KTR | పేద రైతన్నల పక్షాన నిలబడినందుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నన్ను అరెస్టు చేస్తానంటే చేసుకోవచ్చు. తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి, తలెత్తుకొని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా. ఒకసారి కాదు తెలంగాణ ప్రజల కోసం వందసార్లు అయినా జైలుకెళ్తా.
లగచర్ల ఘటనలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలను వదిలేసి కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలు 21 మందిని చిత్రహింసలకు గురిచేశారు. స్థానిక ఎస్పీ దగ్గరుండి రైతులను కొట్టించారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన మా పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో రైతులు తమ ఆవేదన చెప్పుకొని ఏడ్చారు. రైతులు సరిగ్గా నడవలేకపోతున్నారు.
– కేటీఆర్
హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాడు జైలుకు వెళ్లానని, నేడు రాష్ట్ర ప్రజల కోసం వందసార్లు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. గొంతులేని వారికి గొంతుక అయినందుకు, రైతన్నల పక్షాన నిలబడినందుకు అరెస్టు చేస్తామంటే చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి, తలెత్తుకొని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తానని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అక్రమ అరెస్టులతో నోరు మూయించాలనుకోవడం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమని, ప్రజల పక్షాన, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంలో వెనకడుగు వేయబోమని స్పష్టంచేశారు. లగచర్లలో ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు ఘటన దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ నేతలపై ఆ నెపం నెడుతున్నారని విమర్శించారు. లగచర్ల ఘటనలో మొత్తం 55 మందిని అదుపులోకి తీసుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలను వదిలేసి బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే చిత్రహింసలకు గురిచేయడం దారుణమని మండిపడ్డారు. రూ. 50 లక్షల లంచం డబ్బులతో దొరికిన రేవంత్‌రెడ్డి శాడిజంతో ఏదో రకంగా తనను అక్రమ కేసులో ఇరికించాలని చూస్తున్నారని, 11 నెలల్లో ఇలాంటి కుట్రలు అనేకం పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు బయటకు రావాలంటున్న కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తమ ప్రశ్నలకే భయపడుతున్న చిట్టినాయుడు, సింహంలాంటి కేసీఆర్ బయటకొస్తే తట్టుకోగలడా? అని ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ అనేక అంశాలను ప్రస్తావించారు.
కేటీఆర్: ప్రభుత్వ నిర్ణయం మీద ప్రజలు బహిరంగంగా తిరుగుబాటు చేశారు. ఇందులో కుట్ర ఏముంది? రూ. 50 లక్షల లంచం డబ్బులతో దొరికిన నీకు (రేవంత్) అన్నీ కుట్ర లాగానే కనిపిస్తాయి. మీ అల్లుడి కంపెనీ కోసం లాకుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుంది. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్నా కుట్రలాగనే కనిపిస్తుంది. ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధలు పోస్ట్ చేస్తే కుట్రగానే కనిపిస్తుంది. పేద గిరిజన రైతులకు అండగా నిలబడితే అది కుట్రగానే అనిపిస్తుంది. తొమ్మిది నెలలపాటు నీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసి, నీ బెదిరింపులన్నీ తట్టుకొని, చివరికి ఎదిరిస్తే అది నీకు కుట్ర లాగానే అనిపిస్తుంది. పేద రైతన్నల కుటుంబాల మీద అర్ధరాత్రి దాడులు చేసి, అక్రమంగా అరెస్టు చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసినప్పుడు నేను ప్రశ్నిస్తే కుట్రలాగానే అనిపిస్తుంది. ప్రతినిత్యం భయంతో బతికే నీకు ఇవన్నీ కుట్ర లాగానే అనిపిస్తాయి.
లగచర్ల ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత. తొమ్మిది నెలలుగా అక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నా వారిని ప్రభుత్వం పట్టించుకోలేదు. సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రిగానీ, పరిశ్రమలశాఖ మంత్రిగానీ పట్టించుకోలేదు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు వినలేదు. ప్రభుత్వం తమ భూములు లాకుంటున్న భయాందోళనతో ప్రజలు తిరగబడ్డారు. ప్రభుత్వానికి ఎదురైన భంగపాటును కవర్ చేసుకునేందుకే ఇది కుట్ర అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నది. సీఎంకు తన సొంత నియోజకవర్గంపై కూడా పట్టులేదా? అసలు నువ్వేం సీఎంవి. సీఎం నియోజకవర్గంలో కలెక్టర్‌పై దాడి చేసేంత బలమైన వ్యక్తులమా మేము? అలా మేము చేయగలిగితే ఈ ప్రభుత్వం ఉన్నది ఎందుకు? మేము చెబితే రైతులు దాడులు చేస్తారా? ఆ ఊళ్లో కాంగ్రెస్ పార్టీకే అధిక మెజార్టీ వచ్చింది. ఇది సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం. సీఎం నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ వెళ్లి కుట్ర చేసే సీన్ ఉంటుందా? అన్ని పార్టీలకు చెందిన ప్రజలు తిరుగుబాటు చేశారు. నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లయితే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్‌చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెప్తారు. నిజంగా లగచర్లలో మేము కుట్ర చేసినట్లయితే మీడియా వాళ్లు వెళ్లి ఫ్యాక్ట్‌చెక్ చేసుకోవచ్చు. మీరు ఆ గ్రామానికి వెళ్తే ప్రజలే ఏమీ జరిగిందో చెప్తారు.
సీఎం సొంత నియోజకవర్గంలో పరిశ్రమలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎన్నిసార్లు వారితో సమావేశం అయ్యారు? ఎన్నిసార్లు ఆ ప్రయత్నం చేశారు? ప్రజలకు అనుమానాలు ఉన్నప్పుడు వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అకడి ఎమ్మెల్యే అయిన సీఎం రేవంత్‌రెడ్డికి లేదా ? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఫార్మా సిటీకి 14 వేల ఎకరాలు సేకరించినప్పుడు ప్రజలను ఒప్పించి సమకూర్చి పెట్టారు. 2013 భూసేకరణ చట్టం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందే. అందులో ఉన్న అనేక ఆటంకాలను అధిగమించి కేసీఆర్ ఫార్మాసిటీ కోసం 14 వేల ఎకరాలు సేకరించారు. దానిని పకన పెట్టడం వెనక రేవంత్‌రెడ్డి అంతర్యమేమిటి?
గొంతులేని వారికి గొంతుక అయ్యా. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం అన్నింటికీ సిద్ధంగా ఉన్నా. ఇప్పటికే నాలుగైదు సార్లు అక్రమ కేసుల్లో ఇరికించాలని ప్రయత్నించారు. అన్నింటికీ సిద్ధపడే ఉన్న. నా మీద కేసు పెడితే నేను ఊరుకుంటా అనుకుంటే రేవంత్‌రెడ్డి అంత పిచ్చోడు మరొకరు ఉండరు. జైలు నుంచి వచ్చాక కూడా మరింత దూకుడుగా పోరాటం చేస్తా.
లగిచర్లలో అర్ధరాత్రి వేళ ఇండ్లు, పొలాలపై పడి 55 మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారేమైనా తీవ్రవాదులా? మెడికల్ ఎగ్జామిన్ చేయకుండా తీసుకెళ్లారు. మీడియాలో రైతుల నడక తీరుచూస్తుంటే పోలీసులు కొట్టారని తెలియడం లేదా? ఈ ఘటన జరిగినప్పుడు అకడ లేని బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా తీసుకెళ్లి అమానుషంగా కొట్టారు.
అవును. లగచర్ల ఘటనలో పూర్తిగా ఇంటెలిజెన్స్, పోలీసుల వైఫల్యం ఉన్నది. అభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలో పోలీసులు ఎందుకు అకడ లేరు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు భారీగా పెరిగాయి. రైతులకు ఆ భూములే ఆసరా అయ్యాయి. అలాంటి భూములను గుంజుకుంటా అంటే వారికి కోపం రాదా? కడుపు మండిన రైతులు తిరగబడతారని తెలియదా? నిఘా వ్యవస్థ నిద్రపోతున్నదా? మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఏదో నా పేరు చెప్పాడని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు రాశారు. కానీ, అదంతా బక్వాస్ అని ఆయన లేఖ రాశారు. దాని ఆధారంగా హైకోర్టుకు వెళ్తాం.
బీఆర్ఎస్ హయాంలో అనేక రిజర్వాయర్లు, ప్రాజెక్టుల నిర్మాణం, ఫార్మాసిటీ కోసం ప్రజలను ఒప్పించి భూములు తీసుకున్నాం. కేసీఆర్ ముచ్చర్లలో మంచి ఉద్దేశంతో ఫార్మా సిటీని పెట్టారు. అందుకోసం చైనాకు వెళ్లి అకడ 70 వేల ఎకరాల్లో ఉన్న తయారీ పరిశ్రమను పరిశీలించి వచ్చారు. ఎకానమీ ఆఫ్ సేల్ అనే ప్రయోజనం ఉండేలా ఫార్మాసిటీని ప్లాన్ చేశారు. ఫార్మాసిటీ కోసం 8 ఏండ్లు కష్టపడ్డాం. 14 వేల ఎకరాల భూమి సేకరించాం. కొడంగల్‌లో భూముల సేకరణకే ఇంత గొడవ జరిగితే ముచ్చర్లలో ఎంతో విలువైన భూములు ఉన్నాయి. వాటిని సేకరించే విషయంలో ఇంకా ఎంత గొడవ జరగాలి? కానీ, మేము రైతులను ఒప్పించి వారికి నచ్చచెప్పి భూసేకరణ చేశాం. బీఆర్ఎస్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలం వందలమార్లు భూసేకరణ కోసం ప్రజల వద్దకు వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి వారిని ఒప్పించాం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, కోదండరెడ్డి తదితరులు భూములు ఇవ్వవద్దని రైతులను రెచ్చగొట్టారు. కాంగ్రెస్ నేతల మాదిరిగా ఎకరాకు రూ.20 లక్షలు అడగండి, రూ.30 లక్షలు అడగండి అని ప్రజలను మేము ఎవరం రెచ్చగొట్టడం లేదు కదా? కేసులు సమస్యలకు పరిషారం కాదు. ప్రజలను ఒప్పించి, మెప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఉండాల్సిందే.. రేవంత్‌రెడ్డి మాత్రం పేగులు మెడలో వేసుకుంటా, లాగులో తొండలు వదులుతా.. గుండ్లు పీకి గోటీలాడుతా.. కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అనొచ్చు.. మేము మాత్రం ఏమీ అనొద్దా? మేమేమీ మునీశ్వరులం కాదు. సర్వసంగ పరిత్యాగులం కాదు. కచ్చితంగా స్పందనకు ప్రతిస్పందన ఉంటుంది. తిట్టుకు మరింత ఘాటైన తిట్టుతోనే సమాధానం చెప్తాం. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఫినిష్ చేస్తా అంటాడు. ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో. నీ పదవికి ఎసరు పెట్టడానికి నల్లగొండ, ఖమ్మం బాంబులు వేచి చూస్తున్నాయి.
అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేదు. అసలు అధికారం వస్తుందని కలలో కూడా నేను ఊహించలేదు. పదేండ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వడాన్ని అదృష్టంగా భావించా. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలని నేను కోరుకుంటున్న. వాళ్లు పూర్తికాలం అధికారంలో ఉంటేనే మళ్లీ బీఆర్ఎస్ 15 ఏండ్లపాటు అధికారంలోకి ఉం టుంది. దేశంలో ఎన్నికల సంసరణలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్మ్‌ల కన్నా ఎకువ సార్లు సీఎం, పీఎం ఉండకుండా చేయాలని కోరుత.
ఫార్మాసిటీ కోసం మేము సేకరించిన భూమి అంతా కూడా కండీషనల్ ల్యాండ్. ఆ భూమిని వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదు. కానీ, రేవంత్‌రెడ్డి హైకోర్టు కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. కోర్టులో ఫార్మాసిటీ ఉన్న ది అంటారు. బయట రద్దయింది అంటారు. ఒకసారి ఫోర్త్‌సిటీ అంటారు. మరోసారి ఫ్యూచర్‌సిటీ అంటారు. ఇంకోసారి ఏఐసిటీ అంటారు. మరోసారేమో స్కిల్ యూనివర్సిటీ అంటారు. ఈ సిటీల కోసం ఈ ప్రభుత్వం ఒక ఎకరం ల్యాండ్ అయినా సేకరించిందా? ఫార్మాసిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తే ఊరుకోం. ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తామంటే కుదరదు.
లేదు. మేమంతా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ద్వారా ప్రజాక్షేత్రంలోకి వచ్చాం. నేనుగానీ, హరీశ్‌రావుగానీ, కవితగానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ఓట్లతో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాం. కానీ, రేవంత్‌రెడ్డి సోదరులు మాత్రం రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. ఏ హోదాలో కలెక్టర్ కార్యాలయాలకు వస్తున్నారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూర్చుతున్నారు. రేవంత్‌రెడ్డి తన బావమరిదికి అమృత్ టెండర్లు కట్టబెట్టారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అనధికారికంగా అధికారం చెలాయిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మా పార్టీ ఎమ్మెల్యేలను లగచర్లకు వెళ్లకుండా అడ్డుకుంటారు. స్థానిక బీజేపీ ఎంపీ డీకే అరుణను ప్రజలను, రైతులను కలువకుండా పోలీసులు వెనక్కి పంపిస్తారు. కనీసం వార్డ్ మెంబర్ కూడా కానీ సీఎం సోదరుడు తిరుపతిరెడ్డిని 200 వాహనాలతో అనుమతిస్తారా? దీనికి డీజీపీ బాధ్యత వహించరా? తిరుపతిరెడ్డికి ఎదురేగి కలెక్టర్ ఎలా స్వాగతం పలుకుతారు?
ఇచ్చిన హామీలు అమలుపై మాకే రేవంత్‌రె డ్డి సమాధానం చెప్పలేక భయపడుతున్నారు. ఇక సింహంలాంటి కేసీఆర్ వస్తే తట్టుకోగలరా? ప్రతి అంశంలో కేసీఆర్ యాది చేసుకుంటున్నరు. కేసీఆర్ మౌనానికి కూడా రేవంత్ జడుసుకుంటున్నరు. ఆయన ఎప్పు డు బయటకు రావాలో తెలుసు.
ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు కాదు.. అర గ్యారెంటీ అమలు చేసిందా? రైతుబంధు ఇచ్చిందా? రుణమాఫీ పూర్తిచేసిందా? పెంచుతానన్న పింఛన్ పెంచిందా? తులం బంగారం ఇచ్చిందా? ఏ హామీలు అమలుచేసిందని ప్ర జా విజయోత్సవాలు నిర్వహిస్తున్నది? సెక్యూరిటీ లేకుండా ప్రజల మధ్యకు వెళ్తే ప్రజాపాలనో.. పాశవిక పాలనో తెలుస్తుంది.
వీళ్లకు ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదు. ప్రాజెక్ట్‌లు ఎలా పూర్తి చేయాలో తెలియడం లేదు. ప్రాజెక్ట్‌లు కట్టాలంటే, పెట్టుబడులు తేవాలంటే ఎంతో కష్టపడాలి. మా ప్రభుత్వంలో ప్రాజెక్ట్‌లు పూర్తిచేసేందుకు హరీశ్‌రావు ఎంత కష్టపడ్డారో గుర్తులేదా? రూ.16,000 కోట్లతో మూసీ పునరుజ్జీవం జరిగేలా మేము అన్నీ సిద్ధం చేశాం. కానీ, మూసీ పునరుజ్జీవం పేరుతో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తారంట. ఇప్పుడు ప్రైవేట్ వాళ్లే మూసీ ప్రాజెక్టు చేపడతారని కొత్త రాగం అందుకున్నారు. ప్రైవేట్ సంస్థలు ఏ లాభం లేకుండా ప్రాజెక్టులు కడతాయా? అయినా పేదోడి ఇల్లు ఉంటే మురుగు నీళ్లు వస్తాయని అంటున్నారు. ఇల్లు కూలగొట్టి పెద్ద బిల్డింగ్లు కడితే వాటి నుంచి సుగంధం వస్తుందా? అసలు వీళ్లు డీపీఆరే లేదు అంటున్నారు. మరి డీపీఆర్ లేకుండా ఎందుకు ముందుకు వెళ్తున్నట్టు. పేదల ఇండ్లు ఎందుకు కూల్చుతున్నట్టు? కేవలం ఢిల్లీకి మూటలు పంపించేందుకే మూసీ ప్రాజెక్ట్‌ను ముందు పెట్టుకున్నారు. మూసీమే లూటో ఢిల్లీమే బాటో.. అనేది కాంగ్రెస్ సిద్ధాంతం.
