KTR | కాంగ్రెసోళ్లు బంగారం ఇచ్చేవాళ్లు కాదు.. మెడలో పుస్తెలతాడు ఎత్తుకెళ్లే బ్యాచ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు దండుపాళ్యం బ్యాచ్.. స్టువర్టుపురం దొంగలని ఎద్దేవా చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ముందుగా కొయ్యగుట్టలో అమరవీరుల స్తూపం వద్ద కేటీఆర్ నివాళులర్పించారు. కొయ్యగుట్ట నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్తో కలిసి ఆయన భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మోసాలను ఎండగట్టారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని.. వాటిలో ఒక్క హామీనైనా నెరవేర్చిందా అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో తులం బంగారం లేదు.. స్కూటీలు లేవు.. ఆరు గ్యారెంటీలు లేవని విమర్శించారు. రైతుబంధు లేదు.. రైతు భరోసా లేదని అన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు. అసలు కాంగ్రెస్ చెప్పిన నాలుగు వేల పెన్షన్ ఎవరికైనా వస్తుందా అని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు పేరుతో రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు అని అన్నారు. మోదీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ తోడు దొంగలని ఆరోపించారు. రేవంత్, ప్రధాని మోదీ మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
రేవంత్ రెడ్డి ఏనాటికైనా బీజేపీ మనిషే, ఆయన కప్పుకున్న ముసుగు తొలగించి చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను కోరారు. రేవంత్ ఏనాటికీ కాంగ్రెస్ మనిషి కాలేడని, ఆయన ముందు నుంచి బీజేపీ మనిషి అని, రేవంత్ ముమ్మాటికి బడే భాయ్ తమ్ముడు అని కేటీఆర్ అన్నారు. అందుకే రాష్ట్రంలోని మైనారిటీలు, మత రాజకీయాలను వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి కప్పుకున్న బీజేపీ ముసుగును తొలగించి చూడాలని, ఆయన లోపల ఉన్న బీజేపీ నాయకుడిని గుర్తించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అధికారంలో ఉన్నాం కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఓటు వేయాలని కాంగ్రెస్ చెప్తున్న వాదన అర్థరహితమన్నారు. అధికారంలో ఉండి గత రెండు సంవత్సరాల్లో ఏం చేశారో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలన్నారు. ఒకవేళ రానున్న రెండు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే.. ఆ తరువాత మా ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా పట్టణాలను కాంగ్రెస్ కంటే గొప్పగా గతంలో మాదిరి అభివృద్ధి చేస్తామని కేటీఆర్ అన్నారు. మైనారిటీలకు, బీసీలకు భారీ ఎత్తున బడ్జెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలైతే కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు పొందిన వాళ్లు మాత్రమే ఆ పార్టీకి ఓటు వేయాలని, మిగిలిన వాళ్లు ఆ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రూ. 4000 పెన్షన్, రూ. 2500 రూపాయలు మహిళలకు, మరోవైపు విద్యా భరోసా కార్డు గానీ, రైతు భరోసా గానీ, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం వచ్చిన వాళ్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఇవేవీ ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎందుకు పోయారో బాన్సువాడ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు.