హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ల పేరుతో తెలంగాణ నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను గురువారం నందినగర్ నివాసంలో కేటీఆర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు యువతను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని, 420 హామీలు ఇచ్చిందని చెప్పారు. ఇవన్నీ నేటికి కాగితపు ప్రకటనలుగానే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అయినా కూడా కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లుతున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరును బహిర్గతం చేయడమే ఈ ప్రచార పోస్టర్ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పోస్టర్‌ను రూపొందించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి రాజేశ్‌నాయక్ స్పందిస్తూ పోస్టర్లో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశామని, దీనిద్వారా కాంగ్రెస్ మ్యానిఫెస్టో, యూత్ డిక్లరేషన్, 420 హామీలు, రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమాక్క ఇచ్చిన హామీల వీడియోల గురించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, పార్టీ నేత ప్రవీణ్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సతీశ్, నాయకులు పాల్గొన్నారు.
‘నిన్నటి దాకా ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం ఆడబిడ్డల మధ్య కొట్లాట పెట్టి.. ఇప్పుడు మహాలక్ష్మి పేరిట మభ్యపెట్టి అక్కాచెల్లెళ్లు జుట్లు పట్టుకొనేలా చేసిన రేవంత్‌రెడ్డి.. ఎంత పాపం చేశావ్’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలు కొట్టుకునేలా చేసేంతటి దుర్మార్గం మరొకటి ఉంటదా? అని గురువారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం దేవుడెరుగు, కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.2500 చొప్పున అందజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే నిజామాబాద్ పోస్టాఫీసులో మహాలక్ష్మి కోసం మొదలైన ఘర్షణలు పల్లెపల్లెకు పాకే ప్రమాదం పొంచి ఉన్నదని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్ సర్కార్ తస్మాత్ జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు.