KTR | కేంద్రంలోని మోదీ సర్కారు తెచ్చిన చట్టాలను బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే త్వరగా తెలంగాణలో రేవంత్‌రెడ్డి అమలు చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బడే భాయ్ కోసం రేవంత్ రెడ్డి చేసిన పని ఇదేనని.. ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. కాంగ్రెస్-బీజేపీ కలిసి నడిపిస్తున్న ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. శంషాబాద్‌లో బీఆర్ఎస్ మైనార్టీ నేతలతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు వంద గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారని.. తులం బంగారం ఇస్తాం.. యువతులకు రూ.2500 ఇస్తాం.. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామని అరచేతిలో స్వర్గం చూపించారని విమర్శించారు.
అదేదో సినిమాలో కోడిని వేలాడదీసి దాన్నే చికెన్ అనుకోమన్నట్లు.. ఇక్కడ కూడా అన్ని చెప్పారని.. కానీ ఒక్కటి కూడా అమలు చేయట్లేదని విమర్శించారు. మైనార్టీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని.. కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని మండిపడ్డారు. 2018లో ఎన్నికలు గెలిచిన తర్వాత మహమూద్ అలీని కేసీఆర్ డిప్యూటీ సీఎంని చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ లేరని.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనైనా ఒక్క మైనార్టీ లీడర్‌ను కూడా ఎన్నుకోలేదని ధ్వజమెత్తారు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లాంటి వారు కూడా కాంగ్రెస్‌కు కనిపించట్లేదా..? అంటూ నిలదీశారు.
ఎమ్మెల్సీ ఇచ్చినట్లే ఇచ్చి అజారుద్దీన్‌ను పక్కన పెట్టేశారని.. క్రికెట్లో అజారుద్దీన్ కట్ షాట్లు కొడితే.. ఇక్కడ అజారుద్దీన్‌నే రేవంత్ రెడ్డి కట్ చేసేశారని.. రెండేళ్లలో ఏం చేశారని నిలదీస్తే వాళ్లు చెప్పేది ఒక్కటే ఒక్కటి.. అది ఫ్రీ బస్ మాత్రమేనన్నారు. మహిళలకు ఫ్రీ బస్ అంటారు.. పురుషులకు టికెట్ రేట్ డబుల్ చేశారని ఆరోపించారు. ఇలాంటి మైనార్టీ సమావేశాలు ప్రతి జిల్లాలో జరగాల్సిన అవసరం ఉందని.. తెలంగాణలో కేసీఆర్ మరోసారి రావాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగనున్నాయని.. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు మైనార్టీలంతా కలిసి రావాలని కోరారు. జూబ్లీహిల్స్‌లో గెలుపు ఖాయమైందని.. కానీ మెజార్టీ ఎంత అన్నదే తేలాలన్నారు.