KTR | రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా, తెలంగాణకు ద్రోహం చేయడంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని, దానివల్ల తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఆర్మూరు బీజేపీ నాయకురాలు ఆలూరు విజయభారతి, పలువురు బీజేపీ నాయకులు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నారు. గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన భవనాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడానికి తాపత్రయ పడుతున్నారు. ఆ కత్తెర పట్టుకుని జాగ్రత్తగా తిరగండి,” అంటూ కేటీఆర్ సెటైర్ వేశారు. ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. గతంలో కేసీఆర్ పునాది వేసిన భవనాలను ప్రారంభించి వచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ‘వికృతమైన’ మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. గత ముఖ్యమంత్రులతో పోల్చి చూసి రేవంత్‌ను బండ బూతులు తిడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేయకపోవడాన్ని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. “గోదావరి నీళ్లను దిగువకు పంపి చంద్రబాబు కడుతున్న కనకచెర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు తరలించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నాడు. ఇది మోదీ, చంద్రబాబు ఆదేశాల మేరకే జరుగుతోంది” అని అన్నారు. మోదీ, చంద్రబాబు ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి గోదావరి నీళ్లను కిందికి పంపించేందుకు కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “కాళేశ్వరం నీళ్లు ఆగకుండా, గోదావరి నీళ్లు కిందికి వెళ్లి చంద్రబాబు కడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి తమిళనాడుకు వెళ్లాలనేది కేంద్రంలోని బీజేపీ, రేవంత్‌కు ఇచ్చిన ఆదేశం. అందుకే రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై పగ పట్టారు,” అని కేటీఆర్ తెలిపారు.