Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. తన పిరికితనాన్ని మరోసారి చాటుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి ఆయన చేసిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఇచ్చిన లీగల్ నోటీసులకు సమాధానం చెప్పలేక నానాతంటాలు పడుతున్నారు.
ఆ నోటీసుల్లో ప్రస్తావించిన అంశాలపై రేవంత్ నోరు మెదపకపోగా తిరిగి కేటీఆర్‌కే నోటీసులు పంపారు. లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటానని మంత్రి కేటీఆర్‌ను బెదిరించే ప్రయత్నం చేశారు. దీన్ని గమనిస్తే లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని రేవంత్ బతిమాలుతున్నట్టు, బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇద్దరు చేసిన తప్పునకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని చూసిన రేవంత్‌రెడ్డి.. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలున్నాయంటూ ఇటీవల మీడియా ముందు ఏవేవో మాట్లాడారు. తీరా ఆ ఆధారాలను ఇవ్వాలని నోటీసులు జారీచేయడంతో తెల్లమొహం వేశారు. కనీసం ఒక్క ఆధారాన్ని కూడా సమర్పించలేక పత్తాలేకుండా పారిపోయారు. ఆయన తీరును చూసి సొంత పార్టీ నేతలతోపాటు అరకొర రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు సైతం నవ్వుకుంటున్నారు. దీంతో ఈ అంశాన్ని రేవంత్ ఉద్దేశపూర్వకంగానే రాజకీయం చేసినట్టు సుస్పష్టమవుతున్నది.
తెలంగాణ ఉద్యమంతో మంత్రి కేటీ రామారావుకు సంబంధం లేదని, అందుకే ఆయనకు నిరుద్యోగుల బాధ తెలియదని రేవంత్ తన నోటీసుల్లో పేర్కొనడంపై బీఆర్ఎస్ నేతలతోపాటు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నువ్వెక్కడున్నావంటూ రేవంత్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎవరి పంచన కీలుబొమ్మగా ఉన్నావో గుర్తుచేసుకోవాలని హితవు పలుకుతున్నారు.తెలంగాణ విముక్తి కోసం అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొన్న కేటీఆర్.. 2006లోనే మాతృభూమికి తిరిగొచ్చి ఉద్యమ బాట పట్టిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.