KTR | సెక్రటేరియట్లో కూర్చొని నిరర్ధక ఆస్తి అంటున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ‘స్వేదపత్రం’ విడుదల చేశారు. కాంగ్రెస్ శ్వేతపత్రంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆధ్యాత్మిక చింతనతో యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇలాంటి ఆలయం భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా? మేం ప్రాపగండ చేస్తాం అంటరు. ప్రాపగండ చేస్తే యాదాద్రి స్పెషల్ రైళ్లు పెట్టి.. లక్షల, కోట్ల మందిని తీసుకెళ్లెటోళ్లం. భక్తిని భక్తిగానే చూశాం. దాన్ని రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం లేదు. ఇంత అద్భుతమైన పునర్నిర్మాణం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా..? ఏ ప్రభుత్వమైనా చేసిందా? ఆలోచించాలని రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆర్అండ్బీ మంత్రిగా ఉన్న సమయంలో ప్రశాంత్‌రెడ్డి పాలేరుగా పని చేసి సెక్రెటేరియట్ నిర్మించాం. అట్ల నిర్మించిన సెక్రటేరియట్‌ను మీరు కూర్చొని దాన్ని.. నిరర్ధక ఆస్తి అంటున్నారు. అది నిరర్ధకమా? మీరు నిరర్ధకమా ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మేం కట్టిన అమరవీరుల స్మారక స్తూపం, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావొచ్చు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్లు కావొచ్చు. మొన్న శాశ్వతపత్రంలో ఎక్కడున్నయ్ డబుల్ బెడ్రూం ఇండ్లు అంటున్నరు. హైదరాబాద్‌లో మేం కట్టింది లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు’ అని తెలిపారు.
‘డబుల్ బెడ్రూంలు ఇండ్లు 70వేలు ఇచ్చేశాం. 30వేలు చివరి దశలో ఉన్నాయి. మీరే ఇవ్వండి. లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఖర్చుపెట్టింది రూ.9వేలకోట్ల. దాని మార్కెట్ విలువ రూ.50వేలకోట్లు. హుస్సేన్‌సాగర్ వద్ద బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టాం. ఒక్కో అపార్ట్మెంట్ విలువ రూ.కోటి ఉంటుంది. అది రాష్ట్ర సంపద కాదా? దాన్ని శ్వేతపత్రంలో చూపించరా? ఐమ్యాక్ ఎదురుంగ కట్టాం.. అక్కడ ఎంతుంటది అపార్ట్మెంట్ విలువ. అక్కడ రూ.50లక్షల కనీసం విలువ ఉండదా? గత ప్రభుత్వాల 60 ఏళ్ల పాలనలో భవనాల విస్తీర్ణం 30.43లక్షలు ఫీట్లు. ఆరున్నరేళ్లలో మేం 1.02కోట్ల స్కేర్ఫీట్లు కట్టాం. కమాండ్ కంట్రోల్ సెంటర్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు.. జిల్లాల్లో కలెక్టరేట్లు కలిసి ఇంకా కోటి స్కేర్ ఫీట్లు ఇంకా నిర్మాణం ఉంది. 60 ఏళ్లలో నాలుగు లైన రహదారులు 485 కిలోమీటర్లు కడితే.. ఆరున్నరేళ్లలో 669 కిలోమీటర్లు. రెండు వరుసల రహదారులు 60 ఏళ్లపాలనలో 6వేల కిలోమీటర్లు కడితే.. బీఆర్ఎస్ ఆరున్నరేళ్లలో 8,692 కిలోమీటర్లు. ఇది సంపద కాదా? ఇది రాష్ట్ర ప్రజలకు అందించిన సంపద కాదా? అంటూ ప్రశ్నించారు.
‘యువతకు ఉపాధి కల్పనలో ప్రచారానికి పెద్దపీట వేశామన్నారు. ఉద్యోగాలకు అత్యధిక జీతాలు చెప్పులేకపోయాం. నిరుద్యోగులకు అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి చెప్పుకోలేకపోయాం. ఈ రెండు వర్గాలు మాకు దూరమయ్యారు. భారతదేశంలో అత్యధిక జీతాలు తెలంగాణలోనే. అలాగే ఉపాధిని సైతం సృష్టించాం. ప్రైవేటురంగంలో రూ.4లక్షలకోట్ల పెట్టుబడులు.. 24లక్షల ఉద్యోగాలకు కల్పన చేశాం. ఇవన్నీ కాంగ్రెస్ శ్వేతపత్రంలోనే ఉంది. టీఎస్ ఐపాస్ కాకుండా 15లక్షల ఉద్యోగాలు ఇతర రంగాల్లోనే కల్పించాం. ఒకనాడు వలసలకు పేరున్న తెలంగాణకు 14 రాష్ట్రాల ప్రజలు వచ్చి బతుకుతున్నరు. పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి దాదాపు 35లక్షల మంది వలస వచ్చి బతుకుతున్నరంటే.. తెలంగాణ అవకాశాల గనిగా.. ఉపాధి అవకాశాల కల్పతరువుగా మారిందా? లేదా? ఇది సంపదకాదా? ఆలోచించాలని కోరుతున్నాం’ అని కేటీఆర్ అన్నారు.