రేవంత్‌రెడ్డికి నేనంటే చాలా ప్రేమ ఉన్నట్టు ఉంది. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న. నన్ను అరెస్టు చేసి ప్రశ్నించే గొంతు నొక్కాలని మొదటి నుంచి సీఎం కుట్రపన్నుతున్నారు. డ్రగ్స్ కేసు అన్నారు.. నేను డ్రగ్స్ తీసుకోలేదు కనుక చిక్కలేదు. ఫోన్లు ట్యాపింగ్ అన్నారు. నేను చేయించలేదు కనక దొరకలేదు. ఈ-కార్‌రేస్‌లో ఉచ్చు అన్నారు. అవినీతి చేయలేదు కాబట్టి చిక్కలేదు. చివరికి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నట్టు ఆరోపణ మోపి అక్రమ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. మోడీనే మోడీయా.. బో డీయా? ఏం చేసుకుంటావో చేసుకో అన్నాను. ఇప్పుడు చిట్టినాయుడికీ అదే చెప్తున్న ఏం చేసుకుంటావో చేసుకో. ఎంత ధైర్యం ఉంటే నేను ఈ మాట అనగలుగుతాను. నిజాయితీకి ఉన్న ధైర్యమే అది.
పూర్తి అబద్ధం. ఘటన జరిగిన 12వ తేదీనాడు ఒక్కసారిగా కూడా మాట్లాడలేదు. 11వ తేదీనాడు ఒక్కసారి మాట్లాడారు. అక్టోబర్ నుంచి కాల్‌డాటా తీసి 40సార్లు ఫోన్చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. కార్యకర్తల నుంచి ఫోన్లు వచ్చినంత మాత్రాన పట్నం నరేందర్‌రెడ్డి నిందితుడు అవుతారా? నరేందర్‌రెడ్డి కేటీఆర్‌కు ఫోన్ చేసినంత మాత్రాన కేటీఆర్ నిందితుడు అవుతారా? మరి అదే రోజు నేను వ్యవసాయ అధికారులకు, డీజీపీకి కాల్ చేశాను. వారిని కూడా నిందితులుగా చేరుస్తారా? మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద కత్తికడతారా? సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ఎలా భూములివ్వరో చూస్తాం అని చెప్పడం సమంజసమా? నరేందర్‌రెడ్డి ఏదైనా గ్రామానికి వెళ్లి ప్రజలను రెచ్చగొట్టారా? ప్రతిపక్ష పార్టీ నేతగా కచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల తరపున ప్రశ్నిస్తారు. అందులో తప్పేముంది? మీరు ప్రజలకు మేలు కలిగే పనిచేస్తే వారికి నచ్చచెప్పి ఒప్పించండి. జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ స్వయంగా తన మీద ఎలాంటి దాడి చేయలేదు అన్న మాటలు ఇప్పటికే రికార్డ్ అయి ఉన్నాయి. నిరక్షరాస్యులైన రైతులకు ఎవరు ఆర్డీవో, ఎవరు కలెక్టర్ అనే విషయం తెలుస్తుందా ? జరిగిన ఘటన మీద కక్షగట్టి వ్యవహరిస్తారా? పెద్ద మనసుతో జరిగిన ఘటన మీద సమీక్ష చేసుకోరా? ప్రభుత్వం నడిపే విధానం ఇదేనా?
నేను ఢిల్లీకి పోయింది కాంగ్రెస్ వాళ్ల మీద ఫిర్యాదు చేయడానికి. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో గోల్మాల్ జరుగుతున్నది. రేవంత్‌రెడ్డి తన బామ్మర్దికి అమృతం పంచి ప్రజలకు విషం పంచాలని చూస్తున్నారు. చర్యలు తీసుకోండి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశాను. అమృత్ టెండర్ల స్కామ్‌లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీతో దోస్తీ మాకు అవసరం లేదు. కానీ, కాంగ్రెస్ వాళ్లు ఇకడ గల్లీల్లోనే బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. తెలంగాణలో ఆర్ఆర్ (రాహుల్-రేవంత్) ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపిస్తారు.. కానీ, చర్యలు తీసుకోరు. ఇది బడేభాయ్.. చోటేభాయ్ మధ్య ఉన్న బంధానికి సాక్ష్యం కాదా? కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా పనిచేస్తున్నరు?
