KTR | కలుషిత తాగునీరు తాగి సంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మరణించిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతపై మండిపడ్డారు. తెలంగాణ అంతటా తాగునీరు సరఫరా చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసిందని తెలిపారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ది చేసి రాష్ట్రమంతటా తాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును కూడా రేవంత్ సర్కార్ సరిగ్గా నిర్వహించలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంజీవన్రావుపేటలో కలుషిత నీటి సరఫరా వల్ల జరిగిన మరణాలు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్నవారికి తగిన సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు తెలంగాణలో మరెక్కడ జరగకుండా చూసుకోవాలన్నారు.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట గ్రామంలోని బీసీ కాలనీలో కొద్దిరోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. మంచి నీరు రాకపోవడంతో అందుబాటులో ఉన్న నీటినే ఆ కాలనీవాసులు తాగారు. కలుషిత నీరు తాగడం వల్ల ఆ కాలనీలో చాలామంది అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 50 మంది తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వారిలో ఇద్దర్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి.. ఒకరిని సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.