KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పందించారు. కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో ఏపీ , తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్న విషయం తెలిసిందే. సమావేశం అనంతరం సీఎం రేవంత్, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. భేటీలో బనకచర్ల అంశం చర్చకు రాలేరని.. ఇప్పటికే ఉన్న పిర్యాదులు సహా అన్ని విషయాలు ఏర్పాటయ్యే కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
సీఎం రేవంత్ ముసుగు వీడిందని.. నిజం తేటతెల్లమయ్యిందని.. 48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. నిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి.. తెలంగాణ వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు బూడిదే మిగిలిందన్నారు. బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించారని.. గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం కోసమా నువ్వు గద్దెనెక్కింది? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. జై తెలంగాణ అనడానికి ఉన్న సిగ్గు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల హక్కులను చంద్రబాబుకి ధారపోయడానికి మాత్రం లేదా? అంటూ నిలదీశారు.
కోవర్టులు ఎవరో, తెలంగాణ కోసం కొట్లాడిన వారు ఎవరో.. ఈరోజుతో తేలిపోయిందన్నారు. నీ గురువుపై విశ్వాసం చూపించడానికి తెలంగాణ విధ్వంసం కావాల్సిందేనా అంటూ తీవ్రంగా స్పందించారు కేటీఆర్. ఇంకెందుకు రెండు రాష్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు? నిన్ను ఎన్నుకున్న పాపానికి చెరిపేయి సరిహద్దులు! తెలంగాణా మీద నీ అక్కసు చల్లారుతుందేమో జై తెలంగాణా అనాల్సిన బాధ నీకు తప్పుతుందేమోనని వ్యాఖ్యానించారు. ఒక్క బొట్టు నీరు అక్రమంగా అప్పజెప్పినా.. మరో పోరాటం చూస్తావు గుర్తు పెట్టుకో అంటూ సీఎం రేవంత్‌ను హెచ్చరించారు. ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి, తరిమి కొడతామని.. ప్రాంతం వాడు మోసం చేస్తే ఇక్కడే పాతి పెడతాం.. తెలంగాణను పీక్కుతింటున్న రాబందుల పని తప్పకపడతామంటూ హెచ్చరించారు.
ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యింది!
48వ ఢిల్లీ పర్యటన గుట్టురట్టయ్యిందినిధులు రాహుల్ గాంధీకి, నీళ్లు చంద్రబాబుకి, తెలంగాణా వ్యతిరేకిని ముఖ్యమంత్రిగా గెలిపించినందుకు….బూడిద తెలంగాణ ప్రజలకి!
బనకచర్ల గురించి చర్చే రాలేదని బుకాయించి….
గురుదక్షిణగా గోదావరి జలాలను అప్పచెప్పడం…— KTR (@KTRBRS) July 16, 2025