కేసీఆర్ ఎడ్డెం అంటే.. మనం తెడ్డెం అనాలనేది రేవంత్‌రెడ్డి పాలసీ. కేసీఆర్ చేసిన దానికి వ్యతిరేకంగా చేయాలన్న ఉద్దేశంతోనే ఫార్మాసిటీకి ఫార్మా విలేజ్ అని పేరు మార్చి మేము చేసిన దానికి విరుద్ధంగా చేస్తున్నారు. 14 వేల ఎకరాల్లో ఒకే చోట పరిశ్రమలు ఉండాలనే ఆలోచనలో ఫార్మాసిటీ అన్నాం. ఫార్మాసిటీ పర్మిషన్ కోసం కేంద్రంలో ఉన్న వాళ్లు చెప్పిన అన్ని కండిషన్స్ ఒప్పుకోని 18 నెలలు కష్టపడితే పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు ఆయన ప్రతిపాదిస్తున్న ఫార్మా విలేజ్‌లకు పర్మిషన్ రావడానికి కూడా ఏడాదికిపైగా సమయం పడుతుంది. ఈ ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు. అందుకే రాగానే ఫార్మాసిటీ రద్దు అంటూ ప్రకటన చేసేశాడు. రేవంత్‌రెడ్డి 20 చోట్ల ఫార్మా విలేజ్‌లు పెడతా అంటున్నారు. ఆ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు ప్రయత్నిస్తున్నారు. వెల్దండలో వాళ్ల బంధువులు, కుటుంబసభ్యులకు భూములు ఉన్నాయి. ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ అంటూ రేవంత్‌రెడ్డి మాటలు చెప్తున్నారు. కానీ సాధ్యం కాదు. నేను గతంలో పరిశ్రమల మంత్రిగా చేసిన అనుభవంతో చెప్తున్న ఒక చోటు నుంచి మరొక ప్లేస్‌కు పరిశ్రమలను తరలించటం అనేది అంత సులువైన పని కాదు.
రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే గతంలో మానవ హకుల గురించి మాట్లాడిన కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్‌లాంటి వాళ్లు ఎందుకు మాట్లాడటం లేదు. ఈ అంశంపై బాధితులను ఢిల్లీకి తీసుకెళ్లి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్‌ను కూడా కలుస్తాం. రేవంత్‌రెడ్డి సర్కారు అమానవీయ చర్యలు జాతీయ స్థాయిలో ఎండగడతాం.
పోలీసులు రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ రైతులను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. రైతులపై దాడికి పోలీసులు కూంబింగ్ ఆపరేషన్‌కు వెళ్లినట్టు వెళ్లారు. ఒక అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి ఆమె భర్తను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని ఆ అమ్మాయి మీడియాతో చెప్తూ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. సామాన్య ప్రజలపై ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? పోలీసులు, ఐపీఎస్ అధికారులకు ఇంత స్వామి భక్తి ఉండొద్దు. మళ్లీ నాలుగేండ్ల్ల తర్వాత మేమే అధికారంలోకి వస్తాం. తప్పు చేసిన అధికారుల విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతుందో అదే జరుగుతుంది.
అవును. ప్రజలు వద్దన్నా కచ్చితంగా చేస్తాం అంటే చూస్తూ ఊరుకోవాలా? తెలంగాణలో ఏమైనా రాచరికం నడుస్తుందా? రాజ్యం చట్టాన్ని అడ్డగోలుగా వాడుకుంటుంది అంటే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. బీఆర్ఎస్ నేతల మీ ద ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోం డి. ఇకడ ఎవరూ కేసులకు భయపడేవా రు లేరు. కోర్టుల్లో తేల్చుకుంటాం. ప్రజలపక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం.