Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అజెండాగా మారిపోయిందని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని సుప్రీంకోర్టే చెప్పిందని తెలిపారు. సుప్రీంకోర్టు చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినా.. రేవంత్ రెడ్డి సర్కార్ నోటీసులు ఇవ్వడమేంటని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డికి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుందని కేటీఆర్ విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. హరీశ్‌రావును చూసి రేవంత్ సర్కార్‌కు వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు.
చట్టం, న్యాయస్థానాలపై తమకు పూర్తి గౌరవం ఉందని కేటీఆర్ తెలిపారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలు భయపడరని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామన్నారు.