హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుటిల రాజకీయాల వల్లే దేశంలోని మహిళా లోకానికి దకాల్సిన రిజర్వేషన్లు వెంటనే దకకుండా పోయాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు పలికినా, డీలిమిటేషన్ పేరుతో కావాలనే బీజేపీ చికుముడి పెట్టి బిల్లు విఫలమయ్యేలా చేసిందని ధ్వజమెత్తారు. మహిళా సాధికారతపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని నేటి పరిణామాలతో తేలిపోయిందని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ను అనవసరంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంతో ముడిపెట్టడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై కేటీఆర్ శుక్రవారం ఓ ప్రకటనలో తీవ్రంగా స్పందించారు. ‘ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఎలాంటి సమస్య వచ్చేది కాదు. కానీ మహిళల రిజర్వేషన్ల అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టి దేశ మహిళల భుజాల మీద నుంచి దక్షిణాది రాష్ర్టాల గొంతు కోయాలని బీజేపీ చూసింది’ అని విమర్శించారు. దక్షిణాది రాష్ర్టాల ఆందోళనలు, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకుపోవడంతో చారిత్రక అవకాశం జారిపోయిందని వాపోయారు.
లోక్‌సభ సాక్షిగా మహిళా రిజర్వేషన్ల పేరుతో బీజేపీ ఆడిన నాటకాన్ని దేశ ప్రజలు కండ్లారా చూశారని కేటీఆర్ తెలిపారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మహిళా రిజర్వేషన్ల బిల్లుతో వారిని వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా బీజేపీ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే, డీలిమిటేషన్ నిబంధన లేకుండా కేవలం మహిళా రిజర్వేషన్ల కోసమే కొత్త బిల్లు ప్రవేశపెట్టి, వచ్చే ఎన్నికల నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ అత్యంత సంక్లిష్టమైనదని దేశంలోని అనేక రాజకీయ పార్టీలు తెలిపాయని గుర్తుచేశారు. ప్రస్తుత విధానంలో దక్షిణ భారతదేశానికి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గడం ప్రమాదకరమని చెప్పిన విషయాన్ని ఇప్పటికైనా బీజేపీ గుర్తించాలని హితవుపలికారు.
దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని డీలిమిటేషన్ అంశంపై విసృ్తత చర్చ, సంప్రదింపులు చేపట్టాలని కోరారు. డీలిమిటేషన్ అంశంపై మొండిగా ముందుకుపోవడం కుదరదనే విషయం తాజా పరిణామాలను బట్టి బీజేపీ బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది తమ హకు అని గుర్తుచేశారు. జమ్ముకశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో దేశవ్యాప్త డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా సీట్ల పెంపు చేపట్టిన కేంద్రం.. తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నదని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో, దేశవ్యాప్త డీలిమిటేషన్ అంశానికి సంబంధం లేకుండా, తెలంగాణ అసెంబ్లీ సీట్లను 2028లోపు పెంచేలా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని, స్వయం సమృద్ధి సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. విద్యార్థులు తమపై తాము నమ్మకం ఉంచుకొని, ఉజ్వల భవిష్యత్తు కోసం కష్టపడాలని ఉద్బోధించారు. టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో పలువురు విద్యార్థులకు కేటీఆర్ శుక్రవారం ల్యాప్‌టాప్‌లు అందజేశారు.
మాజీ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సారధ్యంలో కేటీఆర్‌ను కలిసిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు విభూతి జైన్, రీనా హిందోచా మాట్లాడుతూ పేద విద్యార్థినుల విద్యాసాధికారత లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా బస్తీలు, వెనుకబడినవర్గాల విద్యార్థినులను గుర్తించి, వారికి సాలర్షిప్లు, మెంటార్షిప్ అందిస్తున్నట్టు తెలిపారు. ఫౌండేషన్ కృషిని కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. లాప్‌టాప్‌లు అందుకున్న నామాల రేష్మ, సలికంటి శ్రీవాణి, చింతగుట్ట వేదశ్రీ, ధుళ్ల రాజేశ్వరి, అతికా బారి, సనా సుల్తానా, కర్రె ఆర్తి సంతోషం వ్యక్తంచేశారు.