KTR | చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్పా ఏం విషయం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. ఫార్ములా ఈ రేసులో ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌కు వచ్చిన నేతలతో మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఈ ఫార్ములా కార్ రేస్‌పై చర్చ పెట్టాలని అడిగితే రేవంత్‌రెడ్డి పారిపోయిండు. ఫార్ములా-ఈ రేస్‌పై నేనేదో తప్పు చేసిన.. కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని అంటున్నవ్ కదా.. దమ్ముంటే చర్చపెట్టు అసెంబ్లీలో పట్టుపడితే పారిపోయిండు. నాలుగు గోడల మధ్యల ఎందుకు.. నాలుగు కోట్ల మంది ముందు మాట్లాడుదామంటే పారిపోయిండు. పోనీ ఇట్ల కాదు బద్నాం క్యాంపెయిన్ ఎన్ని రోజులు నడుపుతవ్..? ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అడగని విధంగా నేను అంటున్నా.. నువ్వు ముందుకు రా నేను తప్పు చేయలేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి.. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుంటా.. నువ్వు కూడా రా అంటే పత్తా లేడు’ మండిపడ్డారు.
‘అయినా, మళ్లీ విచారణకు వెళ్లాను. న్యాయస్థానాలపై నమ్మకం ఉన్న వ్యక్తులుగా ఎన్నిసార్లు పిలిచినా వస్తా అని చెప్పినా. పొద్దున నుంచి తొమ్మిది గంటలు ఒకటే ప్రశ్న.. అటు తప్పి.. ఇటు తిప్పి అడుగుడు. ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దని.. మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత.. రెండో సంవత్సరం కూడా ఇక్కడే ఉండాలని.. ప్రభుత్వపరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించాం. ఒక్క రూపాయి కాదు పైసా అవినీతి జరుగలేదు. ఇక్కడి నుంచి పైసా పోయింది అక్కడ ఉన్నది. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ అధికారులను అడిగితే సమాధానం లేదు. ఏందంటే.. ఫైల్ ఇటు పోయిందా.. ఇటుకేలి పోయిందా.. కుడిచేతిలో నుంచి ఇచ్చిన పైసలు.. ఎడమ చేతిలో నుంచి పైసలు ఇచ్చినవా.. అంటూ పనికి మాలిన ప్రశ్నలు తప్పా.. చిట్టినాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్పా ఏం లేదు విషయం. మొన్న చెప్పినా ఇవాళ చెప్పిన.. ఇది లొట్టపీసు కేసు. ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రి. వీళ్లతోని ఏది కాదు. పరిపాలన చేతకాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ధైర్యం లేదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ కమిషన్ ముందుకు పిలిచారు. అంతకు ముందు హరీశ్‌రావును కమిషన్ ముందుకు పిలిచారు’ అని గుర్తు చేశారు కేటీఆర్.
‘ఆయనకు ఒకటే షోకు. నేను నెల రోజులు జైలులో ఉన్న లుచ్చా పని చేసి.. వీళ్లను కూడా కొన్నిరోజులు జైలుపెట్టాలి అన్నదే ఆయనకున్న షోకు, పైశాచిక ఆనందం ఒక్కటే. శాడిస్టులు కొందరు ఉన్నట్లు.. నాకు దక్కనిది ఎవరికీ దక్కద్దు అన్నట్టు.. నాకు జరిగింది నీకు జరగాలి అన్నట్లుగా జైలులో పెట్టాలన్నదే షోకు. అందుకే ఇవాళ అధికారులకు నేను చెప్పిన.. మీకు పై నుంచి ఆదేశాలు రావొచ్చు ఇప్పటికే.. వస్తే పెడితే జైలులో పెట్టుకొమ్మని చెప్పాను. పదిహేను రోజులు రెస్ట్ తీసుకొని వస్తానని చెప్పాను. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. తప్పు చేయలేదు.. తలదించుకునే పని ఎంతమాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేశాం. తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకెళ్లాం తప్పా తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావొచ్చు.. ఫార్ములా ఈ కావొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్, హరీశ్‌రావును పిలిచి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మన కార్యకర్తల, నేతల ఆత్మస్థయిర్యం దెబ్బతీసే ప్రయత్నం కమిషన్ ముందు చేస్తున్నారు. ఇక్కడ ఏసీబీ అని పెట్టి.. ఎలాంటి అవినీతి జరగని కేసులో.. అవినీతి నిరోధకశాఖను ఇన్వాల్వ్ చేశారు. మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న చెప్పిండు.. నా చరిత్రలో ఇంత తుఫేల్ కేసు ఎప్పుడూ చూడలేదు.. 26 సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా పని చేసినా.. ఇలాంటి కేసు చూడలేదన్నారు’ అన్నారని కేటీఆర్ తెలిపారు.