హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నకు ఉరికొయ్యలు, చెరసాలలే మిగిలాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎక్కడ చూసినా అన్నదాతల ఆక్రందనలే కనిపిస్తున్నాయని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన వాపోయారు. ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఉరితాళ్లతో నిరసన తెలుపుతున్న రైతుల ఫొటోలను జత చేస్తూ ట్వీట్ చేశారు. జాతీయ రైతు దినోత్సవం రోజున ఇలాంటి దుస్థితిని చూడాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే కొనుగోలు చేయకుండా ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారం కోసం అడ్డగోలు హామీలు, అధికారం దక్కిన తర్వాత అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ దేవుడెరుగు.. కనీసం మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు అని ధ్వజమెత్తారు. ‘రుణమాఫీ కాదు.. రైతు భరోసా రాదు.. అప్పులు తెచ్చి తిప్పలు.. కొనుగోళ్లకు పాతర, దళారుల జాతర’ అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శనాస్ర్తాలు సంధించారు. తెలంగాణలో ఏ రైతు బిడ్డా ధైర్యం కోల్పోవద్దని, పోరాటాలు మనకు కొత్తేం కాదని, కాంగ్రెస్ కుట్రలపై కలిసికట్టుగా ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు.
భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణమని కేటీఆర్ కొనియాడారు. పీవీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ, ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడి తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత పీవీ నరసింహారావును బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని వెల్లడించారు. పీవీ శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని, నెక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్ అని పేరు పెట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టడమే కాకుండా భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి తీర్మానం పంపిందని, పీవీ కూతురును ఎమ్మెల్సీగా నియమించి గౌరవించిందని గుర్తుచేశారు.
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరేణి కుటుంబ సభ్యులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే మొదటి ప్రభుత్వ రంగ సంస్థగా పేరుగాంచిన సింగరేణి వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. దేశ విద్యుత్తు అవసరాలను తీర్చడంలో మూల స్తంభంగా నిలిచిందని కొనియాడారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సింగరేణి.. బొగ్గు ఉత్పత్తిలో ఏటా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ కార్మికుల పాలిట కల్పవల్లిగా, తెలంగాణకు కొంగుబంగారంగా మారిందని తెలిపారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తే బీఆర్ఎస్ తరఫున వ్యతిరేకిస్తామని, కార్మికులకు అండగా నిలుస్తామని స్పష్టంచేశారు.