెప్తున్నారు. మరి మూసీ సుందరీకరణకు మాత్రం డబ్బులు ఎకడి నుంచి వస్తున్నాయి?’ అని నిలదీశారు.
మూసీ ప్రాజెక్టు డీపీఆర్ బయటపెట్టండి
మూసీ ప్రాజెక్టు డీపీఆర్ ఇప్పటివరకు బయటపెట్టలేదని, ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మూసీ శుద్ధికి సంబంధించి తమ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.4వేల కోట్లతో ఎస్టీపీలు చేపట్టినట్టు గుర్తుచేశారు. మొత్తం ప్రాజెక్టును సుమారు రూ.16వేల కోట్లలో పూర్తి చేయవచ్చని, కానీ కాంగ్రెస్ రూ.1.50 లక్షల కోట్లతో ప్రాజెక్టును చేపడుతున్నదని విమర్శించారు. ‘మీరు ఫేజ్-1 అంటున్నారు. ఇంకా ఎన్ని దశల్లో ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు? మొదటి దశకే ఇంత భారీ వ్యయమని చెప్తున్నారు. ఈ నెల 29న టెండర్లకు ఏర్పాట్లు చేశారు. ఈ టెండర్లను వెంటనే నిలిపివేయాలి. మూసీ సుందరీకరణ పేరుతో జరుగుతున్న హడావుడిని ఆపాలి. రాష్ట్రం కరువులో ఉంటే ఈ సుందరీకరణ ఎందుకు? మళ్లీ వర్షాలు పడి రాష్ట్రం సుభిక్షంగా మారిన తర్వాత, సమగ్ర ప్రాజెక్టు నివేదికను విడుదల చేసి, ప్రజాభిప్రాయ సేకరణ సక్రమంగా నిర్వహించిన తర్వాతే ముందుకు వెళ్లాలి. డీపీఆర్ లేకుండా, ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా, రాష్ట్రం కరువులో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును ముందు కు తీసుకెళ్తే ప్రజలు క్షమించరు’ అని హెచ్చరించారు.
బాధితులకు అండగా ఉంటాం..
మూసీ పరీవాహక ప్రజలకు తాము అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘ప్రజలు లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు తమ గొంతు వినిపించడానికి కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. మా న్యాయ విభాగం సహాయం కోరుతామని చెప్తున్నారు. వారందరికీ మేము అండగా ఉంటాం. బాధితుల పక్షాన పోరాడుతాం’ అని స్పష్టంచేశారు.
పరిశ్రమలకు విద్యుత్ కొరత
రాష్ట్రంలో ఇప్పుడు పరిశ్రమల పరిస్థితి కూడా దారుణంగా మారిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. వారంలో సుమారు 30శాతం కార్యకలాపాలను జనరేటర్లపై నడుపాల్సి వస్తున్నదని పరిశ్రమల యజమానులు వాపోతున్నారని చెప్పారు. విద్యుత్ సరఫరా అయితే యూనిట్‌కు సుమారు రూ.6 నుంచి రూ.7 ఖర్చవుతుందని, డీజిల్ జనరేటర్లపై నడిపితే యూనిట్‌కు సుమారు రూ.35 ఖర్చవుతున్నదని అంటున్నారని, ఇంత భారీ వ్యయంతో పరిశ్రమలు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. ఐటీ పరిశ్రమల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని, సాయంత్రం 6గంటల తర్వాత బయట తిరుగవద్దని ఉద్యోగులకు సూచిస్తున్న పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిరంతరం పనిచేస్తే.. ఇప్పుడు మాత్రం నీటిని ట్యాంకర్ల ద్వారా తెచ్చుకునే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇందుకు సంబంధించిన ఇటీవల వచ్చిన వార్త క్లిప్పింగులను కేటీఆర్ మీడియాకు చూపించారు.
సామర్థ్యం పెరిగినా పవర్ హాలిడేలెందుకు?
కేసీఆర్ హయాంలో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ సామర్థ్యాన్ని సుమారు 7,700 మెగావాట్ల నుంచి 20వేల మెగావాట్లకు పెంచి అప్పగించామని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ సుమారు 19వేల మెగావాట్లకు చేరుకున్నా పవర్ హాలిడేలు ఎందుకు ప్రకటిస్తున్నారని ప్రశ్నించారు. సింగరేణిలో అవకతవకలు, బొగ్గు సరఫరాలో సమస్యలు దీనికి కారణమా? బొగ్గు ఉన్నా విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఇందుకు కారణమా? అని నిలదీశారు. ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించారని, అందులో 34 హామీలు ఇచ్చారని, ఎన్నికల తర్వాత ఇప్పుడు రైతు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన రైతు సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని కేటీఆర్ మీడియాకు చూపించారు.
కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్ ఏమిటి?
కరువు పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్లు నిర్వహించడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. పవర్ హాలిడేలు, సాగు హాలిడేలు ప్రకటించే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొస్తారని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్ గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పందిస్తూ.. తాము పదేండ్ల్లపాటు ఎలాంటి గ్లోబల్ సమ్మిట్లు నిర్వహించకుండానే లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురాగలిగామని స్పష్టంచేశారు. పెట్టుబడులు తేవడానికి ప్రచార ఆర్భాటాలు అవసరం లేదని స్థిరమైన విధానాలు ఉండాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం కరువు, కరెంట్ కోతలు, రైతుల సమస్యలతో సతమతమవుతుంటే ప్రభుత్వం మాత్రం గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నదని విమర్శించారు.
లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడికిపోయాయి?
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వమే అంగీకరించిందని కేటీఆర్ చెప్పారు. 2026 మార్చిలో 9,46,000 ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం.. ప్రస్తుతం 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా చెప్పారని గుర్తుచేశారు. అంటే 7వేల ఉద్యోగాలు తగ్గినట్టు ప్రభుత్వమే ఒప్పుకొన్నదని చెప్పారు. ‘7వేల ఉద్యోగాలు తగ్గితే, మీరు ప్రకటించిన లక్షల కోట్ల పెట్టుబడులు ఎకడికి పోయాయి?, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కుదుర్చుకున్న ఒప్పందాలే పెట్టుబడులా? లేక టెస్సరాక్ట్ వంటి కంపెనీల పేరుతో ప్రకటించినవే పెట్టుబడులా?, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒకసారిగా ఏరోస్పేస్ ఇంజినీర్‌గా మారిపోయినట్టు చెప్తున్నారు. ఈ పెట్టుబడుల్లో వాస్తవమెంత? ప్రచారమెంత? ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
మా నిర్ణయాల విలువ అది..
నాడు కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో యూనిట్‌కు రూ.3.90 చొప్పున 15 ఏండ్ల విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో నేటి పాలకులు విమర్శలు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు అదే పాలక ప్రభుత్వం రూ.15 చెల్లించినా విద్యుత్తు దొరుకడం లేదని చెప్తున్నదని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తాము(బీఆర్ఎస్ ప్రభుత్వం) తీసుకున్న నిర్ణయాల విలువ ఇప్పుడు అర్థమ వుతున్నదని చెప్పారు. మూసీ ప్రాజెక్టుకు కేటాయించిన రూ.1.50 లక్షల కోట్లను వాయిదా వేసి, ఆ నిధులను రైతాంగానికి పంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం హాలిడేలు ప్రకటించే బదులుగా, రైతులకు ఉపశమనం కల్పించాలని సూచించారు.
రాష్ట్రంలో 30శాతం కమీషన్ సర్కార్
రాష్ట్రంలో 30శాతం కమీషన్ సర్కార్ నడుస్తున్నదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ కమీషన్లు రాహుల్‌గాంధీకి చేరుతున్నాయని, రేవంత్‌రెడ్డి రాహుల్‌కు ఏటీఎంలా వ్యవహరిస్తూ అవసరమైనప్పుడు డబ్బులు తీసుకొనే పరిస్థితి ఉన్నదని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్డు టెండర్ల అక్రమాలు, అవకతవకలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. రేడియల్ రోడ్డు వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. టెండర్లలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని నామా రమేశ్ అనే బిల్డర్ చెప్పారని తెలిపారు. సీఎం వైపు నుంచి ఒత్తిడి వల్లే టెండర్లు వేయవద్దని చెప్పారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఇదేనా ప్రభుత్వ ప్రాధాన్యం?
రాష్ట్రంలో సాగునీరు అందక కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘తెలంగాణలో ప్రస్తుతం భయంకరమైన పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం ఒకవైపు 365 కరువు మండలాలను ప్రకటించింది. మరోవైపు రైతులకు నీళ్లు, విద్యుత్ ఇవ్వలేమని చెప్తున్నది. అదే సమయంలో రూ.1.50 లక్షల కోట్లతో మూసీ ప్రాజెక్టుకు ఈ నెల 29న టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నది. రైతులకు నీళ్లు ఇవ్వలేక చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం, కాళేశ్వరం నుంచి 10 టీఎంసీల నీటిని మూసీకి తీసుకొచ్చి, రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టును చేపట్టాలని చూస్తున్నది. ఇది సరైన ప్రాధాన్యతా క్రమమా?’ అని నిలదీశారు.

Ktr
కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కరువు వచ్చినా రైతులు నష్టపోవద్దని ఆలోచించారు. ఇవాళ ఆంధ్రాలో చంద్రబాబు, తకువ వర్షపాతం ఉన్నా నీళ్లందించేందుకు ప్రయత్నిస్తున్నరు. కర్ణాటకలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ తెలంగాణలో ఉన్న తీవ్రత అక్కడ ఎందుకు కనిపించడం లేదు? దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా?. – కేటీఆర్
కాంగ్రెస్ రుద్దిన కరువు ఇది..
రాష్ట్రంలో వచ్చింది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ సర్కార్ ప్రజలపై రుద్దిన కరువు అని కేటీఆర్ విమర్శించారు. ‘గోదావరి, కృష్ణా నదుల నుంచి సుమారు 1,000 టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశాలను ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఈ ఏడాది జూన్ 19న మా పార్టీ బృందం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్లింది. దిగువకు వృథాగా వెళ్తున్న లక్ష క్యూసెకుల నీటిని చూపిస్తూ, రైతులను కాపాడాలని డిమాండ్ చేశాం. అప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే, ఇవాళ రైతులు ఇబ్బందులను ఎదురొనే పరిస్థితి వచ్చేది కాదు. రైతుల సమస్యలను పట్టించుకోకపోతే ప్రభుత్వంపై తమ పోరాటాన్ని ఉధృతం చేస్తాం’ అని హెచ్చరించారు.
‘హైదరాబాద్ ఆగమాగమైపోతున్నది. నేను ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో కూడా నోటీసులు వచ్చినయ్. నీళ్లు తక్కువ ఉన్నయ్.. రాబోయే 20 రోజుల్లో ఇంకా ఇబ్బంది అయితది. జాగ్రత్తగా వాడుకోవాలని చెప్తున్నరు. మా ఇంటి పక్కనున్న ఒక అమ్మాయి వాళ్ల తల్లికి ఫోన్ చేసి హైదరాబాద్‌కు రమ్మంటే.. లేదు లేదు అక్కడ నీళ్ల కరువు ఉందట.. మీరే విజయవాడకు రమ్మని చెప్పిందట’
– కేటీఆర్
రాష్ట్రం ఓ వైపు కరువు, కరెంట్ కోతలతో రైతులు సతమతమవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ పరిస్థితుల్లో గ్లోబల్ సమ్మిట్లు ఎవరి కోసం పెడ్తున్నది?, ఈ మూడేండ్లలో మీరు చేసిన విదేశీ పర్యటనలు ఎన్ని? ఎన్ని ఎంవోయూలు కుదుర్చుకున్నారు? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయి? ప్రజలకు స్పష్టంగా చెప్పాలి. వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
– కేటీఆర్
చాలామంది క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది
తనపై అడ్డగోలు ఆరోపణలు చేసిన చాలామంది క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ తేల్చిచెప్పారు. తాజాగా మాజీ మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్‌కు క్షమాపణ చెప్పిన విషయాన్ని పాత్రికేయులు ఆయన దృష్టికి తీసుకురాగా.. ‘నిజం ఎప్పుడూ నిలకడ మీద తెలుస్తుంది. మొన్న ఒక పత్రిక క్షమాపణ చెప్పింది. ఇప్పుడు కొండా సురేఖ. రేపు ఇంకా చాలామంది క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఫార్ములా ఈ, విద్యుత్తు, ఫోన్ ట్యాపింగ్ ఇలా.. రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు, ఈ ఆరోపణలు చేసినవారే భవిష్యత్తులో క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమె(కొండా సురేఖ) ఏమన్నారో నేను ఇంకా చూడలేదు. చూసిన తర్వాత మా న్యాయ బృందంతో చర్చించి నిర్ణయిస్తాను’ అని స్పష్టంచేశారు.
పెట్టుబడులు తేవడానికి ప్రచార ఆర్భాటాలు అవసరం లేదు. పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం, స్థిరమైన విధానాలు ఉండాలి. మేము పదేండ్లపాటు గ్లోబల్ సమ్మిట్లు పెట్టకుండానే లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. మరి సీఎం కుటుంబ సభ్యులు కుదుర్చుకున్న ఒప్పందాలే పెట్టుబడులా? లేక టెస్సెరాక్ట్ వంటి కంపెనీల పేరుతో ప్రకటించినవే పెట్టుబడులా? ఇందులో వాస్తవమెంత? ప్రచారమెంత?
– కేటీఆర్
బీఆర్ఎస్ డిమాండ్లు ఇవి..
1. రైతుబంధు బకాయిలు వెంటనే చెల్లించాలి. ఇప్పటికే ఇవ్వాల్సిన మూడు విడతలతోపాటు వచ్చే రబీకి కూడా కలిపి మొత్తం నాలుగు విడతల డబ్బులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి.
2. కౌలు రైతులకు న్యాయం చేయాలి. సుమారు 21లక్షల మంది కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకొని, వారికి రావాల్సిన సాయం వెంటనే అందించాలి.
3. వ్యవసాయ కూలీలకు బకాయిలు చెల్లించాలి. ఇందిరమ్మ పేరుతో వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000 ఇస్తామని హామీ ఇచ్చారు. గత 36 నెలలకు సంబంధించి ఒకొకరికీ రూ.36 వేలు వెంటనే జమ చేయాలి.
4. మూసీ ప్రాజెక్టును తక్షణమే వాయిదా వేయాలి. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సరైన ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఇంత తొందరెందుకు?
5. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం కేటాయించిన నిధులను రైతుల సంక్షేమానికి మళ్లించాలి.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పానికి 700 కిలోమీటర్లు. కృష్ణా నీళ్లను పక్కన 70 కిలోమీటర్లు పక్కకు పారించే తెలివి లేదు ఈ పాలమూరు బిడ్డనని చెప్పుకొనే ముఖ్యమంత్రికి. కానీ 700 కిలోమీటర్లు దాటి తీసుకపోయిండు చంద్రబాబు కోసం. అంత దూరం నీళ్లు కాల్వల ద్వారా ప్రయాణం చేయాలంటే లక్ష ఎకరాలకు సరిపడా నీళ్లు ఆవిరితోనే పోతయ్. దాదాపు 160 టీఎంసీలు కృష్ణాలో ఆంధ్రా వాడుకుంటే.. మన ప్రభుత్వం 20 టీఎంసీలు కూడా వాడుకోలే. ఇంతకన్నా సిగ్గుచేటు ఉంటదా? అందుకే ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ మన నెత్తిన రుద్దిన కరువు.
– కